కిరణ్ కు అంత సీన్ లేదంటున్నారే…..!

మాజీ ముఖ్యమంత్రి నల్లారికిరణ్ కుమార్ రెడ్డిని సొంత పార్టీలోని నేతలే విశ్వసించడం లేదట. ఆయన దగ్గరకు వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు జంకుతున్నారు. కిరణ్ మామూలు వ్యక్తి కాదన్నది పార్టీలో అందరికీ తెలిసిందే. తమ కళ్లముందే కిరణ్ అధిష్టానాన్ని బుట్టలో వేసుకున్న విషయాన్ని మర్చిపోలేకపోతున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత రోశయ్య అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా అయిన సంగతి తెలిసిందే. అయితే రోశయ్య కు పదవీ గండం రావడానికి కిరణ్ పెద్ద ఎత్తులే వేశారంటున్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓదార్పు యాత్ర చేయనీయకుండా పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదులు మీద ఫిర్యాదులు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా కొందరు గుర్తు చేస్తున్నారు.

జగన్ ను పార్టీ నుంచి…..

జగన్ ను వైఎస్ వారసుడిగా పార్టీలో ఎదనివ్వకూడదనే కిరణ్ దూరాలోచనతోనే ఓదార్పు యాత్రలకు బ్రేక్ వేయించారన్న వాదన ఉంది. అలాగే ఎమ్మెల్యే శంకర్రావు చేత జగన్ పై కేసులు పెట్టించడంలో కూడా కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉందన్న టాక్ అప్పట్లో బలంగా విన్పించింది. ఇక సమైక్యాంధ్రను ఎవరూ విడదీయలేరని, ఆఖరి బంతి తనదేనని పదే పదే చెప్పి కిరణ్ ఏపీ ప్రజలను మోసగించిన విషయాన్ని కూడా కొందరు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది.

జనాకర్షణ శక్తి లేదని……

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వాస్తవానికి పీలేరుకు ఎక్కువ…చిత్తూరుకు తక్కువ అని కాంగ్రెస్ లో కొందరు ఎద్దేవా చేస్తున్నారు. ఆయనకు జనాకర్షణ శక్తి లేదని, ఆయనకు ప్రచారంలో ఎటువంటి బాధ్యతలను అప్పగించవద్దని ఇటీవల కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కిరణ్ కు జనాలను ఆకర్షించే సీన్ లేదని, అనవసర ప్రాధాన్యత ఇవ్వవద్దని కొందరు నేతలు నేరుగా ఏఐసీసీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. ఇందుకు వారు ఉదాహరణలను కూడా తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

అధిష్టానానికి ముందే…..

కిరణ్ రాష్ట్ర విభజన జరిగినప్పుడు జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారని, అయితే ఆయన పోటీ చేయకుండా అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేసినా, ఎవరికీ డిపాజిట్ రాకపోయిన విషయాన్ని అందులో పేర్కొన్నారు. అంతేకాకుండా కిరణ్ కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో ముప్ఫయి నుంచి నలభై మంది వరకూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారని, అయితే ఇంతవరకూ పార్టీలో ఎవరూ చేరలేదన్న విషయాన్ని కూడా వారు అందులో పొందుపర్చారు. అంతేకాదు ఉంటారనుకున్న కొండ్రు మురళి లాంటి వారు కూడా వెళ్లిపోయారని తెలిపారు. కిరణ్ కు అధిష్టానం ఎటువంటి కీలక బాధ్యతలను అప్పగించకుండా ముందుగానే ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కిరణ్ పై ఫిర్యాదులను ఎక్కుపెట్టడం చర్చనీయాంశంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*