మోడీని దోషిగా నిలబెట్టేందుకు….!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానితో జరిగే సమావేశంలో…ముఖ్యమంత్రుల సమక్షంలో కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 17వ తేదీన నీతి ఆయోగ్ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి ప్రధానితో పాటు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఈ సమావేశాన్ని తనకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం కసరత్తులు ప్రారంభించారు.

జాతీయ స్థాయిలో విన్పించేందుకు…..

విభజన ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో నిలదీసేందుకు ఈ సమావేశాన్ని చక్కగా వినయోగించుకోవాలన్నది చంద్రబాబు ఉద్దేశం. ఇప్పటి వరకూ రాష్ట్రంలో వివిధ సభల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని నిలదీస్తున్న చంద్రబాబు నాయుడు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలోనే మోడీ తీరును ఎండగట్టాలని నిశ్చయించారు. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

బీజేపీ చెబుతున్న మాటలకు….

భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన విభజన హామీల్లో 80 శాతం పూర్తి చేశామని చెబుతోంది. ప్రధాన అంశాలు కొన్ని మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, వీటిని త్వరలోనే పరిష్కరిస్తామని చెబుతోంది. కాని చంద్రబాబు మాత్రం ఏపీకి అరకొర సాయం మాత్రమే అందిందని చెబుతూ వస్తున్నారు. రాష్ట్రానికి సర్దాల్సిన రెవెన్యూ లోటు విషయంలోనూ కేంద్రం పిల్లిమొగ్గలు వేస్తుందని, పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేదని, రాజధాని నిర్మాణం కోసం 1500 కోట్లు మాత్రమే ఇచ్చి రెండు వేల కోట్లు ఇచ్చామని ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తున్నారు.

ఇతర సీఎంల ఎదుట…..

దీంతో పాటు రాష్ట్రాల నుంచి వసూలు చేస్తున్న పన్నుల ఆదాయాన్ని నీతి ఆయోగ్ ద్వారా పంచాలని, 1971 జనాభా లెక్కల ప్రకారం తీసుకోకుంటే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని కూడా బాబు వివరించనున్నారు. ఇప్పటివరకూ దక్షిణాది రాష్ట్రాల సమావేశాలు రెండు సార్లు జరిగాయి. వాటి వివరాలను కూడా సిద్ధం చేసి ఉంచాలని చంద్రబాబు ఆదేశించారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాక తొలిసారి ప్రధాని మోడీతో భేటీ అవుతున్న చంద్రబాబు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎదుట మోడీని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*