తూర్పులోనూ అద్దంకి టైప్‌ పంచాయితీ…!

తూర్పుగోదావరి జిల్లాలో ప్రకాశం జిల్లాలోని అద్దంకి తర‌హా పంచాయితీ చంద్రబాబు చెయ్యాల్సిందేనా ? ప్రకాశం జిల్లా అద్దంకిలో సిట్టింగ్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ వైసీపీ నుంచి రావడంతో అక్కడ గత ఎన్నికల్లో రవి చేతుల్లో ఓడిన పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్ మధ్య‌ తీవ్రమైన వార్‌ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో అద్దంకి సీటు తమదే అంటే తమదే అని వీరిద్దరూ సవాళ్లు రువ్వుకుంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు కరణం బలరాంకు ఎమ్మెల్సీ ఇచ్చినా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. చంద్రబాబుకు ఏపీలో అద్దంకి టైప్‌ పంచాయితీలు చాలానే ఉన్నాయి. అద్దంకితో పాటు కడప జిల్లా జమ్మలమడుగులో మంత్రి ఆదినారాయణ రెడ్డి వర్సెస్‌ మాజీ మంత్రి రామసుబ్బా రెడ్డి మధ్య‌ ఇదే తర‌హా వార్‌ నడుస్తోంది.

ఈ పంచాయతీలతోనే….

చంద్రబాబు అద్దంకి, జమ్మలమడుగు సమస్యను ఎలా పరిష్కరిస్తారన్నదానిపై క్లారిటీ లేకపోయినా దర్శి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి శిద్ధా రాఘవరావు నరసారావుపేట ఎంపీగా పోటీ చేస్తే కరణం వారసుడు వెంకటేష్‌కు దర్శి సీటు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి పోటీ చేస్తే మంత్రి ఆదినారాయణ రెడ్డిని కడప నుంచి లోక్‌సభకు పోటీ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవేళ‌ కడప ఎంపీగా ఆదినారాయణ రెడ్డి విజయం సాధించకపోయినా ఆయనకు ఎమ్మెల్సీతో పాటు ఇతర‌త్రా పదవులు ఇస్తామన్న హామీతో ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి పంచాయితీలతోనే చాలా వరకు విసిగి విసిగి వేసారిపోతున్న చంద్రబాబుకు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలోనూ ఓ ఇద్దరు టీడీపీ నాయకుల మధ్య‌ ఒకే నియోజకవర్గం కోసం జరుగుతున్న ఫైట్‌ మరో కొత్త తల నొప్పిగా మారింది.

పెద్దాపురంలోనూ….

తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం అసెంబ్లీ స్థానం నుంచి హోం మంత్రి, డిఫ్యూటి సీఎం నిమ్మకాయల చినరాజప్ప ప్రాధినిత్యం వహిస్తున్నారు. కోనసీమ ప్రాంతానికి చెందిన చినరాజప్ప గత ఎన్నికల్లో తొలి సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగి పెద్దాపురం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నిక అయ్యారు. ఆ తర్వాత ఆయన అనూహ్యంగా ఉప‌ముఖ్య‌ మంత్రి, హోం మంత్రి పదవులు చేపట్టారు. అంతకు ముందు పెద్దాపురం నియోజకవర్గంలో రెండు దశాబ్దాలుగా టీడీపీలో చక్రం తిప్పిన బొడ్డు భాస్కర‌ రామారావు గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్‌ చేసేశారు. బొడ్డు భాస్కర రామారావు తనయుడు బొడ్డు వెంకటరమణ చౌదరి రాజమహేంద్రవరం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయాక తిరిగి వాళ్లు టీడీపీ గూటికే జంప్‌ చేసేసారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం సీటు కోసం బొడ్డు భాస్కర రామారావు వర్సెస్‌ నిమ్మకాయట చినరాజప్ప మధ్య‌ పెద్ద యుద్ధమే నడుస్తోంది.

పెద్దాపురాన్ని వీడేది లేదంటూ….

చివరకు చినరాజప్ప బొడ్డు భాస్కర రామారావును ఓ టీవీ ఛానల్‌ ఇంటర్వూలో సంభోదించిన విధానం సైతం ఈ ఇద్ద‌రు నేత‌ల మ‌ధ్య తీవ్రమైన వార్‌కు కారణం అయ్యింది. ఆ తర్వాత బొడ్డు భాస్కర‌రావు సైతం అంతే ఘాటుగా చినరాజప్పకు రిప్లై ఇచ్చారు. పెద్దాపురం నియోజకవర్గాన్ని తన కోట్లాది రూపాయిలతో అభివృద్ధి చేసానని తాను పెద్దాపురాన్ని వీడే ప్రసక్తే లేదని వచ్చే ఎన్నికల్లో పెద్దాపురం నుంచి తాను అసెంబ్లీకి పోటీ చేస్తానని చినరాజప్పకు చెప్తున్నారు. మరో వైపు బొడ్డు భాస్కర‌రావు సైతం తాను గతంలో పెద్దాపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసానని పెద్దాపురం ప్రజలు తనని ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుని చూస్తుంటారని… అనివార్య కారణాల వల్ల పార్టీ మారినా పెద్దాపురం తన కోటే అని బొడ్డు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు రాని పక్షంలో బొడ్డు భాస్కర‌రావు పార్టీ మారేందుకు అయినా రెడీగా ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది.

ఎంపీగా పంపుతారా…?

ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం చినరాజప్పను కాకినాడ ఎంపీగా పోటీ చేయించి బొడ్డు భాస్కర‌రావును పెద్దాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న వ్యూహం కూడా పన్నుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజప్ప అయితే సామాజిక, ఆర్థిక కోణాల్లో కాకినాడ ఎంపీగా బాలమైన అభ్యర్థి అవుతాడని బాబు ప్లాన్‌గా తెలుస్తోంది. ఇక ప్రకాశం జిల్లాకు చెందిన మంత్రి శిద్ధా రాఘవరావును వచ్చే ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా పోటీ చేయిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నట్టుగానే ఇప్పుడు రాజప్ప విషయంలో సైతం అదే ఆలోచన చేస్తునట్టు తెలుస్తోంది. ఏదేమైనా వచ్చే ఎన్నికల్లో వీరిద్దరి మధ్య‌ సయోధ్య కుదిరి ఇద్దరికి సీట్లు ఇవ్వని పక్షంలో పెద్దాపురం టీడీపీ రాజకీయం రగలడం అయితే ఖాయం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*