లాస్ట్ బాల్ కు వస్తారా…??

nallarikirankumarreddyindiannaitonalcongress

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రికార్డుల్లోకి ఎక్కారు. రాష్ట్ర విభజన జరగడంతో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంతంగా జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టి చతికల పడ్డారు. అప్పటి నుంచి ఆయన కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆరు నెలల క్రితం తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయి ఇన్ని రోజులు గడుస్తున్నా నల్లారి జాడ లేదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో? లేదో? కూడా తెలియదు.

ఎన్ని చెప్పారు….?

నల్లారికిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో చాలా మంది నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరతారని ప్రకటించుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రత్యేక హోదా కాంగ్రెస్ తోనే సాధ్యమని కిరణ్ చెప్పారు. కానీ గత కొద్ది రోజుల నుంచి కిరణ్ కుమార్ రెడ్డి మళ్లీ కన్పించడం మానేశారు. ఆయన ఈ ఎన్నికలలో రాజంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భావించారు. అయితే ప్రధాన పార్టీలన్నీ రాజంపేట అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి. ఇక నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేట నుంచి పోటీ చేయాలంటే కాంగ్రెస్ తరుపున బరిలోకి దిగాల్సి ఉంటుంది.

సోదరుడు టీడీపీలో ఉండటంతో…..

కానీ పీలేరు నుంచి తన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండటంతో ఆయన ఆలోచనను విరమించుకున్నట్లు తెలుస్తోంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సూచనలతోనే కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వెళ్లారు. ఏపీలో కాంగ్రెస్, టీడీపీ పొత్తు ఉంటే తాను కూడా ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగాలనుకున్నారు. కానీ టీడీపీ, కాంగ్రెస్ లు విడివిడిగా ఒంటరిగానే బరిలోకి దిగుతుండటంతో నల్లారి పోటీ చేయడం మానుకున్నారు. ఇప్పుడు ఆయన ఏ పార్టీ తరుపున ప్రచారం చేస్తారన్న ఉత్కంఠ నెలకొంది.

ప్రచారానికి వస్తారా?

గత కొద్దిరోజులుగా ఏపీ కాంగ్రెస్ నేతలతో కూడా కిరణ్ కుమార్ టచ్ లో లేరని చెబుతున్నారు. ఆయన హైదరాబాద్ లోనే ఉండటంతో పీలేరు నుంచి ఆయన అనుచరులు కొందరు వెళ్లి తమ పరిస్థితి ఏంటని అడిగినా ఆయన నుంచి సమాధానం రాలేదట. ఇప్పటికే నల్లారి అనుచరుల్లో ఎక్కువమంది కిషోర్ కుమార్ రెడ్డికి మద్దతు పలుకుతున్నారు. ఇప్పుడు వారికి ఏమీ చెప్పలేని స్థితిలో కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. అయితే ఎన్నికల ప్రచారం లో కిరణ్ పాల్గొంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మరి ప్రచారం ముగిసే సమయంలోనైనా నల్లారి రంగంలోకి దిగుతారో? లేదో? చూడాలి.

Ravi Batchali
About Ravi Batchali 15694 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*