కిరణ్ ….వన్ షాట్…టూ బర్డ్స్…!

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పక్కా వ్యూహంతోనే ముందుకెళుతున్నారా? వచ్చే ఎన్నికలలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కొంత మెరుగైన ఫలితాలు సాధిస్తుందని తెలియడంతోనే ఆయన కాంగ్రెస్ వైపు చూశారా? అవును. అదే అంటున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా పనిచేశాక అదేస్థాయి పదవి వస్తే తప్ప ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఆయన పాత్ర ఏమీ ఉండదు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి మరే పదవి చేపట్టలేరు. కేంద్ర మంత్రి పదవి తప్ప మరో మార్గం లేదు. కేంద్ర మంత్రి పదవి రాకున్నా పార్లమెంటు సభ్యుడిగా ఉంటే జాతీయ రాజకీయాల్లోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ హస్తినలో కొంత పట్టు సంపాదించుకోవచ్చు.

ఎవరూ పార్టీలో చేరకున్నా…..

అదే ఉద్దేశ్యంతోనే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారంటున్నారు. ఆయన సన్నిహితులతో పాటు చివరకు సొంత సోదరుడు కూడా అధికార తెలుగుదేశం పార్టీలో చేరినా తాను మాత్రం కాంగ్రెస్ నే కిరణ్ ఎంచుకున్నారు. తనకు గాంధీ ఫ్యామిలీ ఇచ్చిన ప్రాధాన్యతను చూసే పార్టీలో తిరిగి చేరారని కిరణ్ చెప్పారు. తనను ముఖ్యమంత్రిగా చేసిన పార్టీ రుణాన్ని తీర్చుకోవడానికే వచ్చానని చెబుతున్నారు. పార్టీ అధిష్టానం కూడా కిరణ్ కుమార్ రెడ్డితో పాటు మరికొందరు సీనియర్ నేతలు తిరిగి కాంగ్రెస్ లోకి వస్తారని భావించారు. కానీ ఏ సీనియర్ నేత తిరిగి హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధం కావడం లేదు.

రాజంపేట ఎంపీగా…..

దీంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తన ఆలోచనను ఇటీవల సన్నిహితుల వద్ద బయటపెట్టారని చెబుతున్నారు. కిరణ్ ఈసారి రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గమైతే తనకు అన్ని విధాలుగా కలసి వస్తుందని విశ్వసిస్తున్నారు. ఈసారిఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండే అవకాశమున్నందున, పొత్తులో భాగంగా రాజంపేట సీటు కాంగ్రెస్ పార్టీకి కేటాయించేలా కిరణ్ పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లోనూ బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా రాజంపేట సీటును బీజేపీకి తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అక్కడ పురంద్రీశ్వరి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

పెద్దిరెడ్డిని దెబ్బతీసే అవకాశం……

ఈసారి కూడా పొత్తు లేకున్నా టీడీపీ అవగాహనతో రాజంపేట బరిలోకి దిగాలని కిరణ్ భావిస్తున్నారు. ఇది ఒకరకంగా తనకు రెండు ప్రయోజనాలు చేకూరుతాయని కిరణ్ ఆశిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని ఓడించి ఒకరకంగా కక్ష తీర్చుకునే అవకాశం దొరకుతుంది. పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా దెబ్బతీయవచ్చు. రెండోది తాను పార్లమెంటుకు ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారవచ్చు. అదృష్టం కలిసి వస్తే కేంద్ర మంత్రి కూడా కావచ్చు. అందుకనే కిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరారని, ముందస్తు వ్యూహంతోనే ఆయన ముందుకు వెళుతున్నారని చెప్పవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*