బాబుకు ఎర్త్ పెట్టాలంటే…!!!

ఒక్కదెబ్బకు మూడు పిట్టలు కొట్టాలని చూస్తోంది తెలంగాణ రాష్ట్రసమితి. తెలుగుదేశం పార్టీ కాంగ్రెసుతో కలిసి ప్రజాకూటమి కట్టిన తర్వాత టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఎదురవుతోంది. దీనిని రాజకీయంగా తిప్పికొట్టడానికి పక్కా వ్యూహం తో ముందుకు కదులుతోంది అధికారపార్టీ. అధికారికంగా చూస్తే కాంగ్రెసు, బీజేపీలకు ప్రత్యర్థిగానే టీఆర్ఎస్ కొనసాగుతోంది. తెలుగుదేశం నిన్నామొన్నటివరకూ బీజేపీతో కేంద్రంలో భాగస్వామిగా ఉంది. ప్రస్తుతం కాంగ్రెసుతో చేయి కలిపింది. కేసీఆర్ స్టాండ్ మాత్రం బీజేపీ, కాంగ్రెసులకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు. బలమైన ప్రాంతీయ పార్టీలను ఒకే వేదికపైకి తెచ్చి రాష్ట్రాల డిమాండ్లను నెరవేర్చుకోవాలనేది లక్ష్యం. ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి నడుస్తూ డిమాండ్లు సాధించాలనేది తెలుగుదేశం విధానం. ఈ పద్ధతులను బట్టి చూస్తే తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్రసమితులు సైతం పరస్పరం విభేదించుకునే శక్తులుగానే చెప్పాలి. రెండు ప్రాంతీయపార్టీలే అయినప్పటికీ భిన్నదృక్పథాలను కనబరుస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ పోటీని సైతం సహించే స్థితిలో లేదు టీఆర్ఎస్. దీనికి ప్రతీకారం తీర్చుకోవాలనే దిశలో యోచన చేస్తోంది.

బాబుతో కుస్తీ…

కాంగ్రెసుతో కూడిన జాతీయ ప్రత్యామ్నాయంలో చంద్రబాబు నాయుడు కీలక పాత్రధారి. 2019 ఎన్నికల్లో బీజేపీ, ఎన్డీఏకు పోటీదారుగా ఈకూటమిని నిలపడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. ఆయనకు పోటీదారుగా తాను సైతం జాతీయంగా కీలకంగా మారాలని చూస్తున్నారు కేసీఆర్. నిజానికి వీరిద్దరు కలుస్తున్న ప్రాంతీయపార్టీలు ఒకటే. కాంగ్రెసును మినహాయిస్తే డీఎంకే, జేడీఎస్, టీఎంసీ వంటి పార్టీలను కేసీఆర్ ముందుగానే కలిసి వచ్చారు. బీజేపీ నుంచి వేరుపడిన తర్వాత అవే పార్టీలను కలిసి వచ్చారు చంద్రబాబు నాయుడు. వీటికి మరిన్ని పార్టీలను జోడించారు. ఇప్పుడు వీరిద్దరు తమ కూటములకు ఆధారంగా చూపిస్తున్న పార్టీలు ఎలా నడుస్తాయో చెప్పలేకపోతున్నారు. టీఆర్ఎస్ ఫెడరల్ ఫ్రంట్ కట్టాలంటే పైన పేర్కొన్న పార్టీలు కాంగ్రెసు నుంచి దూరంగా జరిగి జట్టు కట్టాలి. లేదా కేసీఆర్ వాటితో కలిసిపోవాలి. అది జరగకపోతే ఫ్రంట్ అన్న భావన సాకారం కాదు. ఇప్పటికే కాంగ్రెసు ఫ్రంట్ లో చంద్రబాబు తన బెర్త్ ఖాయం చేసేసుకున్నారు. ఒకవేళ నాలుగైదు చిన్నాచితకా పార్టీలను కేసీఆర్ కూడగట్టగలిగితే ఏపీలో సైతం తనకు పార్టనర్ ను వెదుక్కోవాలి. అది టీడీపీకి పోటీదారుగానే ఉంటుంది. తెలంగాణలో కాంగ్రెసును అధికారంలోకి తేవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న చంద్రబాబుతో కుస్తీ పట్టడం తప్పదు.

ఏపీ పార్టీలతో దోస్తీ…

తెలుగుదేశం పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ కు చికాకుగా మారింది. తనకు అధికారం వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ టీఆర్ఎస్ ను గద్దె దించే యత్నాల్లో నిమగ్నమైపోయింది. గతంలో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు చంద్రబాబు నాయుడు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. టీడీపీతో దోస్తీ చేస్తే విమర్శలతోపాటు ప్రభుత్వపాలనలో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో కేసీఆర్ చంద్రబాబు ప్రతిపాదనలను తోసిపుచ్చారు. జాతీయంగా మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెసుకు టీడీపీ చేరువ అయ్యింది. కాంగ్రెసు కోసం పనిచేయకతప్పని స్థితి ఏర్పడింది. టీడీపీకి తెలంగాణలో ఎంతోకొంత బలం ఉండటంతో కాంగ్రెసుకు అది అదనపు మద్దతుగా మారుతోంది. టీడీపీ సొంతంగా విడిగా పోటీ చేసి ఉంటే టీఆర్ఎస్ పెద్దగా బాధ పడే అవకాశం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం మినహా టీడీపీ సాధించేదేమీ ఉండదు. కానీ ఇప్పుడు కాంగ్రెసుతో కలవడంతో కూటమి బలం పెరిగింది. టీఆర్ఎస్ కు దీటైన పోటీగా మారింది. దాంతో ఏపీలో సైతం వైసీపీ,జనసేన వంటి పార్టీలతో దోస్తీ చేయడానికి టీఆర్ఎస్ తహతహలాడుతోంది. తద్వారా టీడీపీకి భవిష్యత్తులో చెక్ పెట్టాలని భావిస్తోంది.

ఫెడరల్ ఫ్రంట్ పేరుతో…

కేసీఆర్ వారసుడు కేటీఆర్ చేసిన కీలక వ్యాఖ్యలు భవిష్యత్తు రాజకీయం ఎలా ఉండబోతోందనేందుకు దర్పణం పట్టాయి. మీరాష్ట్రంలో మేము వేలు పెడతామంటూ నేరుగానే ఆయన టీడీపీని హెచ్చరించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ రూపంలో దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఏకం చేస్తారని చెప్పారు. టీడీపీ ఇప్పటికే కాంగ్రెసు కూటమిలో ఉంది. కాబట్టి ఏపీలో ఫెడరల్ ఫ్రంట్ కు బలమైన పార్టనర్ కావాలి. బీజేపీ, కాంగ్రెసులకు ప్రస్తుతం దూరంగా ఉన్నది వైసీపీ, జనసేనలే. ఈరెండుపార్టీలు తెలంగాణలో పోటీ చేయడం లేదు. వైసీపీకి ఎంతోకొంత బలం ఉన్నప్పటికీ దూరంగా ఉంది. జనసేనానికి సైతం లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. వీరి నివాసాలు సైతం హైదరాబాదే. అయినా ఎన్నికలకు దూరం జరిగారు. తమకు తెలంగాణలో రాజకీయ ఆసక్తులు లేవని తేల్చి చెప్పేశారు. టీఆర్ఎస్ కు కావాల్సింది కూడా అదే. అందువల్ల టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఆయాపార్టీలను కలుపుకుపోవాలని చూస్తోంది టీఆర్ఎస్. ఈ ఎన్నికల్లో ఇప్పటికే వైసీపీ, జనసేన పరోక్షంగా టీఆర్ఎస్ కు తెలంగాణలో మద్దతు ఇస్తున్నాయనే వాదనలు వినవస్తున్నాయి. అయితే ఈరెంటిలో ఏ పార్టీ టీఆర్ఎస్ ఏర్పాటు చేసే కూటమిలో ప్రధానపార్టనర్ గా చేరుతుందో తేలాలి. భవిష్యత్తులో అవసరమైతే ఏపీలో ఈ రెండు పార్టీల మధ్య అంతర్గత అవగాహనకు కేటీఆర్ మధ్యవర్తిత్వం వహించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు పరిశీలకులు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*