పుంగ‌నూరులో బాబు వ్యూహం ఫ‌లిస్తుందా…!

ఏపీలో ఎన్నిక‌ల రాజ‌కీయాలు ఊపందుకున్నాయి. ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ.. నాయ‌కులు దూసుకుపోతున్నారు. ఒక‌రిపై మ‌రొక‌రు పైచేయి సాధించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జ‌గ‌న్‌ను ఓడించేందుకు, అధికార పీఠానికి ద‌రిదాపుల‌కు కూడా రాకుండా చేసేందుకు అప‌ర చాణిక్యుడైన చంద్రబాబు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నారు. మ‌రి జ‌గ‌న్ ఊరుకుంటారా? ఆయ‌న అంత‌క‌న్నా ఎత్తుల‌కు పై ఎత్తులు వేస్తూ.. ముందుకు వెళ్తున్నారు. చంద్రబాబును మ‌ళ్లీ అధికారంలోకి రాకుండా చూసేందుకు త‌న వ్యూహాలు తాను సిద్ధం చేసుకుంటున్నా రు.మ‌రో ఏడెనిమిది మాసాల్లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఈ ఇద్దరి వ్యూహాలు చ‌ర్చకు దారితీస్తున్నాయి. తాజాగా చంద్రబాబు త‌న సొంత జిల్లా చిత్తూరులోని పుంగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంపై క‌స‌ర‌త్తు చేశారు.

నేతల మధ్య పొసగేనా?

పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం ఇన్‌చార్జిగా ఎన్‌.అనీషా రెడ్డిని ప్రకటించారు. వాస్తవానికి పుంగనూరు ఇన్‌చార్జిగా ఉన్న ఎం.వెంకట్రమణ రాజు టికెట్ ఆశించారు. అయితే, ఆర్థికంగా ఈయ‌న త‌ట్టుకోలేడ‌నే ఉద్దేశంతో నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్తలు ఎన్‌.శ్రీనాథ రెడ్డి, చల్లా రామ చంద్రారెడ్డి, వై.మధుసూదన నాయుడు, రామనాథం నాయుడులతో పాటు ముఖ్యనేతలు జి.మురళీ నాయుడు, గువ్వల రామకృష్ణారెడ్డిలతో చంద్రబాబు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో తెలుగుదేశం జెండా రెపరెపలాడాలని ఆదేశించారు. టీడీపీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లు వెంకట్రమణరాజు, చల్లా రామచంద్రారెడ్డి, వై.మధుసూదన నాయుడు తెలి పారు. అయితే, చంద్రబాబు మాత్రం పుంగనూరుపై ప్రత్యేక నివేదికలు తెప్పించుకున్నానని అన్ని కోణాల్లో ఆలోచించి అనీషా రెడ్డినే పోటీ చేయించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

మంత్రి చక్రం తిప్పడంతో…..

అయితే, అనీషారెడ్డి టికెట్ వెనుక మంత్రి అమ‌ర్నాథ‌రెడ్డి చ‌క్రం తిప్పడం గ‌మ‌నార్హం. నిజానికి గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్‌పై గెలుపొందిన అమ‌ర్నాథ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పేసి వ‌చ్చి చంద్రబాబు చెంత‌కు చేరారు. ఇప్పుడు ఈయ‌న త‌న త‌మ్ముడి భార్య అయిన అనీషారెడ్డికి టికెట్ ఇప్పించుకుంటున్నారు. అయితే, స్థానిక నాయ‌క‌త్వం మాత్రం ఇక్కడ ఆమెకు అనుకూలంగా ప‌నిచేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేద‌ని స్పష్టమైంది. చంద్రబాబు ద‌గ్గర‌కు వ‌చ్చిన వారిలో ముగ్గురు టికెట్‌ను ఆశిస్తున్నవారే. వీరిని కాద‌ని ఇప్పుడు ఓ మ‌హిళ‌కు ఇవ్వడం, అది కూడా ఇప్పటి వ‌ర‌కు ప్రజ‌ల్లో లేని మ‌హిళ‌కు కేటాయించ‌డంపై నేత‌లు మండిప‌డుతున్నారు. తాము గ్రౌండ్ లెవిల్లో పార్టీని డెవ‌ల‌ప్ చేశామ‌ని ఇప్పడు త‌మ‌ను కాద‌ని ఆమెకు ఇవ్వడం ఏంట‌ని అంటున్నారు.

ఆమెకు చెక్ పెట్టేందుకు……

అయితే, పైకి మాత్రం చంద్రబాబు మాట‌ను కాద‌న‌లేక వారు ముందుకు సాగిపోయినా.. అంత‌ర్గ‌త చ‌ర్చల్లో మాత్రం చాప‌కింద నీరులా ఆమెకు చెక్ పెట్టాల‌నేది నేత‌ల వ్యూహం. పైగా.. ఇక్కడ స్థానిక నేత‌ల అంచ‌నా ప్రకారం టీడీపీకి 30% మాత్రమే బ‌లం ఉంది. ఇక‌, సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామ‌చంద్రారెడ్డి హ‌వా ఏమాత్రమూ త‌గ్గలేద‌నేది టీడీపీ నేత‌లే చెబుతున్న మాట‌. ఆయ‌న‌ను ఎదుర్కొనేందుకు మ‌రింత బ‌ల‌మైన నేత‌ను దింపితే బాగుండేద‌ని, కానీ, రాజ‌కీయాల‌కు ప్రజ‌ల‌కు కొత్త అయిన అనీషారెడ్డిని దింపి సాధించేందేంట‌ని వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి పెద్దిరెడ్డి.. విప‌క్షంలో ఉన్నా.. ఇక్కడి ప్రజ‌ల‌కు నిత్యం అందుబాటులోనే ఉంటున్నారు. త‌న నిధులు, త‌న కుమారుడు ఎంపీ అవినాష్ రెడ్డి నిధుల‌ను కూడా ఇక్కడ ఖ‌ర్చు పెడుతున్నారు. దీంతో ఆయ‌న గెలుపు మ‌ళ్లీ న‌ల్లేరుపై న‌డ‌కే న‌నేది విశ్లేష‌కుల మాట‌. అయితే, బాబు వ్యూహం ఏమేర‌కు ఫ‌లిస్తుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*