కత్తి లేకుండానే బాబు యుద్దానికి దిగారా?.. రీజ‌న్ ఏంటి..?

బ‌ల‌మైన వ్యక్తిని ఎదుర్కొనాలంటే.. అంత‌క‌న్నా బ‌ల‌వంతుడై ఉండాల‌నేది ఎవ‌రికైనా తెలిసిన విష‌య‌మే! కానీ, చంద్రబాబు మాత్రం.. ఏడుగురు చాలు.. అంటూ కేంద్రంపై పోరాడేందుకు సిద్ధమ‌వుతున్నారు. పైకి ఇది విన‌డానికే ఒకింత విచిత్రంగానే ఉంది క‌దూ! మ‌రి బాబు ఏ వ్యూహంతో అడుగులు వేస్తున్నారో చూద్దాం. ఏపీకి కేంద్రం అన్యాయం చేసింది. ఏపీకి ఇవ్వాల్సిన హోదా ఇవ్వడం లేదు. రావాల్సిన నిధుల విష‌యంలోనూ కొర్రీలు వెతుకుతోంది. అయితే, గ‌డిచిన నాలుగేళ్లుగా కూడా ప‌రిస్థితి ఇలానే ఉన్నా నోరు విప్పని చంద్రబాబు ఒక్కసారిగా రెండు నెల‌ల కిందట యూట‌ర్న్ తీసుకున్నారు. దీంతో కేంద్రంపై ఆయ‌న పోరు బావుటా ఎగుర వేశారు.

తానే రంగంలోకి దిగి…

ఈ క్రమంలోనే ఆయ‌న త‌న ఎంపీల‌తో కేంద్రంపై పోరుకు స‌న్నాహం చేశారు. కేంద్రంలో మంత్రులుగా ఉన్న త‌న ఎంపీల‌తో రాజీనామా చేయించారు. అంతేకాకుండా కేంద్రంపై అవిశ్వాసం కూడా ప్రక‌టించారు. అయినా కూడా కేంద్రం ఏమీ ప‌ట్టన‌ట్టు వ్యవ‌హ‌రించింది. దీంతో త‌న రూట్‌ను మ‌రింతగా మార్చుకున్నారు చంద్రబాబు. ఏకంగా తానే రంగంలోకి దిగిపోయారు. ఈ క్రమంలోనే గ‌త నెల 20న త‌న పుట్టిన రోజు నాడు.. విజ‌య‌వాడ వేదిక‌గా ఆయ‌న ధ‌ర్మపోరాట దీక్ష కు దిగారు. తిరుప‌తి వేదిక‌గా ధ‌ర్మ పోరాట స‌భ నిర్వహించారు. ఇక‌, ఈ స‌భ‌ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల‌ని కూడా బాబు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడే యూట‌ర్న్ తీసుకున్నారు చంద్రబాబు.

యుద్ధానికి సిద్ధమయినా…..

ఈ ఒక్కదాడితో కేంద్రాన్ని ఇరుకున పెట్టడం త‌న వ‌ల్లకాద‌ని గుర్తించారో ఏమో. ఆయ‌న వెంట‌నే స‌మాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అంటూ కేంద్రంపై యుద్ధానికి సిద్ధమ‌య్యారు. 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార‌సుల‌పై ప‌రిశీల‌నకు కేంద్రం ఇటీవ‌ల 15వ ఆర్థిక సంఘానికి కొన్ని సూచ‌న‌లు చేసింది. వీటిపై ఇంకా 15వ ఆర్థిక సంఘం దృష్టి పెట్టలేదు. ఎలాంటి సిఫార‌సులు చేయ‌లేదు. ముఖ్యంగా 14వ ఆర్థిక సంఘం చెప్పిన 42% ప‌న్నుల్లో వాటా పై కేంద్రం పున‌రాలోచించే అవ‌కాశం లేదు. అయినా కూడా చంద్రబాబు.. కేంద్రంపై యుద్ధానికి ఈ అంశాల‌నే ప్రాతిప‌దిక‌గా చేసుకుని, బీజేపీయేత‌ర రాష్ట్రాల‌ను ఐక్యం చేసేందుకు ప్రయ‌త్నించారు.

అమరావతి సమావేశంలో……

ఈ క్రమంలోనే సోమ‌వారం అమ‌రావ‌తిలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రుల స‌మావేశం ఏర్పాటు చేశారు. వీరు ఓ తీర్మానం చేసి.. కేంద్రంపై ఫిర్యాదులు న‌మోదు చేసి రాష్ట్రప‌తికి ఈ తీర్మానం అంద‌జేయాల‌ని, త‌ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచాల‌ని చంద్రబాబు ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ఆయ‌న 11 రాష్ట్రాల‌కు ఆహ్వానం పంపారు. వీటిలో అత్యంత కీల‌క‌మైన తెలంగాణ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాలు ఒడిసా.. కేర‌ళ కూడా ఉన్నాయి. అయితే, ఈ రాష్ట్రాల నుంచి ఏ ఒక్కరూ రాలేదు. క‌నీసం అధికారుల‌ను కూడా ఈ రాష్ట్రాల వారు పంప‌లేదు. మిగిలిన రాష్ట్రాల నుంచి వ‌చ్చిన వారిలో కూడా ఏడుగురు చ‌ర్చలో పెద్ద భాగ‌స్వామ్యం చూపించ‌లేదు.

గవర్నర్ల ఆమోదం లేకుంటే….

కేవ‌లం ఇక్కడి అమ‌రావ‌తి నిర్మాణం, ఆర్టీజీ ఏర్పాటు వంటి వాటిని ప‌రిశీలించారు. మ‌రి ఈ ఏడు రాష్ట్రాల‌కు చెందిన వారితో చంద్రబాబు సాధించేది ఏమిటి? పైగా ఈ ఏడు రాష్ట్రాల్లో.. రెండు కేంద్ర పాలిత ప్రాంతాలే ఉన్నాయి. ఒక‌టి ఢిల్లీ, రెండు పుదుచ్చేరి. ఈ రెండు రాష్ట్రాలు ఏ తీర్మానాలు చేసినా.. ఆయా రాష్ట్రాల గ‌వ‌ర్నర్ల ఆమోదం లేకుంటే చిత్తుకాగితాల కిందే లెక్క. మ‌రి ఇన్ని తెలిసి కూడా చంద్రబాబు కేంద్రంపై ఇంకా కాలుదువ్వుతాన‌ని బ‌య‌లేద‌ర‌డం అంటే క‌త్తి లేకుండా యుద్ధానికి సిద్ధప‌డుతుండ‌డ‌మే. ఇదే విష‌య‌మై.. తెలంగాణ మంత్రి ఒక‌రు స్పందిస్తూ.. 15వ ఆర్థిక సంఘం ఆయా అంశాల‌పై దృష్టి కూడా పెట్టకుండానే మ‌నం ఎందుకు ఆరాట ప‌డాలి? అని ప్రశ్నించారు. సో.. చంద్రబాబు చేస్తున్న ప్రయ‌త్నాల్లో డొల్లత‌నం మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింద‌నే విమ‌ర్శలు మాత్రం ఊపందుకు న్నాయి.