బాబు తుఫాను ను కూడా….?

కాదేదీ క‌విత‌క‌న‌ర్హం!! అన్న‌ట్టుగానే.. ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయ కోణంలోనే చూస్తున్నారు. రాష్ట్రంలో ఏం జ‌రిగినా, కేంద్రం నుంచి నిధులు స‌కాలంలో అంద‌క‌పోయినా కూడా ఆయ‌న ఆయా విష‌యాల‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ఓట్లు గుంజుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. కేంద్రం నుంచి ఏదైనా ఇబ్బంది ఎదురైనా.. కోర్టు ల నుంచి త‌న‌కు తాఖీదులు వ‌చ్చినా కూడా చంద్ర‌బాబు త‌న‌కు అనుకూలంగా వాటిని మ‌లుచుకోవ‌డంలో ముందుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో వ‌చ్చిన తిత్లీ తుఫాను బాబుకు అందివ‌చ్చిన అవ‌కాశంగా మారింది అంటున్నారు విప‌క్షాల నాయ‌కులు. అయితే, త‌న‌కు ప్ర‌జా సానుభూతే తప్ప మిగిలిన వాటితో ప‌నిలేద‌ని అంటున్నారు చంద్ర‌బాబు.

రెండు తుఫానులు……

చంద్ర‌బాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో వర్షాల మాట ఎలా ఉన్నా.. రెండు మార్లు మాత్రం తుఫానులు వ‌చ్చాయి. అవి కూడా ఉత్త‌రాంధ్ర‌కే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం., అంతేకాదు, వీటిలోనూ విశేషం ఉంది. చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన ఏడెనిమిది నెల‌ల త‌ర్వాత విశాఖ‌కు హుద్‌హుద్ తుఫాను వ‌స్తే.. ఇప్పుడు మ‌రో ఏడెనిమిది నెల‌ల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయ‌న‌గా.. శ్రీకాకుళం అత‌లాకుత‌ల‌మైంది. దీంతో బాబుకు ఇది అందివ‌చ్చిన అవ‌కాశంగా మారింది. రాష్ట్రంలో ఇప్పుడున్న ప‌రిస్థితిలో చంద్ర‌బాబు ఒంట‌రి పోరు సాగిస్తున్నారు. దీంతో తుఫాను ఘ‌ట‌న‌ను త‌న‌కు అనుకూలంగా మార్చుకుని ముందుకు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు ప్ర‌చార యావ‌కు పాకు లాడుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ప్రచారం కోసం పాకులాట…..

వాస్త‌వానికి ఇలాంటి పెనువిపత్తులు, సంక్షోభ సమయాల్లో అభాగ్యులను ఆదుకోవాల్సిన పాలకులు కేవలం ప్రచారం కోసం పాకులాడుతుండడం చర్చనీయాంశంగా మారుతోంది. చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా తిత్లీ దెబ్బకు శ్రీకాకుళం విలవిల్లాడుతుంటే ఈ సమయంలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శిస్తున్న ప్రచారయావ ఏవగింపు కలిగిస్తోందని బాధితులు మండిపడుతున్నారు. సంక్షోభ నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కంటే చంద్రబాబు ఒక్కడే ఉండి అంతా తానే ఉద్ధరిస్తున్నట్టుగా కలరింగ్‌ ఇస్తుండడం, హడావుడి చేస్తుండడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల క్రితం హుద్‌హుద్‌ బారిన పడ్డ విశాఖపట్నంలో మకాం వేసిన చంద్రబాబు అప్పట్లో ఎన్నో హామీలు గుప్పించారు. అయితే, అవి ఇంకా నెర‌వేర‌లేదు. అంతేకాదు, ఆ విల‌యాన్నిప్ర‌త్య‌క్షంగా చూసిన ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. వెయ్యి కోట్లు సాయం ప్ర‌క‌టించారు. వీటిలో కేవ‌లం 600 కోట్లు మాత్రమే అందాయి. మిగిలిన సొమ్మును రాబ‌ట్ట‌డంలో చంద్ర‌బాబు విఫ‌ల‌మ‌య్యారు ఇప్పుడు తక్షణ సాయం కింద 1200 కోట్లు కావాల‌ని అడుగుతున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. మొత్తానికి ఒక బాబు.. రెండు తుఫాన్లు.. కొన్ని రాజ‌కీయాలు! అన్న విధంగా ఉంది ప‌రిస్థితి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*