ట్రింగ్…ట్రింగ్ లోనూ….ట్రింగ్…ట్రింగే….!

నీతి గురించి మాట్లాడుతూ అవినీతికి పాల్ప‌డ‌డం అంటే ఇదేనేమో.. మంచి మాటున ముంచ‌డం అంటే.. ఇలాగే ఉంటుందేమో.. నిజంగా ఏపీ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న కాల్‌సెంట‌ర్ ను చూస్తే ఇవే అనుమానాలు వ‌స్తున్నాయి. పాల‌న‌లోపార‌ద‌ర్శ‌క‌త‌, అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, సంక్షేమ ప‌థ‌కాల అమ‌లు తీరుపై ప్ర‌జ‌ల నుంచి ఫీడ్ బ్యాక్‌ తీసుకోవ‌డం.. అదే స‌మ‌యంలో వారి స‌మ‌స్య‌లు తెలుసుకుని ప‌రిష్క‌రించ‌డం కోస‌మంటూ గ‌త ఏడాది ఏప్రిల్‌లో అమ‌రావ‌తి స‌మీపంలో మెగా కాల్‌సెంట‌ర్‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రారంభించారు. అయితే.. ఇది చెప్పుకోవ‌డానికి బాగానే ఉన్నా.. ఇందులోనూ కొంత పిండుకుంటున్నార‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. కాల్‌సెంట‌ర్ టెండ‌రింగ్‌లోనూ గోల్‌మాల్ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. సిబ్బంది నియామ‌కం.. వారికి వేత‌నాల చెల్లింపుల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

నిబంధనలను తుంగలో తొక్కి….

మెగా కాల్ సెంట‌ర్‌ను నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌లు కార్వే అనే సంస్థ చూస్తోంది. అయితే, కార్వే విష‌యంలో ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌ను తుంగ‌లో తొక్కింద‌నే వాద‌న వినిపిస్తోంది. నిజానికి దీనిని సంబంధిత అధికారులు కూడా ధ్రువీక‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ కాల్ సెంట‌ర్లో సుమారు ఏడువంద‌ల‌కుపైగా సిబ్బంది ప‌ని చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు దక్కాల్సిన వేతనాలను పూర్తిగా వారికి చెల్లించకుండా..మధ్యలోనే కొంత మంది పెద్ద‌లు కోట్లాది రూపాయలు కొట్టేస్తున్నట్లు అధికార వర్గాలు ఆఫ్‌ది రికార్డుగా చెబుతున్నాయి. దీనిపై విచార‌ణ జ‌రిపిస్తే.. అస‌లు విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తుంద‌ని ఓ ఉన్న‌తాధికారి పేర్కొన‌డం గ‌మ‌నార్హం.

టెండర్ సమయం ముగిసినా…..

కాల్‌సెంట‌ర్ నిర్వ‌హ‌ణ‌కు సింగిల్ టెండర్ వచ్చినా కార్వేకు చెందిన సంస్థకే ప్ర‌భుత్వం కాల్ సెంటర్ నిర్వహణ బాధ్యతను అప్పగించింది. అయితే, ఇక్క‌డ చిత్ర‌మేమిటంటే.. ఈ టెండర్ గడువు ముగిసిన తర్వాత కూడా అదే సంస్థకు కొన‌సాగించ‌డం గ‌మ‌నార్హం. టెండ‌ర్ గ‌డువు ముగిసేలోపే కొత్త టెండ‌ర్ల‌ను పిలిచి.. ఎవ‌రు త‌క్కువ కోట్ చేస్తే వారికే బాధ్య‌త‌లు అప్ప‌గించాలి. కానీ, మ‌న ఏపీ ప్ర‌భ‌త్వానికి ఇవేవీ ప‌ట్ట‌వు. ఏం చ‌క్కా పాత సంస్థ‌నే హాయిగా కొనసాగిస్తున్నారు. అంతేగాకుండా.. ఆ సంస్థ కోట్ చేసిన దానికి.. ప్ర‌భుత్వం చెల్లిస్తున్న దానికి పెద్ద‌మొత్తంలో తేడా ఉన్న‌ట్లు తెలుస్తోంది.

బాబు దృష్టి పెట్టలేదా?

సిబ్బంది సంఖ్య‌లోనూ తేడా ఉన్న‌ట్లు స‌మాచారం. అవినీతి నిర్మూల‌న, పాల‌న పార‌ద‌ర్శ‌క‌త కోస‌మంటూ చెప్పిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు.. ఈ విష‌యంలో ఇలా చూసీ చూడ‌న‌ట్లు ఉండ‌డంతో అనేక అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే కొత్త రాజ‌ధాని నిర్మాణం పేరుతో ప్ర‌భుత్వం ఆర్థిక అరాచ‌క‌త్వానికి తెర‌తీసిందనే వాద‌న వినిపిస్తోంది. ఇప్పుడు కాల్‌సెంట‌ర్ విష‌యంలో కోట్లాది రూపాయ‌ల దుర్వినియోగం.. అవినీతీ జ‌రుగుతున్న‌ట్లు ఆరోప‌ణలు రావ‌డం గ‌మ‌నార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*