ఇద్దరూ టార్గెట్ గా బీజేపీ పెట్టిన టీం ఇదేనా…?

నాలుగేళ్ల‌లో ఎంత మార్పు అంద‌రిలోనూ ఇదే ప్ర‌శ్న‌! మోడీ కంటే మొన‌గాడు ఎవ‌రూ లేరు అన్న చంద్ర‌ుళ్లే.. ఇప్పుడు మోడీ అయితే ఏంటి ? అంటూ తిరుగుబాటు చేస్తున్నారు. దేశాన్ని మోడీ కంటే స‌మ‌ర్థంగా ఎవ‌రూ న‌డ‌ప‌లేర‌ని ఆకాశానికి ఎత్తేసిన వారే ఇప్పుడు.. ఆయ‌న్ను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. మోడీపై క‌య్యానికి కాలు దువ్వుతున్నారు. ఒక‌రు థ‌ర్డ్ ఫ్రంట్ అంటూ మోడీ వ్య‌తిరేక శ‌క్తుల‌ను కూడ‌గ‌ట్టే ప‌నిలో ఉంటే.. మ‌రొక‌రు కూడా ఇందుకు ప‌రోక్షంగా మ‌ద్దతు తెలుపుతు న్నారు. మ‌రి ఇద్ద‌రు చంద్రుళ్లు ఎప్పుడు దొరుకుతారా అని బీజేపీ పెద్ద‌లు స‌మ‌యం కోసం ఎదురు చూస్తున్నారు. ఎలాగైనా వీరికి చెక్ చెప్ప‌డానికి తెర‌వెనుక వ్యూహానికి తెర‌తీశారు.

ప్రత్యేక టీం రెడీ…..

ఇందుకోసం ప్ర‌త్యేక‌మైన టీమ్‌ను కూడా రెడీ చేశార‌ని తెలుస్తోంది. ఈ టీమ్ స‌భ్యులు అప్పుడే రంగంలోకి దిగిపోయార‌ని తెలుస్తోంది. బీజేపీ విధానాల‌తోపాటు ఇద్ద‌రు చంద్రుళ్ల అవినీతిని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్ల‌డ‌మే ఈ టీమ్ ఏకైక ల‌క్ష్య‌మ‌ట‌.సంఘ్ ప‌రివార్‌.. బీజేపీ అనుబంధ సంస్థ‌! తెలుగు రాష్ట్రాల సీఎంల‌ను టార్గెట్ చేసేందుకు కేంద్రం రంగంలోకి దించిన టీమ్ ఇదే! రెండు రాష్ట్రాల్లో రాజ‌కీయాలు హీటెక్కాయి. ముఖ్యంగా బీజేపీ వ్య‌తిరేక కూట‌మికి శ‌ర‌వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. ఇటు చంద్ర‌బాబు, అటు కేసీఆర్‌.. కేంద్రాన్ని టార్గెట్ చేసుకుని ముందుకు వెళుతున్నారు. ఇద్ద‌రు తెలుగు రాష్ట్రాల నాయకులే ఈ థ‌ర్డ్ ఫ్రంట్‌ను ముందుండి నడిపించేందుకు పావులు క‌దుపుతున్నారు.

ఇద్దరికీ చెక్ పెట్టాలని….

ఈ నేప‌థ్యంలో వీరికి ఎలాగైనా చెక్ చెప్పాల‌ని కేంద్రం వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లోని 42 లోక్‌సభ స్థానాల్లో.. ఎక్కువ స్థానాలను గెలుచుకోవాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ రెండు రాష్ట్రాల్లో బీజేపీ మాతృసంస్థ `సంఘ్ పరివార్`ను ఇప్పటికే మోహరించింది. పూర్తిస్థాయిలో తమ అనుబంధ విభాగాల శ్రేణులను రంగంలోకి దించి, విస్తృతంగా అంతర్గత ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ ప్రత్యక్ష ప్రచార దాడికి దిగింది. రెండు రాష్ట్రాల్లో లక్షల మంది కార్యకర్తలను రంగంలోకి దించింది. ఇటీవల వరకూ కర్ణాటక ఎన్నికల్లో మునిగిపోయిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ సహా ఆ పార్టీ ముఖ్యనేతలు రంగంలోకి దిగారు.

హిందువుల్లో ఆలోచనను….

పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాపై తిరుపతిలో జరిగిన రాళ్ల దాడిపై తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. దీనికి తోడు టీటీడీలో నెలకొన్న వివాదంపై తీవ్రస్థాయిలో ప్రచారం చేపట్టింది. అన్యమత స్థులకు టీటీడీలో పదవులు ఇవ్వడాన్ని తప్పుపడుతూ హిందూ శ్రేణుల్లో ఆలోచనలు రేకెత్తిస్తోంది. గుప్త నిధుల కోసమే కొండపై తవ్వకాలు చేపట్టారని, పురాతన నగల సంగతేమీటని నిలదీస్తూ చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చంద్రబాబు కారణంగా హిందూ మతానికే ప్రమాదమేర్పడిందన్న ప్రచారంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.

తెలంగాణలోనూ…..

మరోవైపు తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. కేసీఆర్‌ను ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. హైదరాబాద్‌ను అభివృద్ధి చేయలేనోడు.. రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేస్తాడంటూ విమర్శలు గుప్పించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్ చేసిన హంగామాను అపహాస్యం చేశారు. ఫ్రంట్, టెంట్ అంటూ మమతా బెనర్జీ, దేవేగౌడను కలిసిన విషయాన్ని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకూ పక్క రాష్ట్రాల్లో బీజేపీ చేసిన ప్రచార ప్రయోగం గురించి వినడమే కానీ, చూడలేదు. ఇప్పుడు ఆ పార్టీ ప్రచార ప్రయోగం, నేతల దూకుడు తెలుగు రాష్ట్రాల్లో మొదలైంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*