సుహాసిని… ట్రెండింగ్…ట్రెండింగ్….!!

nandamuri suahasini trending trending

తెలంగాణ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలు ఒక ఎత్తు… ఆ ఒక్క నియోజకవర్గం ఒక ఎత్తు. అదే కూకట్ పల్లి నియోజకవర్గం. నియోజకవర్గంపై గూగుల్ లో కూడా నెటిజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారంటే ఆ నియోజకవర్గం గురించి ఎంత ఆరాటమో…? ఎంత అభిమానమో…? ఎంత ఆసక్తో? ఇట్టే అర్థమవుతుంది. దీనికంతటికీ కారణం అక్కడ  నందమూరి సుహాసిని పోటీ చేయడమే. నిన్న మొన్నటి వరకూ హరికృష్ణకు ఒక కూతురు ఉందని కూడా ఎవరికీ తెలియదు. అంటే ఆమె కేవలం నందమూరి ఇంట పెరిగి బయటకు రాకపోవడమే. కొద్దిమంది సన్నిహితులకు మాత్రమే తెలిసిన సుహాసిని ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారారు. రైళ్లల్లో, బస్సుల్లో, ఆటోల్లో ఎక్కడ చూసినా సుహాసిని గెలుస్తుందా? లేదా? అన్నదే చర్చ. కూకట్ పల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుహాసిని విజయావకాశాలపై ఎందుకంత ఆసక్తి చూపుతున్నారు.

అనూహ్యంగా తెరపైకి వచ్చి…..

నిన్న మొన్నటి వరకూ తెలియని సుహాసిని ఒక్కసారి కూకట్ పల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి కావడంతో ఆమె గురించే ఇప్పుడు చర్చ నడుస్తుంది. కేవలం చర్చ మాత్రమే కాదు పెద్దయెత్తున బెట్టింగ్ లు కూడా ప్రారంభమయ్యాయి. సిక్కోలు నుంచి కూకట్ పల్లి వరకూ ఈ బెట్టింగ్ లు విపరీతంగా నడుస్తున్నాయి. కూకట్ పల్లి అభ్యర్థిత్వాన్ని చాలా మంది ఆశించారు. అయితే అనూహ్యంగా నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని తెరపైకి వచ్చారు. చంద్రబాబునాయుడు దూర దృష్టితో సుహాసినిని పోటీకి దింపినా ఆమే ఇప్పుడు అధికార, విపక్షాలకు కేంద్ర బిందువయ్యారు. సుహాసినిని కూకట్ పల్లిలో నిలబెట్టుకుంటే.. ఏపీలో మంత్రి పదవి ఇవ్వవచ్చు కదా? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించడాన్ని బట్టి సుహాసిని ప్రభావం చెప్పకనే తెలుస్తోంది.

అందరి దారీ కూకట్ పల్లి…..

చంద్రబాబు నాయుడుకు సయితం కూకట్ పల్లి సీటు ప్రతిష్టాత్మకం. ఇక్కడ పొరపాటున ఓడిపోతే టోటల్ తెలుగుదేశం పార్టీపై ఆ ప్రభావం చూపుతుంది. స్వయానా మేనకోడలును గెలపించుకోలేకపోయారన్న అపవాదును ఎదుర్కొనాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా చంద్రబాబు కొంత వ్యతిరేకతను ఎదుర్కొనాల్సి రావడం ఖాయం. అందుకే చంద్రబాబు ఎలాగైనా సుహాసినిని గెలిపించుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం దాదాపు 30 మంది ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతలను ఒక్క కూకట్ పల్లిలోనే దించారు. ఇంక మంత్రుల సంగతి సరేసరి. పరిటాల సునీత దగ్గర నుంచి దేవినేని ఉమా వరకు అందరిదీ ఒక్కటే దారి. రోజుకో మంత్రి చొప్పున కూకట్ పల్లిలో ప్రచారంచేస్తున్నారు. అదే కూకట్ పల్లి. ఎంపీ రామ్మోహన్ నాయుడు సయితం కూకట్ పల్లిలో ప్రచారం చేశారు. ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓటర్లు ఎక్కువగా ఉండటంతో రామ్మోహన్ నాయుడిని ఇక్కడే మకాం వేయాలని పార్టీ నుంచి ఆదేశాలు అందాయి.

చంద్రబాబు మరోసారి…..

ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రెండు రోజుల పాటు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటికీ కూకట్ పల్లిలో పర్యటించలేకపోయారు. అక్కడ అదే రోజు మంత్రి కేటీఆర్ సభలకు ముందే అనుమతి తీసుకోవడంతో బాబు సభలకు పర్మషన్ ఇవ్వలేదు. దీంతో చంద్రబాబు మరోసారి తెలంగాణ ప్రచారంలో పాల్గొననున్నారు. రేపు కూకట్ పల్లిలో ప్రచారం చేయనున్నారు. కూకట్ పల్లిలో దాదాపు ఐదు ప్రాంతాల్లో జరిగే రోడ్ షో ల్లో చంద్రబాబు పాల్గొననున్నారని తెలిసింది. తెలంగాణలో మరో ఐదు రోజులు చంద్రబాబు ప్రచారం చేయనున్నారంటే… కూకట్ పల్లిని ఎంత ప్రిస్టేజ్ గా తీసుకున్నారో ఇట్టే అర్థమవుతోంది. మొత్తం మీద తెలంగాణలో జరుగుతున్న అన్ని నియోజకవర్గాలకన్నా కూకట్ పల్లి హాట్ టాపిక్ గా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*