జూనియర్ కోసం బాబు….?

చంద్రబాబు తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ గెలుపోటముల ప్రభావం వచ్చే ఆంద్రప్రదేశ్ ఎన్నికలపై ఉంటుందని భావించి చంద్రబాబు తనకు చిరకాల ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తో జట్టుకట్టారు. తనకు సీట్లు ముఖ్యం కాదని గెలుపు ముఖ్యమని పార్టీ శ్రేణులకు చంద్రబాబు ఉద్భోదించారు కూడా. ఎందుకంటే తెలంగాణలో మహా గెలిస్తే సింగిల్ డిజిట్ సీట్లలో గెలుస్తామన్నది చంద్రబాబుకు తెలియంది కాదు. ఒకవేళ తాను ఊహించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితే మంత్రివర్గంలో చేరి కొంత గ్రిప్ సంపాదించుకునే వీలుంటుంది. తనకు ప్రత్యర్థిగా మారిన కె.చంద్రశేఖర్ రావుకు కూడా తన సత్తా ఏంటో చూపించినట్లు అవుతుందని ఆయన కాంగ్రెస్ తో జతకట్టి తక్కువ స్థానాలయినా తలూపారు.

గత ఎన్నికల్లో…..

ఇక వచ్చే ఎన్నికల నాటికి తనకు ఏపీలో కాంగ్రెస్ మాత్రమే మద్దతు ఉంటుంది. గత ఎన్నికలలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్లామర్ బాగా పనిచేసింది. పవన్ మద్దతివ్వడంతో పాటు కాపు సామాజికవర్గం ఓట్లు కూడా పోలవ్వడంతో ఆయన సులువుగా అధికారంలోకి రాగలిగారు. మరోవైపు మోదీ ఛరిష్మా కూడా పనిచేయడం, తన సామర్థ్యంపై ఏపీ ప్రజలు నమ్మకం పెట్టుకోవడంతో గెలుపు సాధ్యమయింది. అయితే ఈసారి పవన్ మద్దతు లేదు. మోదీ ప్రధాన శత్రువుగా మారారు. రాజధాని, పోలవరం నిర్మాణం కూడా పూర్తికాకపోవడంతో చంద్రబాబు సమర్థతను కూడా ఈసారి ఏపీ ప్రజలు పరిగణనలోకి తీసుకోరు.

గ్లామర్ అవసరమయి….

దీంతో చంద్రబాబు మరోసారి సినీగ్లామర్ అవసరం వచ్చింది. అయితే ఇప్పటికే టాలివుడ్ లో అధికంగా తనకు మద్దతు ఇస్తున్నా వారెవరూ ప్రజలను ఆకర్షించే స్థాయిలో లేరన్నది వాస్తవం. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ పార్టీకోసం ప్రచారం చేశారు. అయితే 2014 ఎన్నికల్లో పవన్ ఉండటంతో జూనియర్ ను చంద్రబాబు పక్కన పెట్టేశారు. హరికృష్ణకు కూడా రాజ్యసభ సభ్యత్వం రెన్యువల్ చేయకపోవడం కూడా కొంత ఆ కుటుంబంలో చంద్రబాబు పట్ల వ్యతిరేకత ఏర్పడింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. రాజకీయాలవైపు వచ్చే ఆలోచన ఆయన చేయడంలేదు. మహానాడు వంటి కార్యక్రమాలకు కూడా ఆ కుటుంబం దూరంగా ఉంది. బావమరిది బాలకృష్ణ ఉన్నప్పటికీ ఆయనకంటే జూనియర్ కే ఎక్కువ అభిమానుల బలం ఉన్నట్లు బాబు గుర్తించారు.

మళ్లీ దగ్గర తీసుకునేందుకు…..

అయితే ఇటీవల హరికృష్ణ మరణించడంతో ఆ కుటుంబాన్ని మళ్లీ దగ్గరతీసుకునే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ను వచ్చే ఎన్నికల ప్రచారంలో ఉపయోగించుకోవాలన్నది బాబు ఆలోచనగా ఉంది. అందుకోసమే హరికృష్ణ కూతురు సుహాసినిని తెలంగాణ రాజీకీయాల్లోకి తేవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తొలుత కూకటపల్లి స్థానం కోసం సినీ హీరో కల్యాణ్ రామ్ పేరు విన్పించినప్పటికీ, ఆయన తిరస్కరించడంతో సోదరి సుహాసినిని పోటీచేసేందుకు ఒప్పించారు. తద్వారా ఇటు హరికృష్ణ ఫ్యామిలీని దగ్గరకు చేసుకోవడంతోపాటు జూనియర్ ఎన్టీఆర్ ను వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి ఉపయోగించుకోవచ్చన్నది బాబు ఆలోచన. సోదరి పోటీ చేసినా జూనియర్ ప్రచారానికి వచ్చినప్పటికీ, ఏపీలో ఎన్నికలకు ఆయన వస్తారా? అన్నది సందేహమేనన్నది కొందరి వాదన. మరి ఏం జరుగుతుందోచూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*