ముద్ర‌గ‌డకు రెండే ఆప్ష‌న్లా?

కాపుల రిజ‌ర్వేష‌న్ల కోసం పోరాడుతున్న మాజీ మంత్రి ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం అడుగులు ఎటువైపు ప‌డ‌తాయ‌నే చ‌ర్చ ఏపీలో జోరందుకుంది. ఆయ‌న కూడా రాజ‌కీయాల్లో త‌న సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టాల‌ని భావిస్తున్నారు. దీంతో ఆయ‌న రాక‌ కోసం ఇప్పుడు మూడు పార్టీల నేత‌లు వేచిచూస్తుండ‌టంతో తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. జిల్లాలో బ‌ల‌మైన కాపు సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఆయ‌న వ‌స్తే త‌మ పార్టీల‌కు కొండంత బ‌లం చేకూరుతుంద‌ని ఆయా పార్టీల నేత‌లు స్ప‌ష్టంచేస్తున్నారు. ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్‌, కాపు ఉద్య‌మానికి త‌న వంతు సాయం చేస్తూ వ‌స్తున్న ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌తో పాటు బీజేపీ కూడా ఆయ‌న కోసం ద్వారాలు తెరిచేసింది.

పాదయాత్ర అడుగుపెట్టడంతో…

బీజేపీతో క‌లిసే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టంచేస్తుండటంతో.. అటు జ‌న‌సేన‌, ఇటు వైసీపీ నాయ‌కుల మ‌ధ్య తీవ్ర పోటీ నెల‌కొంద‌ట‌. ప్ర‌స్తుతం జ‌గ‌న్ పాద‌యాత్ర తూర్పుగోదావ‌రి జిల్లాలో అడుగుపెట్ట‌డంతో చ‌ర్చ‌లు జోరందుకున్నాయ‌ని విశ్లేష‌కులు అంచనా వేస్తున్నారు. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం 2019 ఎన్నిక‌ల‌ బ‌రిలోకి దిగాల‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని స‌న్నిహితులు స్ప‌ష్టంచేస్తున్నారు. అయితే ఆయ‌న ఏ పార్టీ నుంచి ఇప్పుడు పోటీచేస్తార‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అటు వైసీపీ, ఇటు జ‌న‌సేన పేర్లు బ‌లంగా వినిపిస్తున్నాయి.

చంద్రబాబుపై నిప్పులు…..

కొద్ది కాలం నుంచి టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై త‌న ఆక్రోశాన్ని లేఖ‌లు, నిర‌స‌న‌ల రూపంలో ముద్ర‌గ‌డ ప్ర‌క‌టిస్తూనే ఉన్నారు. కొన్నాళ్లుగా సైలెంట్ అయిపోయిన ఆయ‌న‌.. రాజ‌కీయ పునఃప్ర‌వేశంపై అనుచ‌రుల‌తో మంత‌నాలు జ‌రుపుతున్నార‌ట‌. ఏ పార్టీలో చేరితో త‌న‌కు మైలేజ్ వ‌స్తుంద‌నే అంశంపై తీవ్రంగా చ‌ర్చిస్తున్నార‌ట‌. ఇందులో భాగంగా ఆయ‌న ముందు రెండు దారులు ఉన్నాయంటున్నారు అనుచ‌రులు. కాపుల్లో సెంటిమెంట్ రెచ్చ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారంటూ ముద్ర‌గ‌డ చేపట్టిన ఉద్య‌మాన్ని ఉక్కుపాదంతో చంద్ర‌బాబు స‌ర్కారు అణిచివేస్తున్న సంగ‌తి తెలిసిందే! ఆయ‌న వెనుక వైఎస్సార్‌సీపీ ఉంద‌ని, ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ చెప్పిన‌ట్లు ముద్ర‌గ‌డ‌ ఆడుతున్నారంటూ ఒక‌వైపు టీడీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ ప్ర‌చారంలో నిజానిజాల మాటెలా ఉన్నా.. ముందు నుంచి ముద్ర‌గ‌డ వైపు సానుకూలంగానే జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అంతేగాక గ‌త ఎన్ని క‌ల్లో కాపులు పార్టీకి దూర‌మ‌య్యారని, అందుకే సీట్లు ఎక్కువ‌గా సాధించ‌లేక‌పోయాననే భావ‌న ఆయ‌న‌లో క‌నిపిస్తూనే ఉంది.

ముద్రగడను చేర్చుకోవాలని….

ఇప్పుడు కాపునేత‌గా పేరున్న ముద్ర‌గ‌డ చేరితే.. కాపులు వైసీపీ వైపు నిలిచే అవ‌కాశాలున్నాయని జ‌గ‌న్ భావిస్తున్నారు. ప్ర‌స్తుతం జ‌గ‌న్‌కు పెరుగుతోంద‌న్న విష‌యాన్ని కూడా స‌న్నిహితులు గుర్తుచేస్తున్నారు. ఇక వైసీపీ కాక‌పోతే జ‌న‌సేన.. ముద్ర‌గ‌డ‌కు మ‌రో ఆప్ష‌న్‌. ముఖ్యంగా ఒకే సామాజిక‌వ‌ర్గానికి చెందిన ప‌వ‌న్ చెంత‌కు చేర‌డంతో ఆయ‌న‌కు సముచిత స్థానం దక్క‌వ‌చ్చే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. గ‌త ఎన్నిక‌ల్లో ప‌వన్ హ‌వాతో టీడీపీ గుంప‌గుత్త‌గా కాపుల ఓట్లు ద‌క్కించుకుంది. కానీ ఈసారి మాత్రం ప‌వ‌న్ ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతున్నారు.

పవన్ తో నడిస్తే…..

దీంతో కాపులు టీడీపీకి స‌పోర్ట్ చేసే అవ‌కాశాలు త‌క్కువ‌గా ఉన్నాయని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఈ త‌రుణంలో ప‌వ‌న్‌తో క‌లిసి న‌డిస్తే.. ప‌వ‌న్ స్టార్‌డ‌మ్‌తో పాటు సామాజిక‌వ‌ర్గబ‌లం కూడా అండగా ఉంటుంద‌నే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఇరు పార్టీల నేత‌ల‌కు ప్ర‌స్తుతం కాపు సామాజిక‌వ‌ర్గ అండ చాలా ముఖ్యం. ఈ నేప‌థ్యంలో ముద్ర‌గ‌డ ఎటువైపు మొగ్గుచూపుతారనే ప్ర‌శ్న ఎదుర‌వుతోంది. అలాగే త‌న కుమారుడు రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోసం కూడా ఆయ‌న ఓ డెసిష‌న్ తీసుకోవాల‌ని చూస్తున్న‌ట్టు సమాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*