‘‘చేయి’’ కలిపితే ఎన్ని ప్లాబ్లమ్స్…?

కాంగ్రెస్ తో పొత్తును టీడీపీ సీనియర్లు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? పొత్తులేకుండా ఒంటరిగా వెళ్లాలని చంద్రబాబుకు ఎందుకు బహిరంగంగా సూచనలు చేస్తున్నారు. పార్టీ సమావేశాల్లో గుట్టుగా చేసుకోవాల్సిన పొత్తుల అంశం రగడగా మారిందెందుకు? ఇటీవల కాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్నారన్న సంకేతాలు అందుతున్నాయి. కేవలం పార్టీనేతలకే కాదు ప్రజలకూ ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది. రాహుల్ పై ప్రశంసలు చేసినా, కాంగ్రెస్ పార్టీ పాపాన్ని ప్రజలు మర్చి పోయారన్న ప్రచారానికి దిగినా అది చంద్రబాబు పొత్తుకోసమేనన్న సంగతి అందరికీ తెలసిందే.

రాహుల్ ఓకే చెప్పారని…..

వచ్చే ఎన్నికలలో ఏపీ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంతో కలసి నడవాలని నిర్ణయించుకన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంలో వాస్తవమూ లేకపోలేదు. నిప్పు లేకుండా పొగరాదు కాబట్టి ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పెద్దలు రెండు తెలుగురాష్ట్రాల్లో బలమైన తెలుగుదేశం పార్టీ తో పొత్తుతో వెళ్లాలని నిర్ణయించినట్లు వార్తలు అందుతున్నాయి. ఏఐసీసీ రాహుల్ సమక్షంలోనే దీనిపై చర్చ జరిగినట్లు, రాహుల్ సయితం ‘‘గో ఎహెడ్’’ అని చెప్పినట్లు హస్తిన వర్గాలు వెల్లడిస్తున్నాయి. చంద్రబాబు కూడా గత కొద్దిరోజులుగా పార్టీ క్యాడర్ ను అందుకు మానసికంగా సిద్ధం చేస్తున్నారు.

సీనియర్లు వ్యతిరేకం……

అయితే కాంగ్రెస్ తో పొత్తును కొందరు సీనియర్లు వ్యతిరేకిస్తున్నారు. ఇందుకు కారణాలు కూడా లేకపోలేదు. పొత్తు ఉంటే కాంగ్రెస్ కు కొన్ని స్థానాలను కేటాయించాల్సి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా పార్లమెంటు స్థానాలను అధికంగా కోరే అవకాశమూ లేకపోలేదు. ముఖ్యంగా కర్నూలు జిల్లాను తీసుకుంటే అక్కడ పార్లమెంటు స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారు. ప్రస్తుతం వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన బుట్టారేణుక పరిస్థితి ఏంటన్నది అర్థంకాని అంశం. రేణుక అప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీ టిక్కెట్ ఆశిస్తారు. అలాగే కోట్ల ఎఫెక్ట్ తో కొన్ని శాసనసభ నియోజకవర్గాలపై ప్రభావం చూపించవచ్చు. కేఈ వ్యతిరేకించే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడం సరికాదన్నది కేఈ కృష్ణమూర్తి బహిరంగంగానే చెబుతున్నారు.

కొన్ని నియోజకవర్గాల్లో…..

అలాగే అమలాపురం, రాజంపేట, శ్రీకాకుళం, రాజమండ్రి, విశాఖపట్నం వంటి స్థానాలను కూడా కాంగ్రెస్ పొత్తులో భాగంగా కోరే అవకాశముందంటున్నారు. అలా పార్లమెంటు సీట్లతో పాటు వారికి పట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా ఆశించవచ్చు. ఇప్పటికే సైకిల్ పార్టీ ఓవర్ లోడ్ అయింది. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆశించిన చంద్రబాబు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి చేర్చుకున్నారు. ఇతర పార్టీలకుచెందిన కొందరు సీనియర్లకు కూడా కండువా కప్పేశారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడమేంటని సీనియర్లు, కేఈ, అయ్యన్నలు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు కూడా కేవలం నాడి తెలుసుకునేందుకే ఫిల్లర్ వదిలారని, సీట్ల సమస్య తలెత్తుతుందన్న విషయం ఆయనకు తెలియంది కాదని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో పొత్తు అంశం పెద్ద కల్లోలమే సృష్టించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*