వాళ్లకు తెలీదు….ఈయనకు చెప్పలేరు….!

సంక్షేమ కార్యక్రమాలు., ప్రభుత్వ పథకాలు., ముఖ్యమంత్రి సాధించిన విజయాలను ప్రచారం చేసేందుకు ఏకంగా ఓ మంత్రిత్వ శాఖే ఉన్నా ., ఆశించిన ఫలితం మాత్రం నెరవేరడం లేదు…. ముఖ్యమంత్రి చంద్రబాబు అంచనాలు… ఆలోచనల్ని అందిపుచ్చుకోవడంలో పబ్లిసిటీ గ్రూపుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడానికి నాలుగైదు గ్రూపులు పనిచేస్తున్నాయి. అయితే ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్…….. ఏపీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వందల కోట్ల రుపాయల ఖర్చు చేస్తున్నా అందుకు తగ్గ ఫలితాలు మాత్రం రావడం లేదు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. పార్టీ… ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడమంటే ప్రెస్ నోట్లు పంపి జబ్బలు చరుచుకుంటున్నారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రుల వద్ద ఎమ్మెల్వోలను ప్రవేశపెట్టారు. నెలకు 25వేల రుపాయల వేతనం చొప్పున నాలుగేళ్లుగా వీరి సేవలు వినియోగించుకుంటున్నారు. వీళ్లేం పని చేస్తారో ఎవరికి తెలీదు.  పార్టీ నేతల్లో కాసింత పట్టున్న వాళ్లు ఈ పోస్టుల్లో ఒదిగిపోయారు. కొద్ది మంది మినహా వీరిలో చాలామంది ఏ మాత్రం పబ్లిసిటీ సేవలు అందిస్తారో ఎవరికి అంతు చిక్కదు. ఇక విజయవాడలో ఉన్న కమిషనర్ కార్యాలయంలో డజను మందికి పైగా పనిచేస్తున్నారు. వీరికి కూడా 25 నుంచి 55వేల వరకు జీతాలు చెల్లిస్తున్నారు. ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లంతా ఏం పనిచేస్తారో కూడా తెలీదు. కాలక్షేపం చేసి సాయంత్రానికి ఇంటికి వెళ్లిపోవడం మినహా వీరితో ఒరిగేది కూడా ఏముండదు.

పరకాల ఉన్న సమయంలో……

ఇక ప్రభుత్వ మీడియా సలహాదారుగా పరకాల ప్రభాకర్ ఉన్న సమయంలో ఓ బ్యాచ్ సిఎంఓలో తిష్ట వేసింది. కీలకమైన సమావేశాల్లో సిఎంతో పాటు కూర్చుని ప్రెస్ నోట్లు తయారు చేయడం తప్ప వీరు చేసే పని ఏముండదు. కావాల్సిన ఛానళ్లకు ముందస్తు లీకులు ఇచ్చి తమ కుర్చీ కిందకు నీళ్లు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. పరకాల ఉన్న సమయంలో ఐ అండ్ పిఆర్ సిబ్బందిని ఏ మాత్రం ఖాతరు చేసే వారు కూడా కాదు. ముఖ్యమంత్రి తమ జేబులో మనిషి అన్నట్లు వీరి హవా సాగింది. పరకాల రాజీనామా తర్వాత కొన్నాళ్ళు సహాయ నిరాకరణ కూడా చేశారు. కీలక సమావేశాలకు సంబంధించిన సమాచారం మీడియాకు అందించకపోవడం వంటి పనులు కూడా చోటు చేసుకున్నాయి. ఇక ఇటీవలి కాలంలో సిఎంఓలోకి అంతర్జాతీయ మీడియా గ్రూప్ ప్రవేశించింది. ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తోన్న గ్రూప్ ఎం., ఎన్నికలు సమీపిస్తున్న వేళ పబ్లిసిటీ బాధ్యతలు తీసుకుంది. ఇందుకోసం ఈ సంస్థకు పెద్ద మొత్తంలో చెల్లిస్తున్నారు. ఇదంతా బాగానే ఉన్నా….అసలు లక్ష్యం మాత్రం నెరవేరడం లేదు. కీలకమైన సమయాల్లో అనుకూల కథనాలు., వార్తలు ., అందుకు సంబంధించిన సమాచారం ఇచ్చే వారే బాబుకు కరువయ్యారు. ప్రెస్ నోట్లు రాసే వారు మినహా., మీడియా సర్కిళ్లలో పరిచయం ఉన్న వారు., లైజినింగ్ చేయగలిగిన వాళ్ల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఎవరికి వారు. తమ గ్రూపు గొప్పదంటే., తమ గ్రూపు వల్లే అంతా జరుగుతోందనే భావనలో ఉండటంతో అసలుకే ఎసరొస్తోంది. ఇక పబ్లిసిటీ విభాగాల్లో పనిచేసే వారిలో కనీస పరిజ్ఞానం లేని వారిని కూడా చేర్చేసుకోవడం ఇంకో ఎత్తు. ఏదొక రాజకీయ నాయకుడి సిఫార్సుతోనో., అధికారుల ఒత్తిడితోనో పబ్లిసిటీ వింగ్‌లోకి ఎంటరై చెలరేగిపోతున్నారు. ఈ బృందాల్లో పనిచేసే వారిలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌ లు., అడ్వర్‌టైజింగ్ కన్సల్టెంట్లు కూడా మీడియా కలర్ ఇచ్చేసుకుంటున్నారు. ఇక డిజిటల్ పబ్లిసిటీ., ఎలక్ట్రానిక్ మీడియాల గురించి ఏ మాత్రం అవగాహన లేని వాళ్లు కూడా నాలుగేళ్లు సునాయసంగా నెగ్గుకొచ్చేశారు.

ప్రజలకు చేరవేయడంలో…

ఒకటా రెండా… వందకు పైగా సంక్షేమ కార్యక్రమాలు…..ఆర్ధిక ఇబ్బందులున్నా., లోటు బడ్జెట్‌లోను అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తున్న రాష్ట్రం…. సంతృప్తికర స్థాయిలో సంక్షేమాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నా దానిని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నాలు కొరవడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం అయా శాఖల అనాసక్తత కొంతైతే చేసింది చెప్పుకోలేని పరిస్థితి ఇంకొంత. కట్టుబట్టలతో నాలుగేళ్ల ఏర్పడిన రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నా దానిని సగర్వంగా చెప్పకొలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ సర్కారుది……దాదాపు 16వేల కోట్ల లోటు బడ్జెట్‌ తో ఆవిర్భవించిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో విజయవంతంగా మళ్లించగలిగినా ఆ విజయాలను ప్రచారం చేయడంలో మాత్రం వెనుకబడిపోతున్నారు. 2014 ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అందరి జీవితాలలో సంతోషాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నా ఆ విజయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమవుతోంది. రైతు రుణ మాఫీ., పట్టిసీమ ద్వారా గోదావరి నీటి మళ్లింపు., 17వేల కిలోమీటర్ల పొడవున గ్రామీణ రహదారుల నిర్మాణం., రాజధాని నిర్మాణం కోసం 33వేల ఎకరాల భూసమీకరణ., స్వయం సహాయక బృందాలకు రుణాలు., ఆరున్నర లక్షలమంది దళితులకు రుణాల పంపినీ., రెండున్నర కోట్ల మందికి భీమా పంపిణీ, బీసీ సంక్షేమం., కాపు సంక్షేమం., మైనార్టీ సంక్షేమం., బ్రహ్మణ సంక్షేమం., వికలాంగుల సంక్షేమం, మహిళా సాధికారత ద్వారా విస్తృతంగా ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేస్తోంది. విద్యా., వైద్యం., సామాజికాభివృద్ధి., సంక్షేమ రంగాలలో సంతృప్తికర స్థాయిలో ఫలాలు అందించాలన్నది ముఖ్యమంత్రి అభిలాషగా ఉంది. అయితే సాధించిన విజయాలను ప్రజలకు చేరువ చేయలేకపోవడమే అసలు సమస్యగా మారింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*