నారా వారి నయా స్కెచ్ తో …!

ఆంధ్రప్రదేశ్ రాజకీయరంగంలో ఎన్నికల హోరు, జోరు ఇప్పటికే పతాకస్థాయికి చేరింది. ఈ వేడిని కొనసాగిస్తూ 2019 ఎన్నికల్లో అధికార కుంభస్థలాన్ని కొట్టాల్సిందేనన్నట్లుగా ప్రచార హంగామాలో మునిగిపోతున్నాయి ప్రధాన పార్టీలు. టీడీపీ, వైసీపీ, జనసేన ఈ మూడు పార్టీలు ఎన్నికల వరకూ ప్రజాక్షేత్రంలోనే ఉండాలని నిర్ణయించుకున్నాయి. ఆయా పార్టీల అధినేతలు ఏదో రూపంలో ఇకపై పర్యటనలు, పాదయాత్రలు, సభలు, ర్యాలీల్లో నిమగ్నమై ఉండబోతున్నారు. ఇందులో టీడీపీ మిగిలిన రెండు పార్టీలకు భిన్నంగా స్కెచ్ వేస్తోంది. రాజకీయ పోరాటానికి న్యాయ, ప్రజా పోరాటాలను జోడించాలని చంద్రబాబు వ్యూహరచన చేశారు. రాజకీయ విమర్శలు పలచబారిపోతున్నాయి. ప్రజల్లో పెద్దగా చర్చకు రావడం లేదు. అభివృద్ధి కార్యక్రమాలపై ఎంత చెబుతున్నా ఊకదంపుడు ఉపన్యాసంగానే ఉంటోంది. జగన్, పవన్ ల ఉపన్యాసాలే ప్రజలను ఆకట్టుకుంటున్నట్లు అంతర్గత బృందాల ద్వారా టీడీపీ పసిగట్టింది. దీనికి విరుగుడుగా ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్దం చేస్తోంది.

నడిబొడ్డున న్యాయపోరు…

ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో ఇప్పటికే విలన్ ముద్ర వేయించుకున్న బీజేపీ తప్పులమీద తప్పులు చేస్తోంది. కేంద్రప్రభుత్వానికి, బీజేపీకి మధ్య సమన్వయం లోపించింది. యథాలాపంగా టీడీపీ రాజకీయపోరాటానికి అవసరమైన అస్త్రాలను కేంద్రం అందిస్తోంది. ఇటీవల సుప్రీం కోర్టులో ఏపీ కి పునర్విభజన చట్టం ప్రకారం అన్నీ చేసేశామంటూ కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిని రాజకీయాస్త్రంగా మలచుకోవడానికి రాష్ట్రప్రభుత్వం సమాయత్తమవుతోంది. ప్రధానంగా ఆర్థికశాఖ, హోం శాఖ దాఖలు చేసిన అఫిడవిట్లను తప్పుల తడకగా రాష్ట్రప్రభుత్వ వర్గాలు గుర్తించాయి. రెవిన్యూ లోటు భర్తీ విషయంలో చోటు చేసుకున్న అంతరాలపై కౌంటర్ అఫిడవిట్ ఇవ్వబోతోంది. అదే సమయంలో హోంశాఖ విభజన సమస్యలను పరిష్కరించకపోవడం, రాష్ట్రానికి రావాల్సిన సంస్థలు, ఆస్తుల విషయంలో స్పష్టత లేకపోవడం వంటి ప్రధాన అంశాలను న్యాయస్థానం దృష్టిలో పెట్టాలని యోచిస్తున్నారు. సుప్రీం కోర్టులో వ్యాజ్యం పేరిట ఆయా అంశాలను ప్రజల దృష్టిలో సజీవంగా ఉంచాలనేది టీడీపీ ఎత్తుగడ. న్యాయపోరును రాష్ట్ర నడిబొడ్డుకు తేవాలని కేబినెట్ సమావేశంలో చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం.

ప్రజాభాగస్వామ్య బావుటా…

తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆందోళనల్లో ప్రజాప్రతినిధులు బాగానే పాల్గొంటున్నారు. ఉక్కు దీక్ష, రైల్వే జోన్ దీక్షల్లో ఎంపీలు చురుకైన పాత్ర పోషించారు. ఇక ఎంపీల పోరాటాన్ని ఢిల్లీ కేంద్రంగా మార్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈనెల 18 నుంచి సాగనున్న పార్లమెంటు సమావేశాలకు ముందునుంచీ హస్తినలో ఆంధ్రా ఎంపీలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టబోతున్నారు. పార్లమెంటును స్తంభింపచేసేందుకు ఇతర పక్షాల మద్దతు కూడగట్టే యత్నాలు చేపడుతున్నారు. పార్లమెంటు సమావేశాల కాలంలోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించబోతున్నారు. కేంద్రప్రభుత్వ ధోరణిని అనుసరించి ప్రజల కోణంలో అసెంబ్లీలో ప్రతిస్పందించడం ద్వారా ఎండగట్టాలని యోచిస్తున్నారు. ఆగస్టు పదిహేను తర్వాత నియోజకవర్గాల వారీ ప్రజాభాగస్వామ్యంతో ఎమ్మెల్యేలు పోరాటాలు చేయాలని టీడీపీ అగ్రనాయకత్వం నిర్దేశించింది. ఇందులో ప్రజలు ఎక్కువగా పాల్గొనేలా చూడాలనేది ప్రధాన సూచన. రాష్ట్రానికి జరిగిన అన్యాయం, విపక్షాలైన వైసీపీ, జనసేన బీజేపీతో కుమ్మక్కు కావడం ముఖ్య ప్రచారాంశంగా ఈ నియోజకవర్గ పోరాటాలు ఉండబోతున్నాయనేది టీడీపీ వర్గాల సమాచారం.

రాజకీయం రణం యథాతధం…

న్యాయపోరాటం, ప్రజల్లో ఉద్యమ పోరాటం కొనసాగిస్తూనే ప్రధాన పోటీదారులుగా ఉన్న వైసీపీ, జనసేనలతో రాజకీయ పోరాటాన్ని ఉధృతం చేయాలని టీడీపీ భావిస్తోంది. ముఖ్యంగా ఎన్నికల సీజన్ రానుండటంతో ఎక్కడా వెనకబడకూడదని క్యాడర్ కు చంద్రబాబు నాయుడు స్పష్టంగానే ఆదేశాలిచ్చారు. జిల్లా నాయకత్వాలకు కొన్ని బాధ్యతలను అప్పగించారు. వైసీపీ, జనసేనల వైపు కొందరు ద్వితీయశ్రేణి నాయకులు తొంగి చూస్తున్నట్లుగా సమాచారం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఇప్పటికే టిక్కెట్లు ఆశిస్తున్న నాయకుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. తమకు టిక్కెట్ దక్కదని భావించిన వారిలో కొందరు పార్టీ మారి ఎమ్మెల్యే కావాలనే ఆసక్తితో ఉన్నారు. అంగబలం, అర్థబలం ఉన్నవారు జంప్ అయితే టీడీపీకి ఇబ్బందులు తప్పవు. అందువల్ల నియోజకవర్గాల వారీ ద్వితీయశ్రేణి నాయకుల్లో అనుచరగణం బలంగా ఉన్నవారిని ఐడెంటిఫై చేస్తున్నారు. వారు పార్టీ మారకుండా బుజ్జగించేందుకు, ఇతర పదవుల్లో సర్దుబాటు చేసేందుకు హామీలు ఇచ్చే విషయాన్ని అధిష్టానం జిల్లా నాయకులు, మంత్రులకు అప్పగించింది. భారీగా ఇతర పార్టీలకు వలసలు పెరిగితే ఆ ప్రభావం ఎన్నికలపై పడుతుంది. అందువల్లనే ముందుజాగ్రత్త చర్యలకు శ్రీకారం చుడుతున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*