గెలిపిస్తేనే చేసేస్తారా?

ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర రాజ‌కీయాల‌కు తెర‌దీశారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టిన ఆయ‌న‌.. గెలిచి తీరాల‌ని ఇప్ప‌టికే ఓ నిర్ణ‌యానికి వ‌చ్చా రు. అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ఒంట‌రిగా ఏ ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌ని చంద్ర‌బాబుకు ఇప్పుడు రాష్ట్రంలో విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. ప్ర‌ధానంగా వ‌చ్చే ఎన్నిక‌లు అంత ఈజీగా లేవు. బ‌ల‌మైన ప్ర‌తిప‌క్షం చంద్ర‌బాబు కంటిపై కునుకులేకుండా చేస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇద్ద‌రు బ‌ల‌మైన నేత‌ల‌ను(ఒక‌రు ప‌వ‌న్‌, రెండోవారు ప్ర‌స్తుత ప్ర‌ధాని మోడీ) వెంట‌బెట్టుకుని బ‌రిలో దిగిన‌ప్పుడే ప్ర‌స్తుత విప‌క్ష నేత జ‌గ‌న్ ఒంట‌రిపోరుతో 67 సీట్లను అసెంబ్లీకి ఏక ఛ‌త్రాధిప‌త్యంగా ముందుకు సాగారు. ఇక, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లోనూ వైసీపీ బాగానే స్కోర్ చేసింది. విస్తృత‌మైన టీడీపీ యాంటీ ప్ర‌చారంలోనూ వైసీపీ దూసుకుపోయింది.

తాను తప్ప ఏపీకి……

ఇక‌, మ‌రో ఆరేడు మాసాల్లోనే మ‌రోసారి రాష్ట్రం ఎన్నిక‌ల‌కు వెళ్ల‌నుంది. మ‌రి ఈ ఎన్నిక‌ల‌ను చంద్ర‌బాబు చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. వ‌రుస విజ‌యం సాధించి అధికార ప‌గ్గాలు చేప‌ట్టాల‌ని భావిస్తున్నారు. ఏపీకి తాను త‌ప్ప అభివృద్ధి చేసే నాధుడు లేడ‌ని ఆయ‌న ఇటీవ‌ల వ‌ర‌కు ప్ర‌చారం చేసుకున్నారు. అదేస‌మ‌యంలో రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాలు అవ‌స‌ర‌మా? అని కూడా ప్ర‌శ్నించారు. అయితే, ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ చంద్ర‌బాబుకు ఉత్కంఠ ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయి. త‌న‌తో క‌లిసి వ‌చ్చే నాయ‌కులు, పార్టీ ఒక్క‌టి కూడా క‌నిపించ‌డం లేదు. పైగా నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌న‌తో క‌లిసి న‌డిచిన జ‌న‌సేనాని ఇప్పుడు బాబుకు దూర‌మ య్యారు.

ఒంటరిపోరుతోనే….

మ‌రి ఈ క్ర‌మంలోనే ఆయ‌న రాజ‌కీయంగా ఒంట‌రి పోరును ఎలా ఎదుర్కొంటార‌నే ప్ర‌శ్న తెరమీదికి వ‌చ్చింది. అంతేకాదు, ప్ర‌స్తుతం ఆయ‌న విఫ‌ల‌మైన నాయ‌కుడిగానే కొన‌సాగుతున్న‌ర‌నే అభిప్రాయం కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఏ ఒక్క‌టీ కేంద్రం నుంచి సాధించిన దాఖ‌లాలు లేవు. పైగా రాష్ట్రంలో ప్ర‌భుత్వ యంత్రాంగం పూర్తిగా అవినీతి ఊబిలో కూరుకుపోయింది. దీంతో అటు జ‌గ‌న్ కానీ, ఇటు ప‌వ‌న్ కానీ చంద్ర‌బాబును ఈ విష‌యాల్లో ఏకేయ‌డం ఖాయ‌మ‌నే విష‌యం తెర‌మీదికి వ‌చ్చింది. అయితే, బాబు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారు. ఆయ‌న త‌న గురిని కేంద్రంలోని ప్ర‌భుత్వం ఏర్పాటుపై పెట్టారు.

కాంగ్రెస్ తో జత కలిస్తే….

రాష్ట్రానికి కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌లేక పోయింద‌ని, కాబ‌ట్టి వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌నమే కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తే.. ఏపీకి అన్ని విధాలా ప్ర‌యోజ‌నాల‌ను ఏర్చి కూర్చుకోవ‌చ్చ‌ని కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. అంటే ఏతా వాతా.. త‌న‌ను తిరిగి గెలిపించాల‌ని కోరుతున్నారు. అయితే, మ‌రి ఇంత‌లా కేంద్రంలోని ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తాన‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. పొత్తుల‌పై కూడా అంత‌లానే త‌పిస్తున్నారు. పొత్తు లేకుండా పార్టీ పోటీకి వెళ్లే ప్ర‌స‌క్తి క‌నిపించ‌డం లేదు. దీనికి తాజాగా కాంగ్రెస్ ఆయ‌న‌కు తురుపు ముక్క‌లా క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌స్తే.. హోదా ఇస్తామ‌ని రాహుల్ ప్ర‌క‌టించ‌డం బాబుకు ఆక‌లితో ఉన్న‌వాడికి ఆవిరి కుడుము దొరికిన చందంగా మారింద‌నే వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

బెడిసి కొడుతుందా?

ఏపీలో 25 ఎంపీ స్థానాల‌ను గెలిపించాల‌ని కొన్నాళ్లుగా పాట పాడుతున్నారు. నిజానికి ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వ పార్టీ తృణ‌మూల్ కాంగ్రెస్‌కు 38 మంది సొంత ఎంపీలు ఉన్నారు. మ‌రి వారు సొంత‌గా కేంద్రంలోని ప్ర‌భుత్వంపై అజ‌మాయిషీ చేసే అవ‌కాశం ఉందా? అంటే లేద‌నే చెప్పాలి. దీనికి ప్ర‌బ‌ల ఉదాహ‌ర‌ణ ఆ రాష్ట్రంపై కేంద్రం పెత్త‌నం చేయ‌డ‌మే! గ‌త ఏడాది అక‌స్మాత్తుగా శాంతి భ‌ద్ర‌త‌ల పేరు చెప్పి.. సైన్యాన్ని మోహ‌రించారు ప్ర‌దాని మోడీ, ఇక‌, ఇటీవ‌ల అస్సోంలో చొర‌బాట్ల వంక‌తో దాదాపు రెండు ల‌క్ష‌ల మందికి పౌర‌స‌త్వం లేద‌ని చెప్పారు. ఇలాంటివి జ‌రిగిన‌ప్పుడే అతిపెద్ద పార్టీగా ఎంపీల‌ను క‌లిగి ఉన్న త‌ణ‌మూల్ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ ఏమీ సాధించ‌లేదు. మ‌రి ఇప్పుడు 25 మంది ఎంపీల‌తో(బాబు గెలిస్తే) ఏం సాధిస్తారు? అనే మేధావుల‌ను తొలుస్తున్న మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌!! ఏదేమైనా.. చంద్ర‌బాబు వ్యూహం ఆయ‌న‌కు బెడిసి కొడుతుంద‌ని అంటున్నారు సీనియ‌ర్ నాయ‌కులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*