కిరణ్ మాట నిలుపుకునేందుకు….?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి నాలుగేళ్ల విరామం అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరిపోయారు. అయితే పార్టీలో చేరిన సందర్భంగా మరో ముప్ఫయి నుంచి నలభై మంది నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు. వారంతా మాజీ ఎమ్మెల్యేలని, మాజీ మంత్రులని కూడా కిరణ్ కాస్త గట్టిగానే చెప్పారు. అయితే కిరణ్ పార్టీలో చేరి పక్షం రోజులు గడుస్తున్నా నేతలెవ్వరూ పెద్దగా చేరకపోవడం విశేషం. కిరణ్ కు అత్యంత సన్నిహితులైన వారు సయితం ఇప్పుడు కాంగ్రెస్ లోచేరేందుకు కొంత వెనకడగు వేస్తున్నారు.

హర్షకుమార్ చేరికకు….

ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీతో సఖ్యతగా ఉండటం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు కూడా కాంగ్రెస్ పై ప్రజల్లో ఆగ్రహం తగ్గిందని చెప్పడం వంటివి చూసి టీడీపీతో పొత్తు ప్రమాదకరమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో పట్టున్న మాజీ ఎంపీ హర్షకుమార్ సయితం కొంత ఆలోచనలో పడినట్లు చెబుతున్నారు. హర్షకుమార్ గత ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. హర్షకుమార్ తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు ప్రియ శిష్యుడు. అయినా హర్ష ఇంతవరకూ పార్టీలోచేరికపై ప్రకటించకపోవడం విశేషం. ఆయన పార్టీ ఇన్ ఛార్జిని ఉమెన్ చాందీని కలిసిన తర్వాత హస్తం పార్టీలో చేరతారని భావించారు. కాని ఇప్పటి వరకూ జరగలేదు. కిరణ్ కూడా హర్షతో మాట్లాడుతున్నారని, త్వరలోనే ఆయన పార్టీలో చేరతారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.

శాసనసభలో ప్రాతినిధ్యం ఉండాలనే…..

ఇక కిరణ్ కుమార్ తాను చేసిన వ్యాఖ్యలను ఆచరణలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు. తన సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉండటం, తాను కాంగ్రెస్ లో కొనసాగడం కొంత ఇబ్బందేనని చెప్పకతప్పదు. తన సొంత జిల్లా అయిన చిత్తూరులో కిరణ్ దృష్టి పెట్టారని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాలో బలమైన నేతల కోసం ఆయన వేట కొనసాగిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం శాసనసభలో పార్టీకి ప్రాతినిధ్యం కల్పించాలన్నది కిరణ్ వ్యూహంగా కన్పిస్తోంది. గెలుపు గుర్రాలను కొన్ని చోట్లనే పోటీ చేయించి అక్కడే ఎక్కువగా ప్రచారం చేయించాలని, రాహుల్ చేత సభలను నిర్వహించాలని కిరణ్ ఆలోచిస్తున్నారు.

సీకే బాబు రెడీ అయిపోయారా?

ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత సీకే బాబును పార్టీలోకి తెచ్చేందుకు కిరణ్ ప్రయత్నిస్తున్నారు. సీకే బాబు కూడా కొంత సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సీకే బాబు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చిత్తూరు నియోజకవర్గంలో ఆయనకంటూ ఒక గుర్తింపు, ప్రత్యేకంగా క్యాడర్ ను ఏర్పరచుకున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చి ఆయన ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. అయితే రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలతో సీకే బాబు బీజేపీలో ఇమడ లేకపోతున్నారు. ఇటీవల పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. చిత్తూరు లో తాను సొంతంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నారు. ఈనేపథ్యంలో కిరణ్ కు అత్యంత సన్నిహితుడైన సీకే బాబు పార్టీలో చేరతారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఇలా కిరణ్ బలమైన నేతలను పార్టీలోకి చేర్చుకునే యత్నాలు మొదలు పెట్టారు.