పాత‌కాపుల‌కు నాదెండ్ల చెక్‌.. జ‌న‌సేన‌లో జ‌జ్జ‌న‌క‌..!

nadendla manohar grip in janasena party

జ‌జ్జ‌న‌క‌రి జ‌నారే.. పాత‌ నేత‌లు ప‌రారే! అని పాడుకుంటున్నారు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు. తాను రాజకీయాల్లో విప్ల‌వం తెస్తాన‌ని, మార్పు చూపిస్తాన‌ని చెప్పి.. ప్ర‌జాక్షేత్రంలోకి వ‌చ్చిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. పేద‌ల్లోను, ప్ర‌జ‌ల్లోను మార్పు ఏం తెచ్చాడో తెలియ‌దు కానీ, త‌న సొంత పార్టీలో మాత్రం మార్పు తెచ్చుకున్నాడు. ప్ర‌స్తుతం పార్టీలో ఆది నుంచి ఉన్న నాయ‌కులు క‌నిపించ‌డం లేదు. కొత్త‌వారికే ఛాన్స్ అన్న‌ట్టుగా ఇప్పుడు కొత్త‌వారిని వెంటేసుకుని తిరుగుతున్నాడు ప‌వ‌న్. రాజ‌కీయాల్లో ఇలాంటి ప‌రిణామాలు ఓ రేంజ్‌కి వెళ్లాక ఉంటాయి. అయితే, ప‌వ‌న్ లో మాత్రం ఈ మార్పు అప్పుడే క‌నిపించ‌డం వింత‌గా అనిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. విష‌యంలోకి వెళ్తే.. జ‌న‌సేన‌లోకి ఆదిలో కొంద‌రు కీల‌క నాయ‌కులు చేరారు.

పాతకాపులను పక్కన….

అయితే వారి ప‌రిస్థితి రానురాను తీసిక‌ట్టుగా మారిపోయింది. కొత్త‌గా వ‌చ్చిన వారికే ప‌వ‌న్ త‌న చెంత‌న చోటు క‌ల్పిస్తు న్నారు. త‌న ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటున్నారు. పాత‌వారిని దాదాపు ప‌క్క‌న పెట్టేశాడు. మ‌రి వారి ప‌రిస్థితి ఏంటి? ఇదేనా ప‌వ‌న్ మార్పు అంటే? అని ప్ర‌శ్న‌లు ప‌వ‌న్‌కు ఎదుర‌వుతున్నాయి. జ‌న‌సేన‌కు మొదట్లో మారిశెట్టి రాఘవయ్య ఉండేవారు. మొత్తం వ్యవహారాలను ఆయన నడిపేవారు. ఆ తర్వాత పార్టీలోకి కొంత మంది వ్యక్తులు వచ్చిన.. తర్వాత.. ఆయన అవసరం.. పవన్ కల్యాణ్‌కు పెద్దగా కనిపించలేదు. దీంతో ఆయ‌న‌లోని లోపాల‌ను వెతికిన ప‌వ‌న్‌.. మ‌న‌సు క‌ష్ట‌ప‌డేలా వ్య‌వ‌హ‌రించ‌డంతో మారిశెట్టి జ‌న‌సేన నుంచి దూరంగా జ‌రిగిపోయారు. ఇక‌, ఈ ప్లేస్‌లోకి మాదాసు గంగాధరం, తోట చంద్రశేఖర్‌లు చేరిపోయారు.

ఎక్కడకు వెళ్లినా….

ఆదిలో ఈ ఇద్ద‌రి ప‌రిస్థితి బాగానే ఉన్నా.. రాను రాను మాత్రం మారిపోయింది. ముఖ్యంగా కాంగ్రెస్ మాజీ నాయ‌కుడు, మాజీ స్పీక‌ర్‌ నాదెండ్ల మనోహర్ పార్టీలో చేరిన తర్వాత.. జ‌న‌సేన ప్ర‌యార్టీ పూర్తిగా మారింది. గతంలో.. జనసేన తరపున మీటింగులంటే.. వేదిక మీద ఒక్క కుర్చీ మాత్రమే ఉండేది. ఇప్పుడు రెండు కుర్చీలుంటున్నాయి. అందులో.. ఒక దాంట్లో పవన్.. మరో దాంట్లో… నాదెండ్ల మనోహర్. అంతే.. కాదు.. పవన్ కల్యాణ్ ఎక్కడకు వెళ్లినా.. మనోహర్ పక్కనుంటున్నారు. దీంతో ప‌వ‌న్ కోసం, జ‌న‌సేన పార్టీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి హడావుడి చేసిన మాదాసు గంగాధరం… పవన్ కోసం ఏకంగా టీవీ ఛానల్ ను కొని.. ప్రధాన కార్యదర్శిగా పెత్తనం చేసిన తోట చంద్రశేఖర్ సైడై పోవాల్సి వచ్చింది.

మార్పు ముందుగానే….

అస‌లు ప‌వ‌న్ ఎక్క‌డ ఉన్నా ఆయ‌న వెంటే మ‌నోహ‌ర్ ఉంటున్నారు. ప‌వ‌న్‌కు పాత‌మిత్రుడు, జ‌న‌సేను సంస్థాగ‌తంగా బలోపేతం చేసేందుకు తెర‌వెన‌క‌, ముందు క‌ష్ట‌ప‌డ్డ‌వారు ఇప్పుడు ఎక్క‌డా క‌న‌ప‌డ‌డం లేదు. దీంతో వాళ్ల‌లో తీవ్ర‌మైన అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోన్న‌ట్టు భోగ‌ట్టా. దీంతో ఇప్పుడు అస‌లు జ‌న‌సేన‌లో నాయ‌కులు ఎవ‌రు ఎప్పుడు ఎలా మార‌తారో చెప్ప‌డం క‌ష్టంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మార్పు స‌మాజంలో కంటే ముందుగా.. జ‌న‌సేన‌లోనే వ‌స్తోంద‌ని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు నెటిజ‌న్లు.

1 Comment on పాత‌కాపుల‌కు నాదెండ్ల చెక్‌.. జ‌న‌సేన‌లో జ‌జ్జ‌న‌క‌..!

Leave a Reply

Your email address will not be published.


*