చంద్రబాబు ఆ…నమ్మకం…ముంచేస్తుందా?

ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడ ఏ వేదిక ఎక్కినా.. త‌న ప్రభుత్వంపై సంతృప్తి పెరుగుతోంద‌ని, ప్రజ‌ల‌కు సేవ చేయ‌డంలో తాను ఎంతో సంతృప్తిగా ఉన్నాన‌ని ప‌దే ప‌దే చెబుతున్నారు. సంతృప్తికి సంబందించిన కొల‌మానాల‌ను సైతం ఆయ‌న ఉటంకిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ప్రభుత్వంపై ప్రజ‌ల్లో ఉన్న సంతృప్తి ఎంత అంటే.. చంద్రబాబు నోటి నుంచి ఠ‌క్కున వ‌చ్చే స‌మాధానం.. 75% అని! అయితే, ఇదే విష‌యంలో ఆయ‌న మంత్రి వ‌ర్గంలోని కీల‌క అమాత్యులు మాత్రం.. చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వ్యక్తం చేస్తున్న లేదా చూపిస్తున్న సంతృప్తికి, క్షేత్రస్థాయిలో వ‌స్తున్న తృప్తికి చాలా తేడా ఉంద‌నేది వారి మాట‌!

మంత్రుల్లో అసంతృప్తి……..

మ‌రి ఎంతో అనుభ‌వం ఉంద‌ని చెబుతున్న చంద్రబాబుకు, ఆయ‌న మంత్రి వ‌ర్గంలోని మంత్రుల‌కు మ‌ధ్య ఈ వ్యత్యాసం ఏంటి? చంద్రబాబు సంతృప్తిగా ఉంటే .. మంత్రులు ఇలా అసంతృప్తి వ్యక్తం చేయ‌డం ఏంటి? ఎందుకు ఇలా జ‌రుగుతోంది? అనే కీల‌క అంశాలు చ‌ర్చకు వ‌స్తున్నాయి. టెక్నాల‌జీ విష‌యంలో చంద్రబాబును కొట్టే వారే లేరు. ఆయ‌న చేసే ప‌ని, చేయ‌బోయే ప‌ని అంతా కూడా టెక్నాల‌జీతోనే ముడిప‌డి ఉంటుంది. అయితే, ఈ టెక్నాల‌జీ విష‌యంలోనే మంత్రులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు న‌మ్ముతున్న టెక్నాల‌జీ ఆఖ‌రుకు త‌మ కొంప ముంచుతుంద‌ని వారు భావిస్తున్నారు. ఆర్టీజీ నుంచి వెళ్లే కాల్స్‌ని ప్రాతిపదిక చేసుకుని సంతృప్తి శాతం బాగుందని మురిసిపోతే మునగడం ఖాయమని సీనియర్ మంత్రి ఒక‌రు తన శాఖ అధికారులతోనే వ్యాఖ్యానించడం గమనార్హం.

గంటల తరబడి అక్కడేనా?

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్టీజీ సెంటర్‌కు వెళ్లి గంటల తరబడి సమయాన్ని వెచ్చించడంపై మరో సీనియర్ మంత్రి ఆక్షేపించారు. ఒక సందర్భంలో తాను సీఎం కోసం రెండు గంటలపాటు ఎదురుచూడాల్సి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో ఇలాగే టెక్నాలజీ వైపు పరుగులు పెట్టి 2004లో అధికారాన్ని చేజార్చుకున్నామని ఒక మంత్రి ప్రస్తావించారు. నిజానికి చంద్రబాబు చెబుతున్న సంతృప్తి.. అంతా కూడా నేరుగా ప్రజ‌ల్లోకి వెళ్లి చేస్తున్నది ఏమీ కాదు. కేవ‌లం రియ‌ల్ టైం గ‌వ‌ర్నెన్స్ ద్వారా అమ‌రావ‌తి నుంచే ఫోన్‌ల‌కు కాల్ చేసి తీసుకుంటున్న స‌ర్వే.. అది కూడా కేవ‌లం 10 శాతం మంది ప్రజ‌ల‌కే చేరువ అవుతోంది. కానీ, అధికారులు మాత్రం చంద్రబాబు వ‌ద్ద మెప్పు పొందేందుకు ఆయ‌న‌కు స‌ర్వే ఫ‌లితాల‌ను భారీ రేంజ్‌లోఇస్తున్నార‌ని మంత్రులు వాపోతున్నారు.

టెక్నాలజీని నమ్ముకుంటే….

ముఖ్యమంత్రి మళ్లీ టెక్నాలజీ వైపే ఎక్కువ మొగ్గుతున్నారని మంత్రులు ఆందోళనగా ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందే విషయంలో ఆర్టీజీ అధికారులు కొత్తకొత్త నిబంధనలు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారనేది మంత్రుల మాట‌. ఈ పరిణామం వల్ల ఆశించిన ల‌బ్ధి చేకూర‌క‌పోగా.. న‌ష్టం భారీ ఎత్తున ఉండే అవ‌కాశం ఉంద‌ని, టెక్నాల‌జీనే అన్ని స‌మ‌స్యల‌కూ ప‌రిష్కారం చూప‌బోద‌ని అంటున్నారు. మొత్తంగా ఈ ప‌రిణామం చ‌ర్చనీయాంశంగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*