ములాయం ముగింపు చెప్తారా?

ఉత్తరప్రదేశ్ లో కమలంపార్టీ కూటమిని కకావికలం చేయడానికి రెడీ అవుతోంది. అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో మొన్నటి వరకూ మంచి పట్టుంది. గతంలో జరిగిన లోక్ సభ స్థానాల్లో 80 స్థానాలకు గాను 71 స్థానాలను సాధించుకుంది. రాష్ట్రాన్ని కూడా కమలం పార్టీయే కైవసం చేసుకుంది. దీంతో యూపీలో తమకు తిరుగులేదని భావించిన కమలనాధులకు ఉప ఎన్నికలు షాకిచ్చాయి. గోరఖ్ పూర్, పుల్పూర్ స్థానాలను విపక్షాలు కైవసం చేసుకోవడంతో కమలం పార్టీ కంగుతినింది.

ఇగోలను పక్కనపెట్టి……

ఉప ఎన్నికల్లో విపక్షాల విజయానికి కారణం అన్నీ కలసికట్టుగా పోటీ చేయడమే కారణమన్నది అందరికీ తెలిసిందే. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ యూపీలో మహాకూటమికి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, కాంగ్రెస్, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు కలిసి పోటీ చేసి కమలం పార్టీని ఢిల్లీకి దూరం చేయాలన్న నిర్ణయానికి వచ్చాయి. మోదీ మరోసారి ప్రధానమంత్రి అయితే ఇక పుట్టగతులుండవని భావించిన యూపీ ప్రాంతీయ పార్టీలన్నీ తమ ఇగోలను పక్కనపెట్టి ఒక్కటవుతున్నాయి.

కుటుంబ గొడవలను……

ఈ నేపథ్యంలో ములాయం కుటుంబంలోని గొడవలను తమకు అనుకూలంగా మలచుకోవాలనుకుంటోంది భారతీయ జనతా పార్టీ. ములాయం సింగ్ యాదవ్ కుటుంబంలో గత ఎన్నికల్లోనే చిచ్చు రేగింది. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత కుటుంబ సభ్యులు రోడ్డెక్కారు. ములాయం కుటుంబం రెండు వర్గాలుగా చీలిపోయింది. ములాయంసింగ్, శివపాల్ యాదవ్ ఒక వర్గం కాగా, అఖిలే‍్ యాదవ్ మరో సోదరుడు రాంలాల్ యాదవ్ మరో వర్గంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత ములాయంను, శివపాల్ యాదవ్ ను పార్టీ బాధ్యతల నుంచి అఖిలేష్ తప్పించారు.

రంగంలోకి దిగిన ములాయం…….

దీంతో శివపాల్ యాదవ్ గతకొన్నాళ్లుగా హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నారు. ములాయం సింగ్ యాదవ్ ను తిరిగి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే కొత్త పార్టీ పెడతానని చెబుతున్నారు. దీనికి అఖిలేష్ నుంచి స్పందన రాకపోవడంతో శివపాల్ యాదవ్ ఇటీవల సమాజ్ వాదీ సెక్యులర్ మోర్చా అనే పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని వెనక ములాయం ఉన్నారని తొలుత అంతా భావించారు. కానీ ములాయం సింగ్ మాత్రం తనకు చెప్పకుండానే తన సోదరుడు శివపాల్ యాదవ్ పార్టీని ప్రకటించారని, తాను సోదరుడితో మాట్లాడతానని ఒక ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. శిపపాల్ యాదవ్ వెనక బీజేపీ ఉందన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాధ్ శివపాల్ యాదవ్ కు పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నారన్నది అఖిలేష్ వర్గం ఆరోపణ. కొత్త పార్టీతో ఎస్పీ ఓటు బ్యాంకులో చీలిక తెచ్చి లబ్దిపొందుదామని బీజేపీ చేస్తున్న ప్రయత్నాలకు ములాయం త్వరలోనే గండికొడతారని చెబుతున్నారు. శివపాల్ యాదవ్ చేత తిరిగి సవరణ ప్రకటన చేయిస్తారని అంటున్నారు. మొత్తం మీద ములాయం కుటుంబంలో రేగిన చిచ్చును ఆపేందుకు పెద్దాయన చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో చూడాలి.