బాబు భవిష్యత్ గురించి ఆలోచించే…?

జాతీయ రాజకీయాల గురించి ఆలోచించనని నిన్నమొన్నటి వరకూ చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక దిగక తప్పని పరిస్థితి నెలకొంది. జాతీయ పార్టీ అయిన బీజేపీని ఎదుర్కొనాలంటే ప్రాంతీయ పార్టీలతోనూ, అవసరమైతే కాంగ్రెస్ తోనూ వెళ్లకతప్పదని చంద్రబాబు భావిస్తున్నట్లుంది. అందుకోసమే జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న సందర్భాన్ని ఆయన వినియోగించుకున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇక తనకు ఇతర పార్టీల మద్దతు తప్పదని చంద్రబాబు భావిస్తున్నారు.

మమతతో భేటీ అయి…..

కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరైన చంద్రబాబు అక్కడ వివిధ నేతలతో సమావేశమయ్యారు. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల వ్యవహరిస్తున్న తీరును వివరించారు. తనపైనా, ప్రభుత్వంపైనా జరుగుతున్న కుట్రలను చంద్రబాబు వివరించినట్లు తెలిసింది. స్థానిక పార్టీ వైసీపీతో కలసి తనను ఇబ్బందిపెట్టే యోచనలో కమలం పార్టీ ఉందని చంద్రబాబు మమతకు వివరించారు. బీజేపీ ప్రతి రాష్ట్రంలో వేలుపెట్టి అక్కడి ప్రాంతీయ పార్టీలను ఇబ్బందిపెట్టే అవకాశముందని, సంఘటితంగా ఎదుర్కొనగలిగితేనే దాని దూకుడుకు ముకుతాడు వేయవచ్చని చంద్రబాబు ఈ సందర్భంగావ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.

తనను ఇబ్బంది పెడితే…..

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతబెనర్జీ కూడా చంద్రబాబు ఆలోచనలకు ఏకీభవించారు. కాంగ్రెస్ తో కలసి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఏర్పడితేనే బీజేపీ విజయాలకు అడ్డుకట్ట వేయగలమని మమత చంద్రబాబుతో అన్నారు. కర్ణాటకలో ఇప్పుడు ఏర్పడుతున్న ప్రభుత్వాన్ని కూడా ఎక్కువ కాలం ఉంచకుండా బీజేపీ కుట్రలు చేసే ప్రమాదముందని కూడా మమత అభిప్రాయపడ్డారు. మరోవైపు కేరళ సీఎం పినరయి విజయన్ తో కూడా చంద్రబాబు చర్చలు జరిపారు. మొత్తం మీద బీజేపీకి వ్యతిరేకంగా చంద్రబాబు కూటమి కట్టే ప్రయత్నంలో ఉన్నట్లు బెంగుళూరు పర్యటన తేల్చి చెప్పింది. భవిష్యత్తులో తనను కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టినా జాతీయ స్థాయిలో తనకు మద్దతు దొరుకుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. అలాగని రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ తో జత కట్టే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తారా? అన్నది కూడా అనుమానమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*