బాబు ఆక‌ర్ష్‌-2.. స‌క్సెస్ అయ్యేనా..?

మ‌రో ఆరేడు మాసాల్లోనే ఎన్నిక‌లు ఉన్నాయి. ఇప్ప‌టి వ‌రకు పాల‌నా ప‌రంగా చేసిన ద్వారా వ‌చ్చే ఫ‌లితం క‌న్నా..ఇప్ప‌టి నుంచి రాజ‌కీయంగా వేసే ప్ర‌తి అడుగుకీల‌కంగా మార‌నుంది. ఈ నేప‌థ్యంలో ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు ముందుకు వేస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల‌ను సాధ్య‌మైనంత వ‌ర‌కు లేకుండా చేసుకుంటే ఫ‌లితం ఏక ప‌క్షంగా మారుతుంద‌నే రాజ‌కీయ సిద్ధాంతాన్నిఆయ‌న అమ‌లు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇప్ప‌టికే ఒక ద‌ఫా ఇలాంటి సిద్ధాంతాన్ని అమ‌లు చేసిన చంద్ర‌బాబు.. ఇప్పుడు మ‌రోసారి ఇదే మార్గాన్ని ఎంచుకోవాల‌ని నిర్ణ‌యించుకు న్నారు. వైసీపీ టికెట్‌పై గెలుపొందిన ఎమ్మెల్యేలు, ఎంపీల‌ను ఆయ‌న ఆక‌ర్ష్ మంత్రంతో త‌న గూటికి చేర్చుకున్నారు.

ఈ సారి సీనియర్లే…..

దీంతో వ‌రుస పెట్టి 23 మంది ఎమ్మెల్యేలు, ఇద్ద‌రు ఎంపీలు కూడా వైసీపీ నుంచి జంప్ చేసి చంద్ర‌బాబు తీర్థం పుచ్చుకున్నారు. వీరిలో కొంద‌రికి చంద్ర‌బాబు మంత్రి ప‌దవులు కూడా ఇచ్చారు. ఇక‌, ఇప్పుడు ఎన్నిక‌లు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో పార్టీల‌తో సంబంధం లేకుండా గెలుపు గుర్రాలు, సీనియ‌ర్లు అని భావించే వారిని చంద్ర‌బాబు త‌న‌పార్టీలోకి ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌-2కి రంగం సిద్ధ‌మైంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఈ ద‌ఫా ఎక్కువ‌గా ఈ ఆప‌రేష‌న్‌లో మాజీలే క‌నిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఆక‌ర్ష్-2 జాబితాలో ప‌లువురు సీనియ‌ర్లు ఉన్నారు.

మురళి రాకను…..

శ్రీకాకుళం జిల్లా నుంచి కాంగ్రెస్ మాజీ నేత‌, మాజీ మంత్రి కొండ్రు ముర‌ళీని చేర్చుకోవాలని భావిస్తున్నారు. కొండ్రు ముర‌ళిని చేర్చుకోవాల‌ని టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు క‌ళా వెంక‌ట్రావే చెబుతున్న‌ట్టు స‌మాచారం. అయితే ముర‌ళీ రాక‌ను ప్ర‌తిభా భార‌తి వ్య‌తిరేకిస్తుండ‌డంతో ఆయ‌న ఎంట్రీ కాస్త లేట్ అవుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న్ను రాజాం నుంచి పోటీ చేయించాల‌న్న ప్ర‌తిపాద‌న ఉంది. విశాఖ‌ నుంచి స‌బ్బం హ‌రిని కూడా పార్టీలోకి చేర్చుకునేందుకు ఇప్ప‌టికే రంగం సిద్ధ‌మైంది. ఆయ‌న‌కు విశాఖ ఉత్త‌రం టికెట్ కూడా ఇవ్వాల‌ని నిర్ణ‌యించార‌ని తెలిసింది. అలాగే ఆయ‌న పేరు అన‌కాప‌ల్లి ఎంపీ సీటు రేసులోనూ ప‌రిశీల‌న‌లో ఉంది.

కొణతాల…సబ్బం హరిలను….

ఈయ‌న‌తోపాటు.. మాజీ మంత్రి వైసీపీ మాజీ నేత‌, ఉత్తరాంధ్ర‌పై మంచి ప‌ట్టున్న‌ కొణ‌తాల రామకృష్ణను కూడా పార్టీలోకి ఆహ్వానించాల‌ని బాబు నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. కొణ‌తాలకు అన‌కాప‌ల్లి పార్లమెంట్ సీటు ఇచ్చే (స‌బ్బం హ‌రి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ) అవ‌కాశం కనిపిస్తోంది. ఇక తూర్పు గోదావ‌రి జిల్లా నుంచి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌ కుమార్‌ను సైకిలెక్కించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. ఆయనకు రాజ‌మండ్రి ఎంపీ టికెట్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ట‌. అయితే ఉండవల్లి మాత్రం ఏ పార్టీలో చేరేది లేదని ఇప్పటికే ప్రకటించారు.అయినా ఇటీవ‌ల ఉండ‌వ‌ల్లి ప‌దే ప‌దే చంద్ర‌బాబును క‌లుస్తున్నార‌న్న సందేహాలు టీడీపీలోనే వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

రూపాదేవికి అసెంబ్లీ…..

ఇక్క‌డ ఎంపీ ముర‌ళీ మోహ‌న్ ఎలాగూ రిటైర్ అవుతున్నారు. ఆయ‌న కోడలు రూపాదేవికి అసెంబ్లీ టికెట్ ఇవ్వాల‌ని ప్రాధ‌మికంగా నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం. ఇక క‌ర్నూలు జిల్లాలో మంచి ప‌ట్టున్న కోట్ల ఫ్యామిలీని టీడీపీలో చేర్చుకునేందుకు తీవ్ర‌మైన ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇలా ఆప‌రేష‌న్‌-2లో కీల‌క నాయ‌కులు టీడీపీలో చేరితే.. ప‌రిస్థితిలో కీల‌క మార్పు ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*