బాబు గొంతు నొక్కేస్తారా?

ఢిల్లీ లో రాజకీయ వేడి తారా స్థాయికి చేరింది. నీతి ఆయోగ్ సమావేశానికి ముందే హస్తిన రాజకీయాలు హాట్ హాట్ గా నడుస్తున్నాయి. మోడీ వర్సెస్ విపక్షాలు అన్న రీతిలో పాలిటిక్స్ లో ఎవరి వ్యూహాల్లో వారు బిజీగా వున్నారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల సిఎంల హల్చల్ హస్తినలో అంతా ఇంతా లేదు. ముఖ్యంగా ఎపి సీఎం ఒక రూట్ లో వెళుతుంటే టి సిఎం మరో రూట్ లో తమ రాజకీయాలు మొదలెట్టేశారు. పేరుకి నీతి అయోగ్ సమావేశానికి అంతా రెడీ అవుతున్నారు కానీ వెనుక బిజెపి వెర్సెస్ విపక్షాలు అన్న రీతిలో యుద్ధానికి సమాయత్తం అవుతున్నారు.

బాబు వరుస భేటీలతో …

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారా స్వామి, కేరళ సిఎం విజయన్ లతో చర్చలు మొదలు పెట్టేశారు ఎపి సీఎం చంద్రబాబు. ఎపి భవన్ కేంద్రంగా నీతి ఆయోగ్ లో ప్రస్తావించాలిసిన అంశాలను ముఖ్యమంత్రులు ముందుగా గుర్తించి బిజెపియేతర ప్రభుత్వాలు వున్న చోట్ల జరుగుతున్న అన్యాయాన్ని గట్టిగా నిలదీయాలని నిర్ణయించారని తెలియవస్తుంది. దాంతో బాటు రాబోయే ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా అమలు చేయాలిసిన వ్యూహాన్ని వీరంతా డిసైడ్ చేస్తున్నారని అంటున్నారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తీరుకు నిరసనగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి మద్దతు ప్రకటించారు.

ప్రధానితో కెసిఆర్ …

ప్రధాని నరేంద్ర మోడీ తో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక భేటీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరూ గంట సేపు భేటీ జరిగితే అందులో అరగంట సేపు మోడీ – కెసిఆర్ రహస్య చర్చలు సాగించారు. అదే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా నడుస్తుంది. థర్డ్ ఫ్రంట్ ఫెడరల్ ఫ్రంట్ అంటూ హడావిడి చేసి కెసిఆర్ ప్రధానితో జట్టు కట్టేయడం మరింత ఆసక్తి రేపుతోంది. కాళేశ్వరం జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడం లేదా కేంద్ర సాయాన్ని కెసిఆర్ కోరుతున్నారు. బిజెపికి వ్యతిరేకంగా కాకుండా అనుకూలంగా కాకుండా సాధించాలన్న తెలంగాణ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని కెసిఆర్ ఎత్తుగడలు వేస్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని తొలుత బహిష్కరిస్తారనుకున్న కెసిఆర్ ప్రధానితో భేటీ సంతృప్తికరంగా సాగడంతో ఢిల్లీ లో నీతి ఆయోగ్ సమావేశంలో హుషారుగా పాల్గొనేందుకు సిద్ధమయ్యారు.

అవకాశం దక్కుతుందా …?

నీతి ఆయోగ్ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాలకు బిజెపి సర్కార్ అన్యాయం చేస్తుందంటూ గళమెత్తాలనుకుంటున్న చంద్రబాబు గొంతు వినిపిస్తారా లేక వ్యూహాత్మకంగా ఆయన గొంతును నొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారా అన్న అంశం చర్చనీయాంశం అయ్యింది. బాబు గొంతు నొక్కేస్తే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించేలా వ్యూహం సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే బాబు కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఏడాదిన్నర కాలం నిలిపేసిన మోడీ కేసీఆర్ అడిగిన వెంటనే ఆయనతో ములాఖత్ కావడం కూడా చర్చనీయాంశం అయ్యింది. కెసిఆర్ థర్డ్ ఫ్రంట్ మోడీ గేమ్ లో భాగమేనన్న అనుమానాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాలతో పాటు రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఒకరికొకరు చేదోడు వాదోడుగా వుంటూ మోడీ వ్యూహాలను తిప్పికొట్టాలన్న ఏకాభిప్రాయానికి విపక్ష సీఎం లు వచ్చినట్లు తెలుస్తుంది. మరి ఏమి జరగనుందో నీతి ఆయోగ్ భేటీ అనంతరం తేలనుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*