మొండోడు… మొనగాడు…!

అతడంటే ఇంట్లోనూ భయం…పార్టీలోనూ భయం.. చంద్రబాబుకూ భయం. అంతెందుకు అశేష తెలుగు ప్రజల అన్న ఎన్టీయార్ కు కూడా భయం. ఎందుకనేది కొందరిని వేధించే ప్రశ్న. ముక్కుసూటిగా, మొహం మీద కొట్టినట్లుగా మాట్టాడటం అతని నైజం. తెగింపు, మొండితనం, పంతం, పట్టుదల అతని లక్షణాలు. అదే అతని బలం, బలహీనత. నందమూరి హరికృష్ణ రాజకీయాల్లో పెద్దగా సాధించిందేమీ లేదు. సినిమా రంగంలోనూ అంతే. కానీ అన్నిటా తానున్నానని అనిపించుకోవడమే విశేషం. అధిష్ఠానంతో విభేదాలు పెరిగినా ఆయనను పక్కనపెట్టడం సాధ్యం కాలేదు. ఎందుకంటే కుటుంబం, పార్టీ ఎన్టీయార్ రూపాన్ని అతనిలో చూడటమే కారణం. తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్దాంతంతో దొంగాట మొదలు పెట్టినా సమైక్యాంధ్ర కోసం రాజీనామా చేసి తెలుగు వాణిని పెద్దల సభలో వినిపించిన మొండోడు.

సారథి..సామాన్యుడు…

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపనలో ఎన్టీయార్ ఒంటరిగా పయనం మొదలు పెట్టారు. అతనికి ఏకైక తోడు కుమారుడు హరికృష్ణ. చైతన్యరథ సారథిగా తండ్రి వాహనాన్ని నెలలతరబడి తానే నడిపారు. పగలు,రాత్రి నిద్ర,నిప్పులు, తిండి తిప్పలు దైవాధీనం. అంతటి మహానటుడి కుమారుడిగా భోగభాగ్యాలు అనుభవించిన హరి పంతం పట్టి డ్రైవర్ గా మారిపోయాడు. పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. తండ్రి ఉపన్యాసం చెబుతుంటే ఏదో మూలన ప్రజల్లోకి వెళ్లి స్పందన తెలుసుకుంటూండేవాడు. దానిని మళ్లీ ఎన్టీయార్ చెవిన వేసేవాడు. ఇదంతా ఉడతాభక్తిగా సాగిపోతుండేది. తండ్రి రక్షణ బాధ్యతను తానే చూసుకునేవాడు. సమయానికి ఆహారం అందేలా జాగ్రత్త పడేవాడు. ఎండనక,వాననక ఉపన్యాసాలతో ఊపిరిసలపని కార్యక్రమాలతో అలసి పోయినప్పుడు కాళ్లు ఒత్తి శుశ్రూష చేసేవాడు. పార్టీకి మాత్రమే కాకుండా తండ్రికి సైతం సేవలందించడం హరికృష్ణ చేసుకున్న భాగ్యంగా చెబుతారు. అందుకే కుటుంబసభ్యులకూ అతనంటే అంతటి భక్తి ప్రపత్తులు.

ఎన్టీయార్ కు ఎదురు చెప్పినా…

కుటుంబంలో అందరికంటే ఎన్టీయార్ వద్ద అత్యంత చనువు కల వ్యక్తి హరికృష్ణే. వారిద్దరి మధ్య సంబంధం తండ్రీకొడుకుల అనుబంధం కాదు. కృష్ణార్జునుల ప్రేమ అంటుంటారు. తండ్రి మీద ఈగ వాలనిచ్చేవారు కాదు. కానీ లక్ష్మీపార్వతి ద్వితీయ వివాహం తర్వాత తండ్రికి ఎదురుతిరిగిన మొదటి వ్యక్తి హరికృష్ణ. ఎన్టీయార్ ఎదురుగా నిలుచుని మాట్టాడేంత సాహసం కుటుంబంలో ఎవరికీ లేదు. అలాగే పార్టీలోనూ అంతే. చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అల్లుళ్లుగా రాజకీయంగా ప్రాధాన్యం పొందారు. కానీ ఆయన అభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునేంత ధైర్యం వారికి లేదు. కుటుంబంలోని వారందరితోనూ మాట్టాడి లక్ష్మీపార్వతి విషయంలో తండ్రితో విభేదించి బావలకు అండగా నిలిచాడు హరికృష్ణ. మిగిలిన కుటుంబ సభ్యులను సైతం ఏకతాటిపైకి తెచ్చాడు. చంద్రబాబు నాయుడు హరికృష్ణ ద్వారానే ఈ యుద్దం చేయించారంటుంటారు. అప్పుడే ఎన్టీయార్ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. కొడుకు మీద ఉన్న అవ్యాజ్యమైన ప్రేమతో హరికృష్ణ గురించి ఒక్కమాట కూడా మాట్టాడలేదు ఎన్టీయార్. చంద్రబాబునాయుడినే తిట్టిపోశారు.

బావపైనే బావుటా…

గడచిన అయిదారు సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడిపైనా హరికృష్ణ కినుక వహించారు. వారసులైన జూనియర్ ఎన్టీయార్ ను పక్కనపెట్టి లోకేశ్ కు పెద్దపీట వేయడంపై అసంతృప్తి నెలకొందనేది పార్టీ వర్గాల సమాచారం. పార్టీ వేదికలపైనే ధ్వజమెత్తారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చంద్రబాబుతో మాట్లాడటం కూడా మానేశారు. అయినా హరికృష్ణను పూర్తిగా పక్కనపెట్టడం చంద్రబాబుకు సాధ్యం కాలేదు. అధికారిక పదవులు ఏమీ ఇవ్వకపోయినా పార్టీ పొలిట్ బ్యూరో సభ్యత్వాన్ని కొనసాగించారు. పార్టీ పట్ల హరికృష్ణ కు ఉండే ఇంటిగ్రిటీయే ఇందుకు కారణం. పార్టీ అధినేత మనోభీష్టంతో సంబంధం లేకుండానే పార్టీలో హరికృష్ణకు అనేకమంది అభిమానులున్నారు. అశేషసంఖ్యలో ఎన్టీయార్ అభిమానులూ అండగా ఉన్నారు. అదే బలంతో చివరి వరకూ పార్టీలో కీలక పదవిలోనే కొనసాగారు.

 

-ఎడిటోరియల్ డెస్క్