ఆ కోటరీకి నాదెండ్ల బ్రేక్ వేశారా …?

ముందొచ్చిన చెవులకన్నా వెనుక వచ్చిన కొమ్ములు వాడి అన్న సామెత రాజకీయాల్లో బాగా పనికొస్తుంది. జనసేన పార్టీ క్రీయాశీలకంలో ప్రధాన పాత్ర పోషించే కొందరు ఇప్పుడు కనిపించకుండా పోయారు. వారిలో మాదాసు గంగాధరం ఒకరైతే మరొకరు మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ కావడం చర్చనీయం అయింది. అసలు వీరిద్దరికి పవన్ అంటే పడి చచ్చే అభిమానం మరి అటువంటి వారు పక్కకు నెట్టబడటం వెనుక ఏమి జరిగిందనే ఆసక్తి జనసేన వర్గాలనే కాదు ఆ పార్టీ అంతర్గత అంశాలపై దృష్టి పెట్టిన వారిలో మొదలైంది. వీరిని పవన్ పక్కన పెట్టారా లేక వారే జనసేన కు దూరం జరిగారా అన్న చర్చ బాగా నడుస్తుంది.

ఆయన టికెట్లు ఇచ్చేస్తున్నారా …?

గంగాధరం కు పవన్ ఇచ్చిన ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. చిరంజీవి ప్రజా రాజ్యం నుంచి మెగా కుటుంబానికి వెన్నంటి వున్న మాదాసు కు పవన్ కోటరీలో అత్యంత ప్రాధాన్యత లభించింది జనసేనలో. పార్టీకి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన పాత్ర సైతం అత్యధికంగానే ఉండేది. అయితే ఇటీవల అధినేత దృష్టికి తీసుకురాకుండా ఆయన టికెట్ల బిజినెస్ మొదలు పెట్టారని అది పవన్ కి తెలియడంతో ఆయనకు చెక్ పెట్టారన్న ప్రచారం నడుస్తుంది.

ఈయన పొత్తులు పెట్టేసుకుంటున్నారా…?

తోట చంద్రశేఖర్ జనసేన కు చేస్తున్న సేవ అందరికి తెలిసిందే. పవన్ వాయిస్ కి ఒక ఛానెల్ అవసరమని ఒక ఛానెల్ ను సైతం ఆయన కొనుగోలు చేసి మరీ నడుపుతున్నారు. దాంతో పవన్ సైతం ప్రతి సభలో తోట తన పక్కనే ఉండేలా కార్యక్రమాలు నడిపేవారు. ఆయనతో అత్యంత చనువు ఉండటంతో కీలకమైన నిజనిర్ధారణ కమిటీలో సైతం నియమించారు పవన్. పవన్ ఇచ్చిన ఈ చనువు ను తోట చంద్రశేఖర్ బాగా వాడుకున్నట్లు జనసేన అధినేత దృష్టికి వచ్చిందంటున్నారు. ఇటీవల వైసిపి అధినేత విజయ సాయి రెడ్డి తో భాగ్యనగర్ లోని ఒక స్టార్ హోటల్ లో చంద్రశేఖర్ పిలిచి పొత్తు చర్చలు జరిపినట్లు తెలియవస్తుంది. పవన్ పంపడంతోనే వచ్చారని భావించిన విజయ సాయి రెడ్డి కొన్ని అంశాలు నేరుగా పవన్ తో మాట్లాడటంతో జనసేనాని అవాక్కయి తోటకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారన్నది ప్రచారం సాగుతుంది.

పాత కోటరీ పై పీకే నిఘా …

మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ చేరిక తరువాత జనసేన అధినేత తీరులో స్పష్టమైన మార్పు వచ్చిందన్నది ఆ పార్టీ వర్గాల్లో చర్చ. పాత కోటరీ స్పీడ్ కి నాదెండ్ల వచ్చినప్పటినుంచి బీటలు వారుతూ వస్తున్నాయంటున్నారు. అధినేత ప్రసంగం నుంచి ప్రతి కీలక అంశంలో ఇప్పుడు మనోహర్ నిర్ణయాలే ఫైనల్ అవుతున్నాయని దాంతో కినుక వహించే ఇటీవల గంగాధరం, చంద్రశేఖర్ లు పవన్ కి దూరం జరిగారని మరో కోణంలో వినిపిస్తున్న మాట. మొత్తానికి ఎవరి ప్రచారం ఎలా వున్నా గత పదిరోజులుగా వీరిద్దరూ పవన్ పాల్గొనే సభల్లో పక్కన లేకపోవడం లోటుగానే కనిపిస్తుంది. వాస్తవంగా ఏమైంది అన్నది పవన్ ఎదో సమయంలో బయటపెట్టేస్తారని ఆయన ఏది దాచుకునే మనస్తత్వం కలిగిన వారు కాదని జనసైనికులు పీకే క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*