ఛాయిస్ నాదెండ్లదేనా…??

nadendla manohar choice where

నాదెండ్ల మనోహర్. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ తో ప్రయాణించి ఇటీవల పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరారు. నాదెండ్ల మనోహర్ ను నిజానికి పార్లమెంటుకు పంపించాలన్నది పవన్ ఆలోచనగా ఉంది. అయితే నాదెండ్ల మాత్రం అసెంబ్లీకే పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తున్నారు. ఇటీవల పవన్ తో తన మనసులో మాటను కూడా నాదెండ్ల చెప్పగా.. ఛాయిస్ నాదెండ్లకే వదిలేస్తూ పవన్ తన నిర్ణయాన్నిచెప్పేశారు. దీంతో ఈసారి తెనాలి నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశముంది. అంతేకాదు రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన…ఆసక్తిరమైన ఎన్నిక అని ఇప్పటి నుంచే చెప్పుకోవాల్సి ఉంటుంది.

ఇమేజ్ పెరిగిందా….?

గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఉన్న తెనాలి నియోజకవర్గం నాదెండ్ల కుటుంబానికి ఒకప్పుడు కంచుకోట అనే చెప్పాలి. నాదెండ్ల భాస్కరరావు కూడా ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ ఐదు సార్లు ఈ నియోజకవర్గంలో గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ మూడుసార్లు విజయం సాధించింది. అందులో రెండు సార్లు నాదెండ్ల మనోహర కావడం విశేషం. నాదెండ్ల మనోహర్ యువకుడు కావడం, డిప్యూటీ స్పీకర్, స్పీకర్ గా ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో పనిచేసినప్పుడు నియోజకవర్గ అభివృద్ధిని బాగానే చేశారు. దీంతో నాదెండ్ల కాంగ్రెస్ లో ఉన్నప్పుడు లేని ఇమేజ్ జనసేనలోకి చేరిన తర్వాత వచ్చిందంటున్నారు.

జనసేనకు జై కొట్టిన తర్వాత…..

రాష్ట్ర విభజన చేసిన కాంగ్రెస్ అంటే పడని ఈ ప్రాంత వాసులు తనకు జై కొట్టరని భావించే ఆయన జనసేనను ఎంచుకున్నారు. నిజానికి వైసీపీలోకి వెళ్లాల్సి ఉన్నా ఆయనకు పార్లమెంటు సీటు ఇస్తామని చెప్పడంతో జనసేన వైపు మొగ్గు చూపారు. జనసేనలో కూడా అదే విషయం రావడంతో నాదెండ్ల జనసేనాని ముందే మొగ్గలోనే తుంచేశారని చెబుతున్నారు. తనకు అసెంబ్లీలో ఉండి ప్రజాసమస్యలను ప్రస్తావించడమే ఇష్టమని నాదెండ్ల తెగేసి చెప్పడంతో పవన్ కూడా తన సమ్మతిని తెలియజేసినట్లు చెబుతున్నారు. దీంతో ఇప్పుడు తెనాలి నియోజకవర్గంలో నాదెండ్ల ఫ్లెక్సీలు ఎక్కడ చూసినా కన్పించడానికి కారణం ఆయన అసెంబ్లీ బరిలో దిగడానికి రెడీ అయిపోయారన్న సంకేతాలేనంటున్నారు.

పోటీ మామూలుగా ఉండదు…..

ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉన్నారు. ఆయనపై ప్రజల్లో అసంతృప్తి ఉందన్నది కాదనలేని వాస్తవం. ఈ ఐదేళ్లలో ఆయన నియోజకవర్గంపై దృష్ఠి పెట్టిందీ పెద్దగా లేదు. అంతేకాకుండా ఆలపాటి గుంటూరులోనే నివాసముంటారన్న అపప్రధను మూటగట్టుకున్నారు. నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శలు ఉన్నాయి. దీంతో ఈసారి టీడీపీ నుంచి మరోసారి ఆలపాటి బరిలోకి దిగితే విజయం కోసం విపరీతంగా శ్రమించాల్సిందేనంటున్నారు. మరోవైపు ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉంది. జగన్ పాదయాత్రకు తెనాలిలో మంచి స్పందన రావడమే దీనికి ఉదాహరణ. ఇక్కడ వైసీపీ ఇన్ ఛార్జిగా అన్నాబత్తుని శివకుమార్ కూడా బలమైన అభ్యర్థే కావడంతో ఈసారి తెనాలిలో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశముందంటున్నారు. తన సొంత బలంతో పాటు పవన్ అండ తనకు అదనమై విజయం తథ్యమని నాదెండ్ల నమ్ముతున్నారు. మరి పవన్ మాత్రం ఛాయిస్ ను నాదెండ్లకే వదలిపెట్టేశారట.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*