బాబు అలా ..బీజేపీ ఇలా….?

తెలుగుదేశం పార్టీ తమపై చేస్తున్న దుష్ప్రచరాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. ముఖ్యంగా రాయలసీమ నేతలు చంద్రబాబు మోసపూరిత వైఖరిని ఎండగట్టాలని నిర్ణయించారు. కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఆమరణ దీక్షకు దిగబోతున్నారు. అయితే ఇవన్నీ దొంగదీక్షలంటోంది బీజేపీ. రాయలసీమకు తొలినుంచి అన్యాయం చేస్తుంది తెలుగుదేశం పార్టీయేననిచెబుతోంది. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ 2014 డిసెంబరు 2న ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వస్తే అందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదని చెబుతోంది. ఇందుకు తగ్గ సాక్ష్యాధారాలను ప్రజల వద్ద ఉంచబోతోంది.

కడప స్టీల్ ఫ్యాక్టరీ…..

కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధ్యం కాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఈ అంశంపై ఉద్యమించాలని నిర్ణయించింది. సీఎం రమేష్ ఆమరణదీక్షతో పాటు ఆ పార్టీకి చెందిన ఎంపీలందరూ ఈ నెల 20వ తేదీన కడపలో దీక్షకు దిగనున్నారు. ఈనేపథ్యంలో అంతకు ముందుగానే ప్రజలకు వాస్తవ విషయాలను తెలియజేయాలని నిర్ణయించింది బీజేపీ. 2014లో ఒకసారి కేంద్ర ప్రభుత్వం కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రయత్నించిందని, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోవడంతో తిరిగి 2016లో కూడా కేంద్రం మరోసారి స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు యత్నించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

త్వరలోనే కడపకు ప్రధాని…..

చంద్రబాబు నాలుగేళ్లు కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయాన్ని ప్రస్తావించకుండా కేవలం నియోజకవర్గాల పెంపుపైనే 29 సార్లు ఢిల్లీకి తిరిగారని బీజేపీ చెబుతోంది. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు జరిగి తీరుతుందంటున్న బీజేపీ త్వరలోనే ప్రధానమంత్రి కడపకు వచ్చి స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయనున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు. బహుశా రెండు నెలల్లో ప్రధాని మోడీ కడపకు వచ్చే అవకాశముందంటున్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడానికి కేంద్రం సిద్ధంగా ఉన్న తరుణంలో తమవల్లనే వచ్చిందని చెప్పుకోవడానికి టీడీపీ నేతలు దీక్షలకు దిగుతున్నారంటున్నారు.

హైకోర్టు మాటేంటి?

కేంద్రం నుంచి సహకారం అందడం లేదనే చంద్రబాబు రాయలసీమకు ఏం చేశారో చెప్పాలనికూడా బీజేపీ నేతలు నిలదీస్తున్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలన్న డిమాండ్ ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదని వారు మండిపడుతున్నారు. కేవలం అమరావతిలోనే అంతా అభివృద్ధి చేస్తూ రాయలసీమను చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారంటున్నారు. రాయలసీమ మీద చంద్రబాబుకు అంత ప్రేమే ఉంటే హైకోర్టు వెంటనే ఇక్కడ పెడుతున్నట్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం మీద కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం టీడీపీ నేతలు ఉద్యమిస్తుంటే రాయలసీమ అభివృద్ధి నినాదంతో కమలనాధులు ప్రజల ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.