బాబు టాస్క్…. అదిరింది…!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వరుస భేటీలతో వారికి క్లాస్ లు పీకుతున్నారు. అయినా తెలుగుదేశం పార్టీకి మరింత హైప్ తీసుకురావాలంటే పార్టీలో చేరికలను షురూ చేయాలని నేతలను ఆదేశించారు. ఈరోజు జరిగిన ముఖ్యనేతల సమావేశంలో చంద్రబాబు చేరికల విషయాన్ని ముఖ్యంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీలో గతకొంతకాలంగా చేరికలు ఆగిపోయాయి. కొత్త నేతలు ఎవరూ పార్టీ వైపు చూడకపోవడం, ఉన్న నేతలను పార్టీని వీడుతుండటంతో ఆ ప్రభావం పార్టీపై పడుతుందని చంద్రబాబు భావిస్తున్నారు.

ఆగస్టు నెలలో చేరికలకు…..

అందుకే ఆగస్టు నెలలో చేరికలకు శ్రీకారం చుట్టాలని చంద్రబాబు నేతలను ఆదేశించారు. ముఖ్యనేతలను పార్టీలోకి తీసుకురావాలని, అందుకు కొందరు మంత్రులకు బాధ్యతలను అప్పగించారు. వైసీపీలో అసంతృప్తిగా ఉన్న వారినీ, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఎవరు వచ్చినా చేర్చుకోవాలన్నది బాబు ఆలోచనగా ఉంది. ఇదే విషయాన్ని నేతలకు చెప్పారు. కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పార్టీలోకి చేరిన తర్వాత ఇక ఎవ్వరూ పార్టీలో చేరలేదు. దీనిపై చంద్రబాబు నేతల వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.

ఆరా తీసిన చంద్రబాబు…..

పార్టీలో చేరకపోవడానికి కారణాలేంటి? స్థానిక నేతలు ఎవరైనా వారిని అడ్డుకుంటున్నారా…? అని కూడా ఆరా తీశారు. ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గం గురించి ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. మైదుకూరు నుంచి డీఎల్ రవీంద్రారెడ్డి టీడీపీలో చేరతారని గతకొంతకాలంగా ప్రచారం జరుగుతుంది. డీఎల్ కూడా ప్రస్తుతం ఖాళీగానే ఉన్నారు. ఆయన ఇటీవల తనపుట్టినరోజు నాడు త్వరలోనే తన కార్యాచరణను ప్రకటిస్తానని చెప్పారు. కాని డీఎల్ చేరకపోవడానికి పుట్టా సుధాకర్ యాదవ్ కారణమని చంద్రబాబు భావించారు. టిక్కెట్ల ఖరారు విషయం పక్కన పెట్టి డీఎల్ ను తొలుత పార్టీలోకి తీసుకొచ్చే విషయంపై దృష్టి పెట్టాలని ఆయన గట్టిగానే కోరినట్లు తెలిసింది. డీఎల్ ను పార్టీలోకి తీసుకొచ్చే బాద్యతను రాయలసీమకు చెందిన ఒక మంత్రికి అప్పగించారని తెలుస్తోంది.

మైసూరా విషయంపై……

అలాగే మైసూరారెడ్డి కూడా పార్టీలోకి వచ్చే అవకాశముంది. మైసూరారెడ్డి వద్దకు ఇద్దరు మంత్రులు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. మైసూరారెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. అయితే ఎందుకో ఆయన చేరిక ఆగిపోయింది. అలాగే ప్రకాశం జిల్లాలో ఒక వైసీపీ నేత విషయాన్ని కూడా చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. ఆయనను తీసుకొస్తే ఆ నియోజకవర్గంలో గెలుపు గ్యారంటీ అని తెలిసి కూడా ఎందుకు ప్రయత్నించలేదని ఆ జిల్లాకు చెందిన మంత్రినే చంద్రబాబు కొంత గట్టిగా చెప్పారు. మొత్తం మీద చంద్రబాబు ఇచ్చిన టాస్క్ తో నేతలు పరుగులు తీస్తున్నారు. నెల రోజుల సమయంలో ఎంతమందిని పార్టీలోకి తీసుకొస్తారోచూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*