పొలిటికల్ లయన్….ను ఎవరూ నమ్మడం లేదా?

ఎంవీ మైసూరా రెడ్డి! ఆయ‌న స‌న్నిహితులు ముద్దుగా ఈయ‌నను పిలుచుకునేది రాజ‌కీయ సింహం అని! నిజంగానే ఆయ‌న రాజ‌కీయాల్లో సింహం మాదిరిగానే ఓ వెలుగు వెలిగాడు. త‌న‌కు తిరుగులేద‌ని అనిపించుకున్నారు. అయితే, ఆయ‌న స్వ‌యంగా తీసుకున్న నిర్ణ‌యాలు, దుందుడుకు వ్య‌వ‌హారాలు ఇప్పుడు ఆయ‌న‌కు రాజ‌కీయ చ‌రిత్ర‌నే మిగిల్చాయి త‌ప్పితే.. భ‌విష్య‌త్తును నిర్ణ‌యించలేక పోతున్నాయి. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోలాహ‌లం ప్రారంభ‌మైన నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీ చేయాల‌ని భావిస్తున్నా.. ఆయ‌న‌ను ఎవ‌రూ న‌మ్మే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ముఖ్యంగా టీడీపీ అదినేత చంద్ర‌బాబు ఈయ‌న‌ను ద‌గ్గ‌ర‌కు రానిచ్చేందుకు కూడా జంకుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తుండ‌డం ఎంవీకి ఇబ్బందిక‌రంగా మారింది.

మంత్రిగా…

విష‌యంలోకి వెళ్తే.. వృత్తి రీత్యావైద్యుడు అయిన ఎంవీ.. వైద్య వృత్తిని మానేసి 1981 లో రాజకీయాలలోకి ప్రవేశించారు. పంచాయితీ ఎన్నికలలో కమలాపురం సమితి ప్రెసిడెంటుగా గెలుపొందారు. తర్వాత శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి అందులో 25 సంవత్సరాలు కొనసాగారు. 1983 శాసనసభ ఎన్నికలలో ఓటామిపాలై 1985, 1989 మరియు 1999 ఎన్నికలలో విజయం సాధించారు. 1994లో తెలుగుదేశం అభ్యర్థి వీరశివారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కోట్ల విజయభాస్కరరెడ్డి మంత్రివర్గంలో హోం మంత్రిగానూ, నేదురుమల్లి జనార్ధనరెడ్డి మంత్రివర్గంలో రవాణామంత్రిగానూ పనిచేశారు.

అన్ని పార్టీలు మారి…..

తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి క‌డ‌ప ఎంపీ స్థానానికి పోటీ ప‌డి ఓడిపోయారు. ఆ త‌ర్వాత రాజ్యసభకు ఎన్నికయ్యారు. చంద్ర‌బాబు రాజ్య‌స రెన్యువ‌ల్ చేయ‌లేద‌ని… తెలుగుదేశం పార్టీ నుండి బయటికివచ్చి త‌న‌కు బ‌ద్ధ శ‌త్రువు అయిన వైఎస్ త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్ పెట్టిన వైసీపీలోకి మారారు. ఆ పార్టీ కేంద్ర క‌మిటీ సభ్యుడిగా అతి కీలక బాధ్యతలు చేపట్టారు. 2016 లో అనూహ్యంగా మ‌ళ్లీ ఆ పార్టీని కూడా వ‌దిలేశారు. అయితే, ఇప్పుడు మ‌ళ్లీ ఆయ‌న టీడీపీలో చేరేందుకు పావులు క‌దుపుతున్నారు. కానీ, గ‌త అనుభ‌వాల రీత్యా ఆయ‌న‌ను పార్టీలోకి చేర్చుకునేందుకు చంద్ర‌బాబు విముఖ‌త ప్ర‌ద‌ర్శిస్తుండ‌డం ఆయ‌న‌కు తీవ్ర ఇబ్బందిక‌రంగా మారింది.

అందరూ అనుకున్నారు కానీ…

వాస్త‌వానికి క‌డ‌ప‌లో టీడీపీ నాయ‌కుడు సీఎం ర‌మేశ్ మంచి హ‌వాపై ఉన్నారు. ఈయ‌న ద్వారా ఇప్ప‌టికే రెండు సార్లు చంద్ర‌బాబుకు రాయ‌బారం జ‌రిపారు. తాను పార్టీలోకి వ‌స్తాన‌ని చెప్పారు. నిజానికి క‌డ‌ప‌లో వైఎస్ జ‌గ‌న్‌ను గ‌ట్టి దెబ్బ కొట్టాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో ఎంవీకి ఆహ్వానం ప‌లుకుతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, గ‌తంలో పార్టీలోకి వ‌స్తే క‌డ‌ప ఎంపీ సీటు ఇచ్చారు చంద్ర‌బాబు. ఆ త‌ర్వాత రాజ్య‌స‌భ సీటు ఇచ్చారు. అయినా కూడా ఎంవీ టీడీపీపై విశ్వాసం చూపించ‌లేక పోయారు. ముఖ్యంగా అధినేత చంద్ర‌బాబును వైసీపీలో ఉండ‌గా దారుణంగా విమ‌ర్శ‌లు కూడా చేశారు. ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ఇప్పుడు ఎంవీని పార్టీలోకి చేర్చుకోవ‌డంపై ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని స‌మాచారం. దీంతో ఎంవీ పొలిటిక‌ల్ ఫ్యూచ‌ర్ అడ‌క‌త్తెర‌లో పోక‌చెక్క‌లా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*