చరిత్ర తిరగరాస్తారా?

ఎన్నికల్లో కులసమూహాలు నిర్వహించే పాత్ర జగద్విదితం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు కులాలు ఆధిపత్య రాజకీయాలు నడుపుతూ వచ్చేవి. రాష్ట్రవిభజన తర్వాత ఈ సామాజిక స్తరాల ప్రాధాన్యం విస్తరించింది. సంఖ్యాపరంగా తనకు కులబలం పెద్దగా లేకపోయినా ఉద్యమప్రభావంతో చరిత్ర తిరగరాయగలిగారు కేసీఆర్. 2019 నాటికి మళ్లీ కులాల ప్రాముఖ్యం ఏరకంగా ఉపకరిస్తుందనే చర్చలు మొదలయ్యాయి. ఆర్థికంగా,అంగబలం రీత్యా ప్రాబల్యం ఉన్న కులాల్లో దేనితోనూ సంబంధం లేకుండా అధికారం సాధించింది టీఆర్ఎస్. రానున్న సార్వత్రిక ఎన్నికలలో సైతం ఇదే పంథాను అనుసరిస్తుందా? ఏదో ఒక కులాన్ని అండగా తీసుకుంటుందా? అన్న విషయంలో కొంతకాలం క్రితం వరకూ సందేహాలు ఉండేవి. అనుమానాలను నివృత్తి చేస్తూ కేసీఆర్ ఒంటరిపోరాట దిశలో పార్టీని ముందుకు నడుపుతున్నట్లు రాజకీయవర్గాలు చెబుతున్నాయి. ప్రత్యర్థి కాంగ్రెసు అన్ని కులాలను, పార్టీలను కలుపుకుని పోయే ఎత్తుగడలు వేస్తోంది.

వెల్..కమ్ గ్రూపు…

బొటాబొటి సీట్లతో 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. హైదరాబాదు, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ వంటి చోట్ల కమ్మ సామాజిక వర్గం ఓట్లు అధికసంఖ్యలోనే ఉన్నాయి. ఆర్థికంగానూ సంపన్న వర్గం ఇది. పారిశ్రామిక, సేవా, సాఫ్ట్ వేర్ రంగాల్లో బలమైన ముద్ర వేయగలిగారు. ఆయా కారణాల రీత్యా కమ్మ సామాజిక వర్గంతో బలమైన రాజకీయ బంధం పెనవేసుకున్న టీడీపీని అక్కున చేర్చుకోవాలని టీఆర్ఎస్ భావించింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత టీడీపీ ఇక్కడ క్రమేపీ బలహీన పడిపోయింది. గత సార్వత్రిక ఎన్నికల్లో 15 సీట్లు సాధించగలిగింది. ఇప్పడు అందులో మూడో వంతు సీట్లకూ గ్యారంటీ లేని పరిస్థితి. అలాగని పూర్తిగా ఓటు బ్యాంకును కోల్పోయిందని చెప్పలేం. బలమైన మద్దతు, సంకీర్ణం కనిపిస్తే టీడీపీ ఒక ప్రధాన రాజకీయ పార్టీగా మనుగడ సాగించగలుగుతుంది. పరస్పర అవసరాలను ద్రుష్టిలో పెట్టుకుని టీడీపీ, టీఆర్ఎస్ కలిస్తే మంచిదనే దిశలో గతంలో చర్చలు నడిచాయి. ఒకానొక దశలో కేసీఆర్ కూడా పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్లు ప్రచారం సాగింది. వెలమ,కమ్మ కాంబినేషన్ తో వెల్కమ్ గ్రూపు రాజకీయాలను శాసిస్తుందని మీడియా, పొలిటికల్ సర్కిళ్లలో హడావిడి నెలకొంది. దానికి బ్రేకులు పడినట్లు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. టీడీపీని దూరం పెడుతూ తెలంగాణ సెంట్రిక్ గానే ఎన్నికల ప్రచార వ్యూహాలను రూపొందిస్తోంది టీఆర్ఎస్. ఏపీ ప్రత్యేక హోదాను వివాదాస్పదం చేయడం అందులో భాగమే.

రంగంలోకి ..‘కమ్..రెడ్లు’

తెలుగుదేశం పార్టీ తో తెలంగాణ రాష్ట్రసమితి పొత్తు ఉండదని స్పష్టం కావడంతో కాంగ్రెసు రంగంలోకి దిగింది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ స్పష్టమైన ప్రకటన చేసేశారు. కమ్మ సామాజిక వర్గంతోపాటు సెటిలర్ల ఓట్లను గంపగుత్తగా పొందడానికి టీడీపీతో చేయి కలపడం మంచిదని కాంగ్రెసు భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెసు పరిస్థితి ఏమంత సంతృప్తికరంగా లేదు. నాయకులకు కొరత లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపగలవారు కరవు అయ్యారు. రెడ్డి సామాజిక వర్గం దన్నుగా నిలుస్తుండటం, దళితుల్లో మెజార్టీ ఓట్లు పడతాయనే నమ్మకం మాత్రమే ఆశలు నిలుపుతోంది. టీడీపీ వాషవుట్ అయిపోతోంది కాబట్టి ఆ ఓట్లు కాంగ్రెసు వైపు మళ్లించాలనే తాపత్రయం మొదలైంది. కాంగ్రెసు పట్ల టీడీపీ నేతల్లో నిన్నామొన్నటివరకూ ఉన్న వ్యతిరేకత తగ్గుముఖం పట్టింది. టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో కాంగ్రెసు వైపు తొంగి చూస్తే తప్పులేదనే వాదన బలం పుంజుకొంటోంది. నిజానికి కాంగ్రెసు వ్యతిరేకతతోనే పార్టీ ఊపిరిపోసుకుంది. మారిన పరిస్థితుల్లో ఆ వ్యతిరేకతకు కాలం చెల్లింది. ప్రజలు కూడా పట్టించుకోరు. రాజకీయ అనివార్యతతో హస్తం పార్టీతో చేతులు కలపాల్సిందేనంటున్నారు. కానీ కాంగ్రెసులోనే సీట్ల పోటీ ఎక్కువ. టీడీపీని సంతృప్తిపరచడం సాధ్యమా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

ప్లస్సా..? మైనస్సా,,?..

నిజంగానే కాంగ్రెసుతో టీడీపీ చేతులు కలిపితే కొత్త చరిత్ర రాసినట్లవుతుంది. మిగిలిన అన్నిపార్టీలతోనూ కలిసినప్పటికీ కాంగ్రెసుతో నిరంతరం పోరాటం చేస్తూ వచ్చింది టీడీపీ. గతఎన్నికలో్నూ రాష్ట్రవిభజనకు ప్రధాన కారణంగా చూపించింది. కానీ ఇప్పుడు హస్తం పార్టీ టీడీపీకి రెండు రాష్ట్రాల్లోనూ పోటీదారు కాదు. తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రాలోనూ సానుకూల ఫలితం వస్తుందని అంచనా వేస్తున్నారు. కాంగ్రెసు పార్టీకి ఏపీలో రెండు శాతం మేరకు ఓట్లు ఉన్నాయి. వాటిని టీడీపీకి అనుకూలంగా మలచుకోవచ్చు. తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే పదిసీట్ల వరకూ గెలుచుకోవచ్చని టీడీపీ అంచనా వేస్తోంది.అయితే ఒకవేళ పొత్తు కుదుర్చుకున్నప్పటికీ కాంగ్రెసు గ్రూపుల మయం. ఎంతవరకూ స్థానిక నాయకులు సహకరిస్తారనేది అనుమానం. అందులోనూ నిన్నామొన్నటివరకూ ప్రధాన ప్రత్యర్థులుగా తలపడిన నాయకులు పరస్పరం చెట్టాపట్టాలు వేసుకుని ఓట్ల బదిలీకి మనస్ఫూర్తిగా పనిచేస్తారనే నమ్మకమూ రెండు పార్టీల క్యాడర్లలో కలగడం లేదు. టీఆర్ఎస్ , తెలుగుదేశం 2009లోనే కలిసి పనిచేశాయి. కాంగ్రెసు కంటే ఆపార్టీతో అయితే వెన్నుపోట్లు, అంతర్గత కలహాల బెడద తక్కువగా ఉంటుందని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. టీడీపీని టీఆర్ఎస్ పెద్ద ఫోర్సుగా భావించకపోవడం వల్ల పొత్తుపై సానుకూలత చూపడం లేదు. ఇక కాంగ్రెసు మాత్రమే మిగిలిన ఆప్షన్? పొత్తుకు ఒకే అనుకున్నప్పటికీ, సీట్ల సంఖ్యపరంగా విభేదాలు, వివాదాలు తలెత్తవచ్చు. ప్రస్తుత వాతావరణాన్ని బట్టి చూస్తే అవగాహనలే తప్ప అధికారిక పొత్తులు సాద్యం కాదని పరిశీలకులు పేర్కొంటున్నారు.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*