లెక్కలన్నీ బాబు వద్దే…!!

‘ఆలస్యం అమృతం విషం.’ అన్నది నానుడి. ప్రతిపక్ష రాజకీయాలలో ఇది రివర్స్ గేర్ లో నడుస్తోంది. అధికార టీఆర్ఎస్ , మహాకూటమి పరస్పర భిన్నమైన ధోరణులు కనబరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితి ముందుగా తన అభ్యర్థులను ప్రకటించింది. ప్రజల్లో విస్తృత ప్రచారం చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు మహాకూటమి సీట్ల సంఖ్య, నియోజకవర్గాల కేటాయింపు వంటి అంశాలపై మల్లగుల్లాలు పడుతోంది. అయితే నాలుగు రోజుల క్రితమే ఇందుకు సంబంధించి కసరత్తు పూర్తయిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. చంద్రబాబు ఢిల్లీ పర్యటనతో మొత్తం కొలిక్కి వచ్చిందని కాంగ్రెసు, టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయినా ఉత్కంఠభరితమైన నాటకీయ సన్నివేశాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం అధికార టీఆర్ఎస్ కు అంతుచిక్కని వ్యూహాన్ని అమలు చేయాలనే ఎత్తుగడ. కూటమి పార్టీల్లో అసంత్రుప్తులు, తిరుగుబాట్లను సాధ్యమైనంతవరకూ నిరోధించాలనే పథకం దాగి ఉన్నాయంటున్నారు.

కట్టడి చేసేందుకే….

కూటమి జాబితా బయటికి వస్తే చాలు ఆగమాగం చేయాలని టీఆర్ఎస్ కాచుకుని చూస్తోంది. అధినేత కేసీఆర్ ఇంతవరకూ తన ప్రచార కార్యక్రమాన్ని ప్రకటించలేదు. కాంగ్రెసు, టీడీపీ,టీజేఎస్, సీపీఐ లు సీట్లు పంచుకున్న తర్వాత రంగంలోకి దిగాలని ఆయన భావిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఆయా క్యాండిడేట్లను , పార్టీలను టార్గెట్ చేస్తూ విరుచుకుపడాలనే లక్ష్యంతో కేసీఆర్ ఎదురుచూస్తున్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం, టీజేఎస్,సీపీఐ ల అభ్యర్థులు బరిలో దిగే చోట్ల విడిగా ప్రచార పంథాను అనుసరించాలని కేసీఆర్ ఇప్పటికే పార్టీ శ్రేణులకు సూచనలు చేశారు. టీడీపీ ని టార్గెట్ చేసేందుకు ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాలు ఖరారైతే అక్కడ ఆధిక్యం సాధించడానికి అనుసరించాల్సిన ప్రణాళికను సిద్దం చేసుకున్న తర్వాతనే కేసీఆర్ ప్రచారం నిర్వహిస్తారు. ఆయా నియోజకవర్గాల్లో మూడు దశలుగా ప్రచారం చేయాలనుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థుల ఇంటింటి ప్రచారం, కేటీఆర్ సారథ్యంలో మినీ సభలు, కేసీఆర్ మహాసభలుగా మూడు రూపాల్లో టీఆర్ ఎస్ ప్రచార ప్రణాళిక తయారు చేస్తోంది. ఇది ముందుగానే లీక్ అయిపోయింది. దీంతో సాధ్యమైనంతవరకూ అధికారపార్టీకి చిక్కకుండా జాగ్రత్త వహించే దిశలో ప్రతివ్యూహరచనలో పడ్డారు మహాకూటమి నేతలు.

బాబు వ్యూహమేనా..?

ఎన్నికల వ్యూహరచనలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు. తెలంగాణలో టీఆర్ఎస్ ను డీ కొట్టడం ఆషామాషీ కాదని అతనికి తెలుసు. ఇప్పుడు కూటమిలో ఉన్న నాయకులందరి కంటే కేసీఆర్ వ్యూహాలను చక్కగా పసిగట్టగల సామర్థ్యం చంద్రబాబుకు ఉంది. చాలా వాస్తవికమైన దృష్టితో సీట్ల సంఖ్యను టీడీపీ పరిమితం చేసుకుంది. తమ అభ్యర్థులు బరిలో నిలిచే స్థానాల్లో గెలుపు వ్యూహాలకు చంద్రబాబు పక్కగా ప్లాన్ గీస్తున్నారు. దాంతోపాటు కాంగ్రెసును, కూటమిని గెలిపించాల్సిన బాధ్యత కూడా ఆయనపై పడింది. సీనియర్ రాజకీయవేత్తగానే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. రాహుల్ తో భేటీలో ఈ విషయంపై మంతనాలు చేసినట్లు సమాచారం. ముందుగా అభ్యర్థుల జాబితాలు , కూటమిలో వివిధ పార్టీల సంఖ్య బయటికి వచ్చేస్తే టీఆర్ఎస్ అప్రమత్తం అయిపోతుందని చంద్రబాబు భావిస్తున్నారు. చాలావరకూ సాగదీసి ..చివరిక్షణాల్లో విడుదల చేయాలని యోచిస్తున్నారు. దీనివల్ల ప్రతివ్యూహంతో టీఆర్ఎస్ ప్రచారం చేసేందుకు తగినంత వ్యవధి ఉండదు. అదే సమయంలో తిరుగుబాటు దారులకు ఏమీ తోచని పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆయా పార్టీలకు ఉన్న బలాబలాల దృష్ట్యా టీఆర్ఎస్ ను దీటుగానే ఎదుర్కోవచ్చనుకుంటున్నారు. క్యాండిడేట్ల ప్రకటన గందరగోళానికి దారి తీయకుండా చూసుకోవాలని చంద్రబాబు కాంగ్రెసు నాయకులకు సూచిస్తున్నారు.

పొత్తు..సరే ..సొత్తు?..

ఒకటి రెండు సీట్లు అటుఇటుగా పొత్తు ఖరారు అయిపోయినట్లే. పంతాలు, పట్టింపులకు పోతే అసలుకే మోసం వస్తుందని కూటమిలోని అన్నిపార్టీలకూ తెలుసు. టీఆర్ఎస్ ఇప్పటికే కూటమిలోని పార్టీలపై కావాల్సినంత బురద చల్లేసింది. ఒంటరిగా బరిలో నిలిచే సాహసం కూటమిలోని పార్టీలు చేయలేవు. కచ్చితంగా కలిసి వెళ్లాల్సిందే. అయితే ప్రచారం ఏవిధంగా ఉండాలి? అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు చేయాలి? ఒకేసారి జాబితా మొత్తాన్ని ప్రకటించాలా? ఏయే నియోజకవర్గాల్లో ఉమ్మడి బహిరంగ సభలు నిర్వహించాలి? వంటి విషయాలపై కసరత్తు చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు. మరోవైపు ఎన్నికల ఖర్చుకు నిధులు ఎలా సమకూర్చుకోవాలనే సమస్య కూటమి పార్టీలను వెన్నాడుతోంది. తెలుగుదేశం పార్టీ సభ్యులకు నిధులను అధినాయకత్వం సమకూరుస్తుంది. పధ్నాలుగు సీట్లకు గాను పదిమంది వరకూ సొంతంగానే నిధులు ఖర్చు చేయగల ఆర్థిక సామర్ధ్యం ఉన్న క్యాండిడేట్లను టీడీపీ ఎంపిక చేస్తున్నట్లు సమాచారం. పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించి ప్రజలలో పేరు ప్రఖ్యాతులున్న మరికొందరు అభ్యర్థులకు నిధుల కొరత లేకుండా చూసే బాధ్యతను చంద్రబాబు తీసుకుంటున్నారు. కాంగ్రెసు పార్టీ అభ్యర్థులకూ నిధుల కొరత పెద్దగా ఉండబోదు. అయితే టీజేఎస్, సీపీఐ ల విషయంలో నిధులు సమకూర్చాల్సిన బాధ్యతను కాంగ్రెసు, టీడీపీ తీసుకోవాలనే డిమాండ్లు వినవస్తున్నాయి. తాము సీట్ల సంఖ్య విషయంలో రాజీపడ్డాం కాబట్టి నిధులను పెద్ద పార్టీలు సమకూర్చాలని ఆయా పార్టీల నాయకులు కోరుతున్నారు. ఇది మరొకసారి చర్చకు దారితీసే అవకాశం ఉంది.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*