నల్లారి మళ్లీ రెడీ అయిపోయారా…?

ఏదైనా యుద్ధానికి బ‌య‌లుదేరే ముందు.. వాటంగా ఉన్న వాహ‌నాల‌ను, క‌సితో ర‌గిలిపోతున్న సైన్యాన్ని ముందేసుకుని వెళ్లడం.. యుద్ధతంత్రం తెలిసిన ఎవ‌రైనా చేసే ప‌ని! కానీ, ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న కాంగ్రెస్ మాత్రం.. విల్లంబులు ప‌ట్టన‌ని, యుద్ధానికి స‌న్నద్ధంకానని.. ప్రక‌టించిన వారిని పార్టీలోకి తిరిగి రప్పంచి యుద్ధానికి సిద్ధమ‌వ్వాలని భావిస్తోంది. అంతే కాదు, వారిలో ఉన్న ప్రతిభా పాట‌వాల‌ను ఇసుక నుంచి తైలం తీసిన చందంగా తీయాల‌ని భావిస్తోంది. మొత్తంగా ఈ ప‌రిణామం.. ఏపీ రాజ‌కీయాల‌ను నిశ్చేష్టుల‌ను చేస్తోంది. మ‌రి విష‌యం తెలిస్తే.. మీరే మంటారో చూద్దాం.

పునరజ్జీవం నింపేందుకు……

ఇంత‌కీ విష‌యం లోకి వెళ్లిపోతే.. ఉమ్మడి రాష్ట్ర విభ‌జ‌న వ‌ద్దని నెత్తీనోరూ కొట్టుకున్న విన‌కుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఏపీని విడ‌దీసింది. ఫ‌లితంగా దిక్కుమొక్కూలేని రాష్ట్రంగా ఏపీ ఇబ్బందులు ప‌డుతోంది. ఈ క‌డుపు మంట‌తో 2014లో కాంగ్రెస్‌కు స‌మాధి క‌ట్టేశారు ఏపీ ప్రజ‌లు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ నుంచి సీనియ‌ర్ మోస్టులు అన‌ద‌గ్గ వారంతా మూటా ముల్లె స‌ర్దుకున్నారు. మ‌రికొంద‌రు పూర్తిగా రాజ‌కీయ స‌న్యాసం పుచ్చుకున్నారు. ఇప్పుడు క‌ట్ చేస్తే.. నాలుగేళ్లు గ‌డిచిపోయాయి. మ‌రో ప‌దిమాసాల్లోనే ఎన్నిక‌లు రానున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను ప్రధాన పార్టీల‌న్నీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇక‌, బ‌త‌క‌దు అనుకున్న పార్టీ కాంగ్రెస్‌లోనూ దింపుడు క‌ళ్లెం ఆశ‌లు మాత్రం బ్రతికి ఉండ‌డంతో ఇప్పుడు ఆ పార్టీ త‌న‌లోని జీవాన్ని తానే ప్రశ్నించుకుంటూ.. రాజ‌కీయ అస్త్ర స‌న్యాసం చేసిన వీరుల‌కు రెడ్ కార్పెట్ ప‌రిచేందుకు రెడీ అయింది. ఇప్పుడున్న నేత‌లు పార్టీని బ‌లోపేతం చేయ‌లేర‌ని తీర్మానానికి వ‌చ్చిన కాంగ్రెస్ అధిష్టానం.. ఇప్పటికే కాంగ్రెస్‌ను ఛీ కొట్టి వెళ్లిపోయిన వారి కాళ్లు ప‌ట్టుకునేందుకు రెడీ అయింది.

కిరణ్ పై ఆశలు…..

టీడీపీ – వైసీపీ – బీజేపీతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు ఉండేవారు. రాష్ట్ర విభజనతో వారంతా త‌మ‌కు న‌చ్చిన పార్టీలోకి జంప్ చేశారు. అయితే ఒక‌రిద్దరు మాత్రం ఏ పార్టీలోనూచేర‌కుండా స‌న్యాసం పుచ్చుకున్నట్టు ప్రక‌టించారు. ఉమ్మడి ఏపీ విభజనను తీవ్రంగా వ్యతిరేకించి విడిపోవడంతో రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వీరిలో ఒక‌రు. ఇప్పుడు ఈయ‌న‌ను ఎలాగైనా సరే మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చే బాధ్యతను పార్టీ తీసుకుంది. ప్రజల్లో ఇప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి పై విశ్వసనీయత ఉందని.. దాన్ని కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చేందుకు పార్టీలోకి రప్పించాలని పార్టీ భావిస్తోంది.

ఉండవల్లి బాధ్యతలను…..

ఇక అదే సమయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కూడా కాంగ్రెస్ లోకి తిరిగి రప్పించే బాధ్యతను రాజ్యసభ ఎంపీ కేవీపీ రాంచంద్రరావు కు కాంగ్రెస్ అధిష్టానం అప్పజెప్పిందట. ఉండవల్లి వస్తే కాంగ్రెస్ కు కొండంత బలం అని అధిష్టానం భావిస్తోంది. కాని ఉండవల్లి తాను ఏ పార్టీలో చేరేది లేదని ఇప్పటికే చెప్పేశారు. ఇక వీరే కాక మరికొంత మంది అగ్రనేతల కోసం కూడా కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర మాజీ మంత్రులు కే సాయిప్రతాప్ – కావూరి సాంబశివరావు లపై కూడా ప్రత్యేక దృష్టిసారించి ఆహ్వానిస్తే వారు కూడా తిరిగి కాంగ్రెస్ గూటికి రావచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు సీరియస్ గా ప్రయత్నిస్తే ఖచ్చితంగా పార్టీని వీడిని నేతలంతా తిరిగి వస్తారని.. మళ్లీ కాంగ్రెస్ కు ఏపీ లో పూర్వవైభవం తీసుకురావచ్చని కాంగ్రెస్ అధిష్టానం ఆశాభావంతో ఉంది. అయితే, వీరంతా అస్త్ర స‌న్యాసం తీసుకుని, రాజ‌కీయాలు వ‌ద్దు మ‌హాప్రభో అంటున్నవారే. మ‌రి కాంగ్రెస్ వీరినే కోరుతోందంటే.. రాజకీయ మ‌హిమ కాక మరేంటి?!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*