బాబు ‘‘సెల్ఫీ’’ మోజు చూశారా?

రాజు తలచుకుంటే కొదవేముందని….. కోట్ల రుపాయల ప్రజాధనంతో చేసిన అభివృద్ధి పనుల్ని అస్మదీయులకు కట్టబెట్టడం సాధారణమైపోయింది. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద రెండేళ్లుగా సుందరీకరణ పనులు చేపట్టారు. నగర వాతావరణాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే క్రమంలో గతంలో ఉన్న ఆక్రమణల్ని తొలగించి బ్యారేజీ దిగువున మూడు కిలోమీటర్ల పొడవున ఘాట్ ను నిర్మించారు. పుష్కరాలలో భాగంగా ప్రారంభించిన పనులు ఆ తర్వాత కూడా కొనసాగాయి. జలవనరుల శాఖ., నగర పాలక సంస్థ సంయుక్తంగా ఈ పనులు చేపట్టాయి. ప్రకాశం బ్యారేజీ దిగువున ఇటీవల సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. ఓ మీడియా సంస్థ ఆధ్వర్యంలో దాదాపు 9లక్షల రుపాయల వ్యయంతో సెల్ఫీ స్పాట్‌ను తయారు చేశారు. గతంలో హుస్సేన్ సాగర్ ఒడ్డున లవ్ హైదరాబాద్‌ అర్ధం వచ్చేలా ఏర్పాటు చేసిన అక్షరాల మాదిరే బ్యారేజీ అప్రోచ్ రోడ్డు వైపు వీటిని ఏర్పాటు చేశారు. అయితే ఇది సెల్ఫీ స్పాట్‌గా కంటే ఆ మీడియా సంస్థకు బ్రాండింగ్‌కు పనికొచ్చేలా ఎక్కువగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఎందుకు….

హ్యాపీ సిటీస్ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో పౌరభాగస్వామ్యంతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం కొన్నేళ్ల క్రితం మొదలైంది. ఎవరికి లాభం…..?మొదట్లో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ కార్యక్రమాలను సీపీ గౌతమ్ సవాంగ్ నిర్వహించారు. వీటి నిర్వహణలో విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కూడా భాగస్వామ్యం తీసుకుంది. క్రమంగా వీటి నిర్వహణ భారంగా మారడంతో స్పాన్సర్లను వెదికే క్రమంలో అప్పుడే విజయవాడలో ఎడిషన్ ప్రారంభించిన ఓ ఆంగ్లపత్రికను భాగస్వాముల్ని చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రితో జరిగిన చర్చల్లో సెల్ఫీ స్పాట్ ప్రతిపాదన వచ్చింది.

ప్రభుత్వ శాఖల అభ్యంతరం…..

నగరంలో టూరిస్ట్‌ స్పాట్‌లను ఏర్పాటు చేసే క్రమంలో ఓ కూడలిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి స్వయంగా సూచించడంతో ప్రకాశం బ్యారేజీ సమీపంలోని కృష్ణవేణి విగ్రహం వద్ద దీనిని ఏర్పాటు చేయాలని భావించారు. దీనిని విజయవాడ పోలీస్ కమిషనర్ సవాంగ్., నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో మళ్లీ పంచాయితీ సీఎం వద్దకు చేరింది. ముఖ్యమంత్రి మాట ఇచ్చేయడంతో వెనక్కి తగ్గే పరిస్థితి లేకపోవడంతో అనువైన స్థలాన్ని ఎంపిక చేసే బాధ్యత ప్రభుత్వ శాఖలపై పడింది. ఈ నిర్ణయంపై నగరపాలక సంస్థ., జలవనరుల శాఖ., పోలీస్ శాఖల నుంచి ప్రాథమికంగా అభ్యంతరాలు వ్యక్తమైనా పట్టించుకోలేదు. ఇప్పటికే కోట్లాది రుపాయల ప్రజాధనంతో అభివృద్ధి చేసిన ప్రాంతంలో ఓ సంస్థకు బ్రాండింగ్‌ వచ్చేలా చేయడం ఎంత వరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తినా లెక్క చేయలేదు.

అభ్యంతరాలు బేఖాతరు….

కృష్ణాపనదికి అభిముఖంగా….. గతంలో భూగర్భ వినాయకుడి గుడి ఉన్న ప్రదేశంలో మన అమరావతి అనే ఆంగ్ల అక్షరాలను ఏర్పాటు చేశారు. ఆగష్టు 15న ముఖ్యమంత్రి స్వయంగా దీనిని ప్రారంభించారు. వీటిని ఏర్పాటు చేయడానికి దాదాపు 9లక్షల రుపాయల ఖర్చు కాగా., ఇరిగేషన్ శాఖకు కొంత మొత్తాన్ని చెల్లించారు. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం కంటే ఆ సంస్థకు దక్కే ప్రచారమే ఎక్కువనే విమర్శ ఉంది. పూర్తిగా అభివృద్ధి చేసిన ప్రదేశంలో 9లక్షల ఖర్చుతో సెల్ఫీ స్పాట్ ను ఏ శాఖ అయినా సులభంగా ఏర్పాటు చేయగలిగేది. అయితే ఈ నిర్ణయం వెనుక మతలబు ఏమిటన్నది మాత్రం అంతుచిక్కదు. ప్రభుత్వ శాఖలైతే నిర్వహణ సక్రమంగా ఉండదనే భావనతో ఇలా చేశారని చెబుతున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయంటున్నారు.

కీలక కూడలి…..

విజయవాడ మీదుగా రాజధాని ప్రాంతానికి రాకపోకలు సాగించాలంటే ప్రకాశం బ్యారేజీ అప్రోచ్ రోడ్డు మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. అలాంటి ప్రాంతంలో సెల్ఫీ స్పాట్ పేరుతో ఓ సంస్థకు స్థలాన్ని కట్టబెట్టడం వెనుక అసలు కారణం ఏమిటన్నది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఈ ప్రాంతంలో రాత్రి పూట ఆకర్షణీయంగా కనిపించేలా లైటింగ్‌ కూడా ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వం డెవలప్ చేసిన ప్రాంతంలో ఏ సంస్థ అయినా ఇలాంటి ప్రతిపాదనే చేస్తే వారికి కూడా అనుమతులు ఇచ్చేస్తారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 5వ నంబరు జాతీయ రహదారిపై డీజీపీ కార్యాలయం సమీపంలో కూడా ఇలాంటి స్పాట్ ను అభివృద్ధి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ పనులు అమరావతి బ్రాండింగ్‌కు ఉపయోగపడతాయో., సదరు సంస్థలకు లబ్ది చేకూరుస్తాయా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*