వరప్రసాదిని…ఓటుకు నోటు

రాజకీయాల్లో టైమింగ్ చాలా ముఖ్యం. ఆ టైమింగ్ కలిసి రాబట్టే చంద్రబాబు నాయుడు , కేసీఆర్ ముఖ్యమంత్రులై కూర్చున్నారు. తాజాగా ఏటికి ఎదురీదుతున్న చంద్రబాబు నాయుడిపై కేసీఆర్ రూపంలో మరోసారి నెత్తిన పాలు పోసే ప్రయత్నాలు సాగుతున్నాయనే సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రతికూలాంశాలను సానుకూలం చేసుకునే వ్యూహరచనలో బాబు నైపుణ్యమే వేరు. సంక్షోభం నుంచి సానుకూలత సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఓటుకు నోటు కేసు డొంకను మరోసారి కదల్చబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై సమీక్ష జరపడమే ఇందుకు ప్రాతిపదిక. దీనిని టీడీపీకి అనుకూలించే ఒక రాజకీయ పవనంగా మార్చుకోవడం పై ఇక చంద్రబాబు పావులు కదపవచ్చు. టీఆర్ఎస్ సర్కారు ఉద్దేశపూర్వకంగా కాకపోయినా టీడీపీకి అనుకూలించే రీతిలో చర్యలు తీసుకుంటుందా? ఓటుకు నోటు కేసు లో కదలిక మొదలైతే ఆంధ్రప్రదేశ్ లో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయనే విషయాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఒకే ఒక కేసు ఇద్దరు ముఖ్యమంత్రులకు ఏరకంగా వర ప్రసాదినిగా మారిందో తెలుసుకుంటే రాజకీయాల అంతరంగం అర్థమవుతుంది.

కేసీఆర్ కు బ్రహ్మాస్త్రం…

నిజానికి తెలంగాణ ప్రభుత్వానికి , కేసీఆర్ కు ఓటు కు నోటు కేసు ఓ వరంలా లభించింది. ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాదును ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం నిర్దేశించింది. బొటాబొటి మెజార్టీతో గెలిచిన టీఆర్ఎస్ కు తొలినాళ్లలో అనేక విధాలుగా రాజకీయ ఇబ్బందులు తెలెత్తాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి రాజధానిపై రాజకీయంగా పట్టు సాధించడం సమస్యాత్మకంగా మారింది. ఇక్కడ తెలుగుదేశం, బీజేపీ శాసనసభ్యులే అధికంగా ఎన్నికయ్యారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారం లేదు. రాష్ట్రం ఇచ్చినప్పటికీ అధికారం తనకు దక్కలేదని కాంగ్రెసు పార్టీ అక్కసుతో విరుచుకుపడుతోంది. పరిపాలన అనుభవం అంతంతమాత్రమే ఉన్న మంత్రులు. ఉద్యమనేపథ్యం తప్ప ప్రజాసేవలో పరిణతి లేని శాసనసభ్యులు. రాజకీయ లౌక్యం తెలియని నేతలు. ఉద్యోగులు, ఆస్తుల విభజన నుంచీ అన్నీ సమస్యలే. ఎటు చూసినా ముందడుగు వేయలేని స్థితి. ఈ ప్రభుత్వం పూర్తికాలం మనుగడ సాగించలేదనే విష ప్రచారం సాగుతుండేది. ఈ పరిస్థితుల్లో అద్భుత అస్త్రంగా దొరికింది ఓటుకు నోటు కేసు. ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేకు లంచం ఇవ్వజూపారనేది అభియోగం. నిజానికి సార్వత్రిక ఎన్నికలు మొదలు రాజ్యసభ ఎన్నికల వరకూ అన్నిచోట్లా సాధారణ తంతుగా మారిన విషయమే ఇది. కానీ ఇచ్చేవారు, పుచ్చుకునేవారు కుమ్మక్కు కావడంతో బయటికి రాదు. కానీ ఇక్కడ వలవేసి తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో రాజకీయ అస్త్రం దొరికింది. అందులోనూ తెలుగుదేశం అధినేత పాత్ర కూడా ఉన్నట్లు ఆడియో ఆధారాలు దొరకడంతో కేసు ప్రాధాన్యం సంతరించుకుంది. ఎప్పుడు తన ప్రభుత్వంపై ఏ కుట్ర జరుగుతుందో తెలియక సతమతమవుతున్న కేసీఆర్ చకచకా పావులు కదిపారు. రాజధానిపైనా, పరిపాలనపైనా పట్టుదొరకక ఇబ్బందులు పడుతున్న కేసీఆర్ దీనిని రాజకీయాస్త్రంగా చక్కగా మలచుకున్నారు.

చాణుక్యుడు నిద్ర లేచాడు…

ఉమ్మడి రాజధానిలో చంద్రబాబు నాయుడు మకాం వేసి ఉన్నంతకాలం తనకు రాజకీయాధిక్యం కష్టసాధ్యమని కేసీఆర్ కు తెలుసు. హైదరాబాదు అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర, ఇక్కడ స్థిరపడిన రాయలసీమ, కోస్తాంధ్ర ప్రజల సంఖ్య ఎక్కువగా ఉండటం, రాజధానిపై గవర్నర్ కు ఉన్న విచక్షణాధికారాలు తెలంగాణ ప్రభుత్వ సంపూర్ణ అధికారాలకు ఆటంకంగా పరిణమించాయి. ఓటుకు నోటు కేసు తర్వాత కేసీఆర్ లోని చాణుక్యుడు నిద్ర లేచాడనే చెప్పాలి. రేవంత్ ను అరెస్టు చేయడమే కాకుండా చంద్రబాబు ఆడియో టేపులను ఫోరెన్సిక్ ధ్రువీకరణకు పంపించారు. చంద్రబాబుకు శిక్ష తప్పదని హెచ్చరికలు జారీ చేశారు. నైతిక స్థైర్యం కోల్పోయిన టీడీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. సాక్షాత్తు అధినేత తో ముడిపడటంతో టీడీపీ శ్రేణులన్నీ అయోమయానికి గురయ్యాయి. కేసీఆర్ టీడీపీని రాజకీయంగా చావు దెబ్బతీశారు. తన పరిపాలన కేంద్రాన్ని చంద్రబాబు అమరావతికి మార్చుకోవాల్సి వచ్చింది. కేసును ముందుకు తీసుకెళ్లకుండా మురగబెట్టేందుకు ఈమేరకు ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం కుదిర్చేందుకు ఒక కేంద్రమంత్రి కీలక పాత్ర పోషించారనే ప్రచారమూ అప్పట్లో విస్తృతంగా సాగింది. వాస్తవమేదైనప్పటికీ ఆ తర్వాత కాలంలోనే చంద్రబాబు ఏపీ పరిపాలన కేంద్రాన్ని అమరావతికి మార్చుకున్నారు. కేసీఆర్ తెలంగాణపై తన పట్టును ,పరిపాలనను స్థిరపరుచుకున్నారు. 2015 మేనెలలో చోటు చేసుకున్న ఈ సంఘటన గడచిన రెండున్నర సంవత్సరాలుగా స్తబ్ధంగా ఉండిపోయింది. మళ్లీ కేసీఆర్ దీనిని తవ్వి తీయడం వెనక కారణాలపై చర్చ మొదలైంది.

బాబు నెత్తిన పాలు…

చంద్రబాబు నాయుడు పరిపాలనపరంగా, రాజకీయంగా ప్రస్తుతం తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. 2014లో అనుభవజ్ణుడైన నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఓట్లేసి పట్టం గట్టారు. రాష్ట్ర విభజన కారణంగా ప్రజల్లో నెలకొన్న భావోద్వేగాలు, తక్షణం ఒక అద్భుత ఆంధ్రప్రదేశ్ ను ఆవిష్కరించుకోవాలన్న ఆకాంక్ష కలగలిసి టీడీపీ అధికారంలోకి వచ్చింది. అంతకుముందు వరకూ అనేక సర్వేల్లో ఎంతో ముందంజలో ఉన్న వైసీపీ ప్రజల సెంటిమెంటు ముందు ఓడిపోయింది. గడచిన నాలుగేళ్లుగా ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఏపీలో కనిపించడం లేదు. పైపెచ్చు అవినీతిపై తీవ్ర దుమారమే చెలరేగుతోంది. వైసీపీ క్రమేపీ పుంజుకొంటోంది. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదు. ఆయా పరిస్థితులన్నిటినీ మదింపు చేసుకున్న తర్వాతనే చంద్రబాబు బీజేపీకి దూరంగా జరిగారు. రాష్ట్ర సమస్యలకు కేంద్రాన్ని ప్రధాన దోషిగా చూపించేందుకు యత్నాలు మొదలు పెట్టారు. గతంలో తానే అవసరం లేదనుకున్న ప్రత్యేకహోదా సెంటిమెంటును రగిలించాలనే దిశలో దాదాపు ఒక ఉద్యమాన్నే నడుపుతున్నారు. అయినా ప్రజల్లో ఆశించిన స్పందన కనిపించడం లేదు. తనపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. కేసులు పెడుతుందని ప్రజలు అండగా నిలవాలని అభ్యర్థిస్తూ ఆత్మాభిమాన సెంటిమెంటునూ ప్రయోగించే దిశలో టీడీపీ అధినేత ప్రసంగాలు చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ఓటుకు నోటు కేసు డొంకను కదిలిస్తే కేంద్రమే తెలంగాణ ముఖ్యమంత్రి ద్వారా పరోక్షంగా తనపై కక్ష సాధింపునకు పూనుకొంటోందని చంద్రబాబు రాజకీయ ట్విస్టు ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. ప్రజల్లో ఇది సెంటిమెంటుకు దారితీస్తుంది. బీజేపీపై ఆంధ్రా ప్రజలు కోపంగా ఉన్నమాట వాస్తవం. అయితే అది టీడీపీకి ప్రయోజనం చేకూర్చే స్థాయిలో లేదు. ఓటుకు నోటు కేసును బూచిగా చూపించి కేంద్రం, కేసీఆర్ లను ఒకే గాటన కట్టగలిగితే టీడీపీకి ఏపీ ప్రజల భావోద్వేగ మద్దతు దొరుకుతుంది. అది ఓట్లు కురిపించే వట వృక్షంగా మారుతుంది. ఇటువంటి సంక్షోభ పరిస్థితులను సానుకూలంగా మలచుకోవడం ఎలాగో చంద్రబాబుకు బాగా తెలుసు. అయితే అంతటి అవకాశం కేసీఆర్ అందిస్తారా? లేకపోతే తూచ్ అంటూ కేసును ఎన్నికల వరకూ పక్కనపెట్టేస్తారా? అన్నది వేచి చూడాలి.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*