సుహాసిని…సులువు కాదట..!

nandamuri-suhasini-kukatpally

తెలంగాణ ఎన్నికలపై ఇతర రాష్ట్రాల ప్రజల్లోనూ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పలు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఆసక్తిగా చూస్తున్న నియోజకవర్గం కూకట్ పల్లి. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని బరిలో ఉండటంతో పోటీ ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాధవరం కృష్ణారావు మళ్లీ బరిలో ఉన్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో గెలుపెవరిది అనేది ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. కొన్ని ప్రాంతాల్లో అయితే కూకట్ పల్లి నియోజకవర్గంపై పెద్దఎత్తున బెట్టింగులు కూడా జరుగుతున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉండేవారు కూడా కూకట్ పల్లిలో ఉండే వారికి ఫోన్లు చేసి ఎవరు గెలిచే అవకాశం ఉందో ఆరా తీస్తున్నారు.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు…

నందమూరి సుహాసిని ఇక్కడ బరిలో లేకపోతే ఇంత పెద్ద ఆసక్తి ఏమీ ఉండేది కాదు. సెటిలర్ల అడ్డాగా చెప్పుకునే ఈ నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు… నందమూరి సుహాసినిని బరిలో దింపి ఓ పెద్ద ప్రయోగమే చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన మాధవరం కృష్ణారావు 43 వేల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత ఆయన టీఆర్ఎస్ లో చేరారు. అంతకుముందు ఎన్నికల్లో లోక్ సత్తా నుంచి జయప్రకాశ్ నారయణ్ విజయం సాధించారు. సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉండే కూకట్ పల్లిలో సుహాసినిని నిలపడం ద్వారా సులువుగా గెలవవచ్చని చంద్రబాబు భావించారు. మొత్తానికి రాజకీయ ఓనమాలు కూడా తెలియని ఆమె బరిలో దిగారు. ఆమె తరపున చంద్రబాబు రెండు రోజులు ప్రచారం నిర్వహించారు. ఇక బాబాయ్ బాలయ్య కూడా గల్లీగల్లీ తిరిగారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ప్రచారం నిర్వహించారు. అయినా టీడీపీ నేతలకు గెలుపుపై ధీమా కనిపించడం లేదంటున్నారు.

టీఆర్ఎస్ కు రెబల్ బెడద…

సుహాసినికి ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు గట్టి పోటీ ఇస్తున్నారు. ఆయన కౌన్సిలర్ స్థాయి నుంచి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. ప్రజలు, కాలనీ సంఘాలు, వివిధ వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటారు. అదే సమయంలో పలు ఆరోపణలు, అసంతృప్తులు ఉన్నా లోకల్ లీడర్ అనే భావన ఉంది. అదే, సుహాసిని విషయంలో ఆ పరిస్థితి లేదు. ఆమె విజయం సాధిస్తే అందుబాటులో ఉండరనే ఒక ఆలోచన ఇక్కడి ప్రజల్లో ఉంది. ఇక పార్టీ బలం కూడా టీఆర్ఎస్ అభ్యర్థికి ప్లస్ అవుతుంది. టీఆర్ఎస్ ప్రభుత్వ వచ్చాక నగరాభివృద్ధి బాగానే జరగడం, సెటిలర్లకు ఎటువంటి ఇబ్బంది కలగకపోవడం వంటి అంశాలు టీఆర్ఎస్ కు సానుకూలంగా ఉన్నాయి. కాకపోతే, టీఆర్ఎస్ కి కూకట్ పల్లి రెబెల్ బెడద ఉంది. ఆ పార్టీ కార్పొరేటర్ భర్త, టీఆర్ఎస్ నాయకుడిగా ఉన్న పన్నాల హరీష్ చంద్రారెడ్డి బీఎస్పీ తరపున బరిలో ఉన్నారు. ఆయనకు నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం ఉంది. ముఖ్యంగా స్థానిక యువత ఎక్కువగా ఆయన వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. టీఆర్ఎస్ లో ఉన్న అసంతృప్తులు కూడా ఆయనకు సహకరిస్తారని భావిస్తున్నారు. ప్రచారాన్ని కూడా ప్రధాన పార్టీలకు ధీటుగా చేశారు. దీంతో ఆయన భారీగానే టీఆర్ఎస్ ఓట్లు, తెలంగాణ ప్రజల ఓట్లు చేల్చే అవకాశం ఉండటం టీఆర్ఎస్ కు మైనస్ గా మారింది.

టీఆర్ఎస్ కి కలిసి వస్తున్న ఏపీ రాజకీయాలు

చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం కూడా సుహాసిని కి పరిస్థితులను వ్యతిరేకంగా మారుస్తున్నాయి. ఇక్కడ టీడీపీకి అనుకూలంగా ఉండే సామాజిక ఓటర్లపై ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. అయితే, వారితో పాటు ఇతర సామాజికవర్గ సెటిలర్లు కూడా పెద్దసంఖ్యలో ఉన్నారు. వీరు ఎటువైపు ఉంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. చంద్రబాబును దెబ్బకొట్టేందుకు ఆంధ్రాలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ, జనసేన అభిమానులు, ఆ పార్టీలకు అనుకూలంగా ఉండే రెండు సామాజకవర్గాల వారు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాట్లు కనిపిస్తోంది. పార్టీల నుంచి ఎటువంటి సూచనలు, ఆదేశాలు నేరుగా లేకున్నా వారికి వారే నిర్ణయించుకుని టీడీపీని ఓడించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వారంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ 22 వేల ఓట్లు సాధించింది. వీరిలో ఎక్కువ శాతం టీఆర్ఎస్ వైపే ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో ఏపీ రాజకీయాలు కూకట్ పల్లిలో టీఆర్ఎస్ కి కలిసివస్తున్నాయి. ఇక సుహాసిని పట్ల కొంతమంది ప్రజల్లో సానూభూతి కూడా ఎక్కువనే ఉంది. ఆడబిడ్డ అనే సానుకూలత కనిపిస్తోంది. ఆమె గెలుపు కోసం టీడీపీ శ్రేణులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మొత్తానికి, నందమూరి సుహాసిని గెలుపు అంత సులువుగా మాత్రం కనిపించడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*