ఆ పార్టీతో చంద్ర‌బాబు పొత్తు ఫిక్సేనా..!

టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, టీఆర్ఎస్ అధినేత‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌లు వ‌చ్చే అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో క‌లిసిన‌డుస్తారా..? ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం చంద్ర‌బాబును కూడా సంప్ర‌దిస్తాన‌నీ కేసీఆర్ చెప్ప‌డంలో.. రాబోయే రోజుల్లో కేసీఆర్‌, మ‌మ‌తా, న‌వీన్‌ప‌ట్నాయ‌క్ ఎవ‌రితోనైనా క‌లిసి ప‌నిచేస్తామ‌ని చంద్ర‌బాబు అన‌డంలో ఆంత‌ర్య‌మేమిటి..? ఇప్పుడు ఈ ప్ర‌శ్న‌లు అటు అన్ని పార్టీల నేత‌ల‌తోపాటు రాజ‌కీయ విశ్లేష‌కుల మెద‌ళ్ల‌ను తొలుస్తున్నాయి. ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిక‌రంగా మారుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇద్ద‌రు చంద్రులు చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీయేత‌ర కూట‌మిలో కీల‌క భాగ‌స్వాములుగా ఉంటారా..? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

కాంగ్రెస్ పార్టీయే కీలకం…..

ప్ర‌స్తుతం బీజేపీయేత‌ర కూట‌మిలో కాంగ్రెస్ పార్టీ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. తెలంగాణ‌లో మాత్రం టీఆర్ఎస్‌కు ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్ నుంచే ఎదురుకానుంది. ఈ నేప‌థ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వ‌హించే కూట‌మిలో కేసీఆర్ క‌లుస్తారా..? అంటే డౌటేన‌ని ప‌లువురు నాయకులు అంటున్నారు. ఇప్ప‌టికే జాతీయ పార్టీలు అయిన బీజేపీ, కాంగ్రెస్‌ల‌కు ప్ర‌త్యామ్నాయంగా ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు కార్యాచ‌ర‌ణ మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. అయితే కేసీఆర్ కోరుకున్న‌ట్లు.. కాంగ్రెస్ పార్టీ లేని కూట‌మి ఏర్పాటుకు తృణ‌మూల్ కాంగ్రెస్ అధినేత్రి, ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీ సుముఖంగా లేర‌ని తాజా ప‌రిణామాలు చెబుతున్నాయి.

చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో…..

ఇప్ప‌టికే క‌ర్ణాట‌క‌లో కాంగ్రెస్‌-జేడీఎస్ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు చేసింది. వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ జేడీఎస్‌-కాంగ్రెస్ పార్టీలు క‌లిసి పోటీ చేస్తాయ‌ని కాంగ్రెస్ క‌ర్ణాట‌క వ్య‌వ‌హారాల‌ ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ తాజాగా ప్ర‌క‌టించారు. అయితే జాతీయ రాజ‌కీయాల్లో మంచి అనుభ‌వం ఉన్న టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో మోడీపై విరుచుకుప‌డుతున్నారు. వెల‌గ‌పూడి స‌చివాల‌యంలో శుక్ర‌వారం రాత్రి ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్రాంతీయ పార్టీల‌కే ఎక్కువ‌సీట్లు వ‌స్తాయ‌ని ఆయ‌న అన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు విలేక‌రులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు బాబుగారు ఇచ్చిన స‌మాధానాలు జాతీయ‌స్థాయిలో రాజకీయ ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

పోటీదారుని కానంటూ……

జాతీయ రాజకీయాల్లో ఎవరికీ పోటీదారును కాన‌నీ, రాబోయే రోజుల్లో కేసీఆర్‌, మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయ్‌క్‌ ఎవరితోనైనా కలిసి పనిచేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. అంతేగాకుండా.. ప్రాంతీయ పార్టీల కూటమి విషయంలో ఎప్పుడు ఏం చేయాలో త‌న‌కు బాగా తెలుసున‌ని కూడా చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ప్రాంతీయ పార్టీల కూటమి ఎన్నికలకు ముందా? తర్వాత ఎలా కార్యారూపం దాల్చుతుందో మీరే చూస్తారంటూ చంద్ర‌బాబు న‌ర్మ‌గ‌ర్భంగా చెప్పారు. ఇక్క‌డ చంద్ర‌బాబు మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన కామెంట్ చేశారు. కాంగ్రెస్‌ అన్యాయం చేస్తే… బీజేపీ ఈ రాష్ట్రానికి అంతకంటే ఎక్కువే చేసిందంటూ స్పందించారు. ఇక‌ ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేస్తామని కాంగ్రెస్‌ ముందుకొస్తే ఏం చేస్తారని విలేక‌రులు అడిగిన ప్ర‌శ్నల‌కు మీకెందుకు అంత తొందరంటూ దాట‌వేశారు. ఇదిలా ఉండ‌గా… ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇచ్చేది కాంగ్రెస్ పార్టీయేన‌ని ఆ పార్టీ నేత రఘువీరారెడ్డి ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*