నంద్యాల ఫార్ములాను మళ్లీ తెచ్చారా?

వచ్చే ఎన్నికల్లోనూ నంద్యాల లాంటి గెలుపు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. నంద్యాల ఉప ఎన్నికలు జరిగిన తర్వాత కూడా నంద్యాల తరహాలోనే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే వ్యూహాన్ని రచించారు. రెండింటా సక్సెస్ కావడంతో చంద్రబాబు అప్పట్లో నంద్యాల ఫార్ములా వర్క్ అవుట్ అయిందని చెప్పారు. నంద్యాల ఫార్ములాను వచ్చే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో అమలు చేయాలని, ఇందుకు కమిటీని నియమిస్తున్నట్లు కూడా ఆయన ప్రకటించారు. ఈ కమిటీలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, కాల్వ శ్రీనివాసులు వంటి వారున్నారు. నంద్యాలలో ఏ తరహా అయితే ప్రచారం చేశామో, ఏ విధానాలను అనుసరించామో నివేదిక రూపంలో అందజేయాలని కోరారు.

సాధ్యం కాదంటున్నా…..

అయితే నంద్యాల ఫార్ములపై ఈ కమిటీ నివేదిక అప్పుడే ఇచ్చింది. కానీ సాధారణ ఎన్నికల్లో నంద్యాల ఫార్ములా పని చేయదన్నది ఎక్కువమంది టీడీపీ నేతల అభిప్రాయం. నంద్యాల తరహాలోనే ఎన్నికలకు వెళ్లాలంటే భారీగా ఖర్చుతో పాటు నేతలందరూ ఒకే చోట మొహరించాల్సి ఉంటుందని, అది సాధ్యం కాదని కొందరు అంటున్నారు. అయితే ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను, ముఖ్య నేతలను చంద్రబాబు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎన్నికల సమయంలో బాధ్యులను చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

కొన్ని స్థానాల్లోనే…..

ప్రధానంగా టీడీపీకి పట్టున్న స్థానాల్లో కాకుండా, వైసీపీకి బలం ఉండి, తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ ఉందని భావించిన నియోజకవర్గాల్లోనే నంద్యాల ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించారట. ఇటువంటివి దాదాపు యాభై నుంచి 60కి పైగా నియోజకవర్గాలు ఉన్నట్లు గుర్తించారు. తెలంగాణలో ఎన్నికలు ముందు జరిగితే ఆ రాష్ట్రానికి చెందిన నేతలకు కూడా ఇక్కడ కొన్ని కీలక బాధ్యతలన అప్పగించాలన్నది చంద్రబాబు యోచనగా ఉంది. అంతేకాకుండా రాజ్యసభ సభ్యులు, మండలి సభ్యులను ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పర్యటించి అవగాహన పెంచుకోవాలని త్వరలోనే పురమాయించనున్నట్లు సమాచారం.

నంద్యాల ఫార్ములా అంటే….

ఇంతకీ నంద్యాల ఫార్ములా ఏంటంటే…. ప్రతి వార్డుకు ఒక నేతను కేటాయిస్తారు. ఆ నేత కనుసన్నల్లోనే వార్డులో ప్రచారం గాని, ఓటర్లను ఆకట్టుకోవడంగాని, ఓటర్లను పోలింగ్ బూత్ ల వరకూ తీసుకెళ్లడం గాని జరుగుతుంది. ఆ వార్డు నేత కింద కొందరు ద్వితీయ శ్రేణి నేతలను నియమిస్తారు. వారే విపక్ష పార్టీల మీద నిఘా ఉంచి డబ్బు పంపిణీ వంటివి జరగకుండా నిరోధిస్తారు. ఆ నియోజకవర్గ సమస్యలను ముందుగానే గుర్తించి వాటిని పరిష్కారం చేయడమో, లేక హామీ ఇవ్వడమో చేస్తారు. నంద్యాల ఉప ఎన్నికల్లో అలా చేయబట్టే భారీ మెజారిటీతో విజయం సాధించామని బాబు గట్టిగా నమ్ముతున్నారు. దీంతో మరోసారి నంద్యాల ఫార్ములా తెరపైకి వచ్చింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*