మోత్కుపల్లి మళ్లీ ఎంట్రీ ఇస్తారా?

తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, తెలంగాణ టీడీపీలో ముఖ్య నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు రాజకీయ పయనం ఎటువైపు అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకి వీరవిధేయుడు. తనను చంద్రబాబు గవర్నర్ ని చేస్తారనే నమ్మకం ఆయనకు ఎక్కువ. ఈ మేరకు మోత్కుపల్లికి చంద్రబాబు నాయుడు హామీ కూడా ఇచ్చారు. దీంతో ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికి గవర్నర్ గిరి చేసుకుందామనుకున్నారు ఆయన. అయితే, ఇప్పుడు రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారాయి. కేంద్ర ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీకి చెడింది. దీంతో మోత్కుపల్లి గవర్నర్ పదవి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దీంతో మళ్లీ ప్రత్యక్ష రాజకీయాలపై దృష్టి పెట్టారు మోత్కుపల్లి.

ఇంత కష్టపడితే చివరకు మిగిలింది ఇదా…?

తెలంగాణ ఏర్పడక ముందు నుంచే టీటీడీపీలో మోత్కుపల్లి స్వరం పెద్దదిగా ఉండేది. ఆయన ప్రస్తుత ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఒంటికాలితో విరుచుకుపడేవారు. అయితే, గవర్నర్ గిరిపై ఉన్న హామీతో ఎవరితో పెట్టుకోవడం ఎందుకని గత రెండుమూడేళ్లుగా ఇతర పార్టీలపై విమర్శలు మానేశారు. కానీ, అనేక రాష్ట్రాలకు గవర్నర్లను నియమించినా మోత్కుపల్లికి మాత్రం కేంద్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆ పదవిపై ఆయన ఆశలు సన్నగిల్లుతూ వచ్చాయి. ఇక లాభం లేదనుకుని మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల వైపు దృష్టి సారించారు. గత రెండు ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లా నుంచి పోటీ చేసిన ఆయన ఈసారి తనను ఐదుసార్లు గెలిపించిన ఆలేరు నియోజకవర్గం అయితేనే సేఫ్ అని భావిస్తున్నారు. యాదాద్రి జిల్లా సాధన పేరుతో యేడాదిన్నరగా మళ్లీ నియోజకవర్గంలో యాక్టీవ్ అయ్యారు. తన పాత అనుచరులనంతా కూడగట్టారు. కానీ, టీడీపీ స్వంతంగా పోటీ చేస్తే గెలవడం కష్టమనుకున్నారో, మరేదైనా కారణమో గానీ టీఆర్ఎస్ లో పార్టీని విలీనం చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. దీంతో ఆయన స్వంత పార్టీ నేతల దృష్టిలోనే విలన్ గా మారిపోయారు. చంద్రబాబు నాయుడు కూడా పక్కన పెట్టేశారు. టీటీడీపీ నేతలు సైతం ఆయనకు ప్రాధాన్యం తగ్గించారు. దశాబ్దాలుగా పార్టీకి సేవచేస్తూ, కష్టకాలంలోనూ చంద్రబాబుకు అండగా ఉన్న తనను పార్టీ ఇప్పుడు పట్టించుకోవడం లేదని మోత్కుపల్లి మధనపడుతున్నారు.

కారెక్కేనా..?

ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరిలో జరిగిన తెలుగుదేశం పార్టీ మినీ మహానాడుకు కూడా ఆయన హాజరుకాలేదు. దీంతో మోత్కుపల్లి అనుచరులు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ ముందే ఆందోళన చేశారు. తమ నేతను పట్టించుకోవడం లేదని వాపోయారు. దీంతో మోత్కుపల్లి పార్టీ మార్పుపై చర్చ మొదలైంది. గతంలో చేసిన విమర్శలు మరిచిపోయి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాలని ఆయన భావిస్తున్నారు. ఇందుకోసం గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసుకున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే నెలలోనే ఆయన కారెక్కడం ఖాయమంటున్నారు. అయితే, ఇప్పటికే అలేరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ నుంచే గొంగిడి సునీత ఉండటంతో మోత్కుపల్లికి కేసీఆర్ ఏ హామీ ఇచ్చి పార్టీలో చోటిస్తారో చూడాలి. ఇప్పటికే సీనియర్ నేతల వలసలతో తెలంగాణలో నామమాత్రంగా తయారైన టీడీపీకి మోత్కుపల్లి పార్టీ మారితే మాత్రం గట్టి దేబ్బే అవుతుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*