మోత్కుపల్లికి మరోసారి అవమానం….!

సీనియర్ నేత మోత్కుపల్లికి అక్కడ కూడా అవమానం జరిగిందా? పార్టీలో చేరి తన పవర్ ఏంటో చూపించాలనుకున్న మోత్కుపల్లికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మోత్కుపల్లి వల్ల పార్టీకి ఉపయోగం లేకపోగా, నష్టమని తెలుసుకున్న పవన్ కల్యాణ్ చివరినిమిషంలో మోత్కుపల్లి భేటీని వాయిదా వేసినట్లు చెబుతున్నారు. ఇది వాయిదా కాదని, ఇప్పట్లో పవన్ కల్యాణ్ మోత్కుపల్లిని కలిసే అవకాశం లేదని తెలుస్తోంది. మోత్కుపల్లి నరసింహులు ఇటీవల తెలుగుదేశం పార్టీని, చంద్రబాబునాయుడును తీవ్రంగా విమర్శించి పార్టీ నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. టీడీపీ మోత్కుపల్లిని బహిష్కరించింది.

టీఆర్ఎస్ లో చేరాలనుకున్నా……

అయితే మోత్కుపల్లి తొలుత టీఆర్ఎస్ లోచేరాలని భావించారు. అయితే ఎందుకో ఇప్పటి వరకూ అక్కడ వర్క్ అవుట్ కాలేదు. మోత్కుపల్లికి సీటు కేటాయించడం కష్టమని భావించిన కేసీఆర్ ఆయన చేరిక విషయాన్ని పక్కన పెట్టారని తెలుస్తోంది. మోత్కుపల్లి పార్టీలో చేరితే మరో గ్రూపు తయారవుతుందే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని భావించిన కేసీఆర్ మోత్కుపల్లి విషయమే తెలీదనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో మోత్కుపల్లి ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో ఏదో ఒక పార్టీలో చేరి తన ఉనికిని కాపాడుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు.

జనసేనలో చేరాలనుకుంటే….

అందులో భాగంగానే జనసేనలో చేరాలని ఆయన భావించారు. సీపీఎం, సీపీఐ, జనసేన కలసి పోటీ చేస్తాయి కాబట్టి అందులో చేరితే తనకు కొంత కలసి వస్తుందని భావించారు. పవన్ కల్యాణ్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పైనే దృష్టి పెడతున్నారు కాబట్టి తెలంగాణ జనసేన పార్టీకి తానే ప్రధాన నేతగా మారతానని కూడా మోత్కుపల్లి భావించారు. అందుకే ఇటీవల కాలంలో పవన్ పై తరచూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. జనసేనలో చేరేందుకు ఆయన పవన్ తో టైమ్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. తాను జనసేనలో చేరబోతున్నట్లు అనుచరులకు కూడా చెప్పారు.

చివరి నిమిషంలో రద్దు…..

అయితే చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ తో మోత్కుపల్లి భేటీని జనసేన పార్టీ కార్యాలయం రద్దు చేసింది. ఇందుకు పవన్ వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారని కారణాలు చూపినప్పటికీ అసలు విషయం వేరే ఉందంటున్నారు. మోత్కుపల్లి పై పవన్ కల్యాణ్ కు కొన్ని అనుమానాలు ఉండటమే ఈ భేటీ రద్దు కారణమన్న వాదన విన్పిస్తోంది. మోత్కుపల్లి తన వ్యక్తిగత అవసరాల కోసమే పార్టీలో చేరుతున్నారని, జనసేనను తెలంగాణలో బలోపేతం చేయడానికి కాదని పవన్ కు ఆయన సన్నిహితులు చెప్పారు. దీంతో పవన్ మనసు మార్చుకుని మోత్కుపల్లితో భేటీ రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మోత్కుపల్లికి మరోసారి అవమానం ఎదురయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*