నల్లారి….రివేంజ్ ఇలా ఉంటుందా?

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఏపీలో ఆ పార్టీ వ్యూహ వ్రతి వ్యూహాలను ఆయనే రచిస్తున్నట్లుంది. కిరణ్ పార్టీలో చేరక ముందు కొంత వైసీపీకి కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండేది. జగన్ పార్టీ ప్రత్యేక హోదా కోసం చేస్తున్న ఉద్యమాలకు మద్దతు పలికేది. కాని కిరణ్ చేరికతో ఆ పార్టీ తన వ్యూహాన్ని మార్చుకుంది. కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నంటినీ గంపగుత్తగా తీసుకెళ్లిన జగన్ ను తమ ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ భావిస్తోన్నట్లు కన్పిస్తోంది. అందుకనే రేపు వైసీపీ తలపెట్టిన ఏపీ బంద్ కు తమ మద్దతు ఉండదని ఆ పార్టీ స్పష్టం చేసింది. ఇదంతా నల్లారి ప్లాన్ అని చెబుతున్నారు.

అన్ని పార్టీలూ అందుకోసమే……

రాష్ట్రంలోని అన్ని పార్టీలూ ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం పోరాడుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీ సయితం ధర్మపోరాట దీక్ష ల పేరుతో కేంద్రపై వత్తిడి తీసుకొచ్చే ప్రయత్నంచేస్తుంది. ఇక జనసేన, వామపక్షాలు కూడా వీటికోసం ఏదో ఒక ఆందోళన చేస్తూనే ఉన్నాయి. అయితే వైసీపీ ఇచ్చిన బంద్ కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగానే. విభజన హామీల అమలుకు ప్రయత్నించని బీజేపీ పార్టీ వైఖరిని నిరసిస్తూ ఈ నెల 24న బంద్ చేయాలని వైసీపీ అధినేత జగన్ పిలుపు నిచ్చారు. కేంద్రంలో నిత్యం బీజేపీతో పోరాడుతున్న కాంగ్రెస్ మాత్రం ఏపీలో బంద్ కు మద్దతివ్వబోమని ప్రకటించడాన్ని కొందరు తప్పుపడుతున్నారు.

జగన్ ఓటు బ్యాంకును…..

నల్లారి వ్యూహమంతా జగన్ ఓట్లు చీల్చాలన్నదే. అది తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడుతుంది. ఏపీలో ఒక సామాజిక వర్గం ఓట్లతో పాటు దళిత ఓట్లపై కాంగ్రెస్ కన్నేసింది. ప్రస్తుతం ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కొంత వరకూ కాంగ్రెస్ చీలుస్తుందన్న నమ్మకంతో చంద్రబాబు సయితం ఉన్నారు. కాంగ్రెస్ లో కొందరు బలమైన నేతలు నేటికీ కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. వారిని పోటీకి కాంగ్రెస్ దింపితే జగన్ పార్టీ ఓటు బ్యాంకును చీల్చే అవకాశముందని, తద్వారా తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయావకాశాలు మెరుగవుతాయన్నది చంద్రబాబు ఆలోచన.

బాబు ఆలోచనల ప్రకారమేనా?

చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు తెలుగుదేశం పార్టీయే అప్పట్లో ప్రభుత్వానికి మద్దతిచ్చి కాపాడగలిగింది. గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల శాతంతోనే అధికారానికి దూరమైన జగన్ ను ఈసారి కూడా పవర్ లోకి రానివ్వ కూడదన్నది కాంగ్రెస్ ఢిల్లీ పెద్దల సంకల్పం. దీనికి అనుగుణంగానే రాష్ట్ర నేతలకు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారని, అందువల్లనే వైసీపీ పిలుపునిచ్చిన బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతివ్వలేదన్న వాదన ఉంది. ఇదే కాదు భవిష్యత్తులోనూ జగన్ టార్గెట్ గా కాంగ్రెస్ అడుగులు ఖాయమని తేలిపోయింది. అయితే జగన్ ఓటు బ్యాంకు ను కాంగ్రెస్ ఎంతవరకూ చీల్చగలదన్నదే ఇప్పుడు ప్రశ్న.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*