లెజెండ్ వీక్ అయ్యారా….?

హిందూపురంలో ఈసారి నందమూరి బాలకృష్ణ విజయం కష్టమేనా? బాలకృష్ణ విజయానికి ఎటువంటి ఆటంకాలు రాకూడదని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ముందు జాగ్రత్తలు తీసుకుంటుందా? అవును ఇప్పుడు ఇదే హిందూపురం నియోజకవర్గంలో హాట్ టాపిక్. బాలకృష్ణపై ప్రజలతో పాటు పార్టీలోని నేతల్లో కూడా అసంతృప్తి నెలకొందని అంటున్నారు. ఇటీవల కొందరు నేతలు బాలకృష్ణ పీఏను తొలగించాలంటూ ఏకంగా ఆందోళనకు దిగారు. ఆయనను తొలగించేంత వరకూ వారు విశ్రమించలేదు. అలా ఇంటా బయటా బాలయ్య బాబు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న అధిష్టానం అందుకు విరుగుడు చర్యలు చేపట్టింది.

ప్రత్యేక సర్వేలతో……

వచ్చే ఎన్నికల్లో బాలయ్య బాబు ఖచ్చితంగా గెలవాలి. అందుకోసం ప్రత్యేకంగా టీడీపీ సర్వేలు చేయిస్తుందని చెబుతున్నారు. బాలయ్య బాబుకు వ్యతిరేకంగా ఎంత మంది ఉన్నారు? బాలయ్యపై అసంతృప్తి ఉండటానికి గల కారణాలేంటి? కోట్ల రూపాయల నిధులను నియోజకవర్గ అభివృద్ధి కోసం వెచ్చిస్తున్నా బాలయ్య పై ఎందుకింత ఆగ్రహంగా ఉన్నారన్న విషయంపై ఆరా తీస్తున్నారు. దీంతో పాటు వైసీపీ ముఖ్యనేతలెవరు? వారి బ్యాక్ గ్రౌండ్ ను కూడా ఈ సర్వే ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల నాటికి పరిస్థితులన్నింటినీ చక్కదిద్దాలన్నది హైకమాండ్ లక్ష్యం.

పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకూ…..

నిజానికి హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఏర్పడిన నాటి నుంచి ఆ పార్టీకి అనుకూలంగానే ఉంటూ వస్తుంది. 1985 నుంచి ఇప్పటి వరకూ జరిగిన ఎనిమిది ఎన్నికల్లో (ఒకటి ఉప ఎన్నిక) తెలుగుదేశంపార్టీదే విజయం. వైఎస్ గాలి వీచినా ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థే గెలుపొందారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు 1985, 1989, 1994 ఎన్నికల్లో హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారు. 1996లో ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో తొలిసారి బాలకృష్ణ హిందూపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి నవీన్ నిశ్చల్ మీద 16 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1985 నుంచి ఇప్పటి వరకూ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఓటమి అనేది తెలీదు.

బాలయ్యపై యాంటే…..

కాని ఈ నాలుగున్నరేళ్లలో బాలకృష్ణపై యాంటీ రావడం పార్టీ నేతలనే ఆశ్చర్యంలో పడేసింది. బాలయ్య బాబు నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవడం, తాగునీటి వంటి ప్రధాన సమస్యలను విస్మరించారంటున్నారు. తాగునీటి కోసం ఏకంగా మహిళలు రోడ్డెక్కిన సంఘటలను ఇక్కడ చోటు చేసుకున్నాయి. అలాగే బాలకృష్ణ కన్పించడం లేదంటూ ప్రత్యర్థి పార్టీలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి. మొత్తం మీద బాలయ్య బాబు మీద ఉన్న వ్యతిరేకతను తొలగించడానికి టీడీపీ అధిష్టానం సర్వే చేపట్టి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుని వచ్చే ఎన్నికలలో బాలయ్యను గట్టున పడేయాలని భావిస్తోంది. మరి కంచుకోటగా ఉన్న హిందూపురంలో మరో పార్టీకి అవకాశం ఉంటుందా.? అన్నది సందేహమే అయినా…ఏమో…గుర్రం ఎగరా వచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*