ఎలా నమ్మాలి చంద్రన్నా…?

మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు కేంద్రంపై దుమ్మెత్తి పోస్తున్నారు. అంతేకాదు, ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌యంలో వ్యూహాత్మ‌కంగా ఎదురు దాడి చేస్తామ‌ని, మ‌రింత‌గా కేంద్రంపై పోరు సాగిస్తామ‌ని ఆయ‌న అంటున్నారు. అయితే, దీనిలో ఎంత వర‌కు నిజం ఉంది? చంద్ర‌బాబు నిజంగానే పోరు చేస్తున్నారా? అనే సందేహాలు కొన్నాళ్లుగా ప్ర‌జ‌ల్లో వ్య‌క్త‌మ‌వుతున్నాయి. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఇత‌ర రాష్ట్రాలు ఏ విధంగా సాధిస్తున్నాయో గ‌మ‌నించి వాటిని అనుస‌రించాల్సిన చంద్ర‌బాబు.. పోరు చేస్తాన‌ని చెప్ప‌డం ద్వారా వ్యూహాత్మ‌కంగా ఎన్నిక‌ల్లో గెలిచే ప్ర‌య‌త్నాల‌నే ముమ్మ‌రం చేసుకుంటున్నార‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

పోరు వల్ల…..

విభజన గాయాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకుంటామని చెప్పి మాట తప్పిన ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని తాజాగా కూడా చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. పంద్రాగ‌స్టు ప్ర‌సంగంలో కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. స‌రే! పోరు విష‌యానికే వ‌స్తే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి మ‌రో పార్టీ రావొచ్చు! అప్పుడు ప‌రిస్థితి ఏంటి? రాష్ట్రంలో చంద్ర‌బాబు చేస్తున్న పాల‌న వ‌ల్ల ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం క‌ల‌గాలి! కానీ, పోరు వ‌ల్ల ఏం లాభం? కేంద్రంతో క‌లిసి ఉన్న‌ది మీరు! ఇప్పుడు విడిపోయింది కూడా మీరే! కానీ, ఈ విష‌యంలో ప్ర‌జ‌ల క‌ళ్ల‌కు గంత‌లు క‌ట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు చంద్ర‌బాబు. మ‌ళ్లీ పోరాడ‌తామ‌ని చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి కూడా ఆయ‌న పోరు చేస్తూనే ఉంటార‌ట‌!

లెక్కలు చెప్పడం లేదని…..

ఢిల్లీకి మించిన రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పిన మోడీ.. రూ.1500 కోట్లే విదిల్చి(కేంద్రం రూ.2500 కోట్లుగా చెబుతోంది) ఇతర రాష్ట్రాలు, నగరాలకు పెద్ద ఎత్తున నిధులు కుమ్మరిస్తున్నారనేది బాబు ఆవేద‌న‌. కానీ, కేంద్రం వాద‌న‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటే.. బాబు ఇచ్చిన డ‌బ్బుల‌కు లెక్క‌లు చెప్ప‌డం లేద‌ని అంటోంది. వీరిద్ద‌రిలో ఎవ‌రి వాద‌న క‌రెక్టో తెలియ‌దు! మ‌రో ఆరు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఏపీలో తాను అధికారంలోకి వ‌స్తేనే ఏపీకి ప్ర‌యోజ‌నం క‌లుగుతుంద‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు చెప్పుకొన్న చంద్ర‌బాబు ఇప్పుడు మాత్రం ఆవ్యాఖ్య‌ల జోలికి కూడా పోవ‌డం లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం ఇప్ప‌టికే ఆయ‌న గ్ర‌హించారు.

సీనియర్ మోస్ట్ అయి కూడా…..

పాలిటిక్స్‌లో సీనియ‌ర్ మోస్ట్ అయి ఉండి కూడా ఏమీ సాధించ‌లేని ప‌రిస్థితిని ఆయ‌న ఎదుర్కొంటున్నారు. అదే స‌మ‌యంలో ఇన్నాళ్లు కేంద్రంతో మంచిగా ఉండి.. ఏమీ సాధించ‌లేక‌పోయార‌నే అప‌వాదు కూడా ఉంది. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ చెప్పిన‌ట్టు పోరు బాట ప‌ట్టికూడా ఏమీ సాధించ‌లేక‌పోతున్నారు. ఫ‌లితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ఎందుకు గెలిపించాల‌నే ప్ర‌శ్న సాధార‌ణంగానే తెర‌మీదికి వ‌స్తోంది. ఇప్పుడు సాధించ‌లేని నాయ‌కుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏం పొడుస్తాడ‌నే వ్యాఖ్య‌లు జోరుగానే వినిపిస్తున్నాయి. మ‌రి ఇప్పుడు చంద్ర‌బాబు చేస్తున్న‌ది పోరాట‌మా? ప‌్ర‌హ‌స‌న‌మా? అనేది ఆయ‌న‌కే తెలియాలి!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*