హరికృష్ణ చివరి లేఖ ఇదే….!

నందమూరి హరికృష‌్ణ…. ఎన్టీఆర్ ఫ్యామిలీలో పెద్దన్న. సినిమాల్లో పెద్దగా రాణించకపోయినా… వ్యాపార వ్యవహరాలు, రాజకీయాలతో హరికృష్ణ బిజీబిజీగా ఉండేవారు. ఎన్టీరామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన సమయంలో హరికృష్ణ కీలక భూమిక పోషించారు. ఎన్టీరామారావు అప్పట్లో 9 నెలల పాటు చైతన్య రథంపై రాష్ట్రమంతటా పర్యటించారు. తండ్రి చైతన్యరథానికి రథసారథిగా హరికృష్ణ వ్యవహరించారు. చైతన్య రథానికి డ్రైవర్ ను పెట్టాలని భావించినా హరికృష్ణ అందుకు అంగీకరించలేదు. తానే సారథిగా వ్యవహరిస్తానని, ఎన్టీఆర్ పర్యటన ఆసాంతం ఆయన చైతన్య రథాన్ని నడిపారు.

మూడురోజుల్లో పుట్టిన రోజు….

సొంతంగా వాహనాన్ని డ్రవ్ చేయడమంటే హరికృష్ణకు ఇష్టం. ఆయన ఎప్పుడు ఎక్కడకు వెళ్లినా సొంతంగానే డ్రైవ్ చేసుకుంటూ వెళతారు. డ్రైవింగ్ లో అపార అనుభవం హరికృష్ణకు ఉంది. అదే ఇష్టం ఇప్పుడు ప్రాణాల మీదకు తెచ్చింది. శ్రీకృష్ణావతారం సినిమాతో హరికృష్ణ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చారు. పలు చిత్రాల్లో హీరోగా కూడా నటించారు. అయినా సినిమాల్లో పెద్దగా గుర్తింపు రాకపోవడంతో ఆయన సినీ నిర్మాతగా మారారు. 1956 సెప్టంబరు 2న హరికృష్ణ కృష్ణా జిల్లా నిమ్మకూరులో జన్మించారు. మరో మూడు రోజుల్లో పుట్టిన రోజు వేడుకలు జరపుకోవాల్సి ఉండగా హరికృష్ణ హఠాన్మరణం కుటుంబ సభ్యులను కలచి వేస్తోంది. పుట్టిన రోజు వేడుకలకు సంబంధించి అభిమానులకు హరికృష్ణ లేఖను కూడా సిద్దం చేసుకున్నారు. తన పుట్టినరోజు వేడుకలు జరపుకోవద్దని, కేరళలో సంభవించిన వరదల వల్ల ఎక్కువ నష్టం జరిగిందని, వారిని ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ లేఖ అభిమానులకు చేరకుండానే హరికృష‌్ణ మృతి చెందారు.

సమైక్యాంధ్ర కోసం…..

హరికృష్ణకు ఇద్దరు భార్యలు. లక్ష్మి, శాలిని. హరికృష్ణకు ముగ్గురు కుమారులున్నారు. జానకిరామ్, కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. ఇందులో జానకిరామ్ రోడ్డు ప్రమాదంలోనే నాలుగేళ్ల క్రితం మరణించారు. అప్పటి నుంచి హరికృష్ణ మానసికంగా కొంత ఇబ్బంది పడుతున్నారు. కూతురు సుహాసిని ఉన్నారు. హరికృష్ణ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. సమైక్యాంధ్ర కోసం ఆయన రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు.  గతంలో చంద్రబాబు కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. హరికృష్ణ మృతి పార్టీకి తీరని లోటని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కళావెంకట్రావు అన్నారు.

సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే……

సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వల్లనే ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లా కావలిలో నందమూరి అభిమాని మోహన్ కుమారుడు వివాహానికి హాజరయ్యేందుకు ఈ తెల్లవారు జామున హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరారు. ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేస్తుండగా డివైడర్ ఢీకొని ఈ ప్రమాదం సంభవించింది. సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, అతివేగం ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

ప్రమాదం సమయంలోనూ పసుపుచొక్కానే…..

హరికృష్ణ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హరికృష్ణ మృతికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు నార్కేట్ పల్లి కామినేని ఆసుపత్రిలో ఉన్న తండ్రి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. వరుస రోడ్డు ప్రమాదాలు హరికృష్ణ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి. హరికృష్ణ ప్రమాదం సమయంలోనే పసుపు చొక్కా వేసుకుని ఉండటం చూసి అభిమానులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈరోజు తన అధికారిక కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. హరికృష్ణ మృతి తనకు షాక్ కు గురి చేసిందని చంద్రబాబు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*