‘‘ఆల్ ఈజ్ వెల్’’ కాదు బాబూ….!

వేల కోట్ల రూపాయల వ్యయం….. ఒక్క క్లిక్ తో చీమ చిటుక్కుమన్నా తెలుసుకునే పరిజ్ఞానం…. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత…. అవినీతి పరుల గుండెల్లో రైళ్లు…. పాలనలో జవాబుదారీతనం.. ఇలా చెప్పుకుంటూ వెళితే చాలానే ఉన్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మానస పుత్రికగా రియల్ టైం గవర్నెన్స్ ను అభివర్ణిస్తారు. అయితే ఇది నిజంగా అమలు జరుగుతుందా? దీనివల్ల సమస్యలు సకాలంలో పరిష్కారం అవతున్నాయా? లేక ఇందులో పనిచేస్తున్నఅధికారులు ముఖ్యంమంత్రినే మభ్యపెడుతున్నారా? లెక్కలు చూసి చంద్రబాబు చిరునవ్వులు చిందిస్తున్నారా? తన ప్రభుత్వంపై 82 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని బాబు పదే పదే చెప్పడం ఈ లెక్కలు చూసేనా? ఈ లెక్కల్లో బొక్కలెంత? రియల్ టైం గవర్నెన్స్ లో రియల్ ఎంత? తెలుగు పోస్ట్ ప్రత్యేక కథనం లో చూడండి.

భ్రమల్లో బాబు…..

గల్లీ నుంచి సిటీ వరకూ … సమస్య ఉంది అని తెలిస్తే 24 గంటలూ…. 365 రోజులు స్పందించే పాలన వ్యవస్థ….. వినడానికే ఎంత ఆనందంగా ఉంది. ఒక్క ఫిర్యాదుతో సమస్య చటుక్కున మాయమయిపోతుంది. అచ్చం ఇలాంటి మాటలే అధికారులు చెప్పి బాబు గారి చెవిలో పూలు పెడుతున్నారు…. ప్రజల మూడ్ ను తెలుసుకుని పాలన సాగించే ముఖ్యమంత్రి ఆ గణాంకాలు చూసి మరింత ముచ్చటపడి పోతున్నారు. నిజంగానే చిటెకలో సమస్యలు పరిష్కారమవుతున్నాయని భ్రమలో ఉన్నారు. టెక్నాలజీని అంది పుచ్చుకోవడంలో ఏపీ సీఎం చంద్ర బాబు తర్వాతే ఎవరైనా…. అందులో ఎలాంటి సందేహం లేదు…. అలాంటి చంద్ర బాబుని సైతం మభ్య పెట్టే యంత్రాంగం సచివాలయం సాక్షి గా సాగుతోంది. అంతా బాగుంది…, ఆల్ ఇస్ వెల్… అనే భావన కల్పిస్తూ భ్రమల్లో ఉంచే ప్రయత్నం సాగుతోంది. ఇదే ఆయన కొంప ముంచుతోంది. 2001లో ప్రారంభించిన ప్రభుత్వ పాలన- పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్‌ భాగంగా రియల్ టైం గవర్నెన్స్ ను ప్రారంభించారు. సెక్రటేరియెట్‌ డిపార్ట్‌మెంట్స్‌- లైన్‌ డిపార్ట్‌మెంట్స్‌ మధ్య సమన్వయం కోసమే ఆర్టీజి ఏర్పాటు చేస్తున్నట్లు మొదట్లో చెప్పారు. దీనికోసం ఏపీ సొసైటీస్‌ రిజిస్ట్రేషన్‌ యాక్ట్‌ ప్రకారం ఆర్టీజి సొసైటీని రిజిస్టర్‌ చేశారు. ఈ గవర్నెన్స్‌, టెక్నాలజీ, ఈ ప్రగతి- ఈ కమ్యూనికేషన్స్, ప్రజలే ముందు., పరిష్కార వేదిక.,సోషల్ మీడియాలను అనుసంధాన విభాగాలుగా చేర్చారు.

అత్యాధునికంగా…..

ఆర్టీజిలో భాగంగా స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో పాటు డిస్ట్రిక్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లను ఏర్పాటు చేశారు. ఆర్టీజి సొసైటీకి ముఖ్యమంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. 8మంది ఉన్నతాధికారుల్ని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. అన్ని శాఖల మంత్రులు., కార్యదర్శులు., విభాగాధిపతులు అందులో ఉంటారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌కు ఐటీ శాఖ మంత్రి ఛైర్మన్‌గా ఉంటారు. కోర్‌ డాటా సీఈఓ., ఈ ప్రగతి సీఈఓ., డిజిపి., ఏపీ ఫైబర్‌ నెట్ ఎండి., రెవిన్యూ కమిషనర్ అందులో సభ్యులుగా ఉంటారు. ఈ వ్యవస్థలన్ని పక్కాగానే ఉన్నా అందులో ఏం జరుగుతుందో మాత్రం చంద్రబాబుకు అందనంత దూరంలో ఉంది. ప్రభుత్వ శాఖలు…, పాలనా వ్యవహారాలన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా ప్రజలకు-పాలనా వ్యవస్థకు మధ్య దళారీ వ్యవస్థను నిర్మూలించే లక్ష్యంతో రెండేళ్ల క్రితం రియల్‌ టైం గవర్నెన్స్‌ వ్యవస్థను మొదలు పెట్టారు. గోదావరి పుష్కరాల సమయంలో మొదలుపెట్టిన కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఆ తర్వాత కృష్ణా పుష్కరాల నాటికి మరింత ఆధునికీకరించి ప్రభుత్వ శాఖలను అనుసంధానించారు.

బ్రహాండంగా ఉందంటూ……

నిత్యం పర్యవేక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో తన ఛాంబర్ పక్కనే ఓ విశాలమైన ప్రాంగణంలో రియల్ టైం గవర్నెన్స్ ను చంద్రబాబు ఏర్పాటు చేసుకున్నారు. 60-70 కంప్యూటర్లు… వాటి ముందు తలమునకలై పని చేసే సిబ్బంది. రాష్ట్రంలో ఎక్కడ ఎం జరిగినా క్షణాల్లో తెలుసుకునే యంత్రాంగం…. హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తీసిపోని యాక్షన్ ఇక్కడే నడుస్తుంది. అందులో అడుగుపెట్టాలంటే కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని దాటుకుని కాళ్ళకు జోళ్ళు విప్పి., ఫోన్లు బయటపెట్టి నాసా స్పేస్‌ సెంటర్‌లోకి వెళ్లినంత హంగామా తర్వాతనే ఎంట్రీ లభిస్తుంది. అయితే సంస్కరణల్లో భాగంగా చేపట్టిన ఈ రియల్ టైం గవర్నెన్స్ చంద్రబాబు అనుకున్న రీతిలో సాగడం లేదన్నది వాస్తవం. వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరగడమే తప్ప దీనివల్ల ఉపయోగమేదీ లేదన్నది బాబుకు తప్ప అందరికీ తెలుసు. బ్రహ్మాండంగా ఉందంటూ బాబుకు చేరుతున్న రోజువారీ నివేదికలు చూసుకోవడానికి బాగుంటాయే కాని, క్షేత్రస్థాయిలో సమస్యలు మాత్రం ఇక్కడి అధికారులు సిబ్బంది చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం లేదు. ఈ రియల్ టైం గవర్నెన్స్ ను సక్రమంగా అమలుచేయాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు వందలకోట్ల నిధులను కూడా కేటాయించారు.

అన్ని శాఖలపై పెత్తనం…..

ఈ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో తెలుసుకోడానికి మచ్చుకు కొన్ని ఉదాహరణలున్నాయి. కొంతకాలం క్రితం ఆకస్మిక వరదలు ముంచెత్తనున్నయంటూ పోలవరం విలీన మండలాల ప్రజలకు సమాచారంఅందించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఫోన్ మెసేజీలు వెళ్లాయి. అవే మెసేజీలు ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి కూడా అందాయి. కేవలం ఆధార్ డేటా బేస్‌ ఆధారంగా వాటికి లింక్ అయి ఉన్న మెసేజీలు వెళ్ళిపోయాయి. దీంతో స్థానికులు నిద్ర లేకుండా గడిపితే., ఇతర ప్రాంతాల్లో ఉన్న వారు తమ వారెలా ఉన్నారో తెలీక టెన్షన్‌ పడ్డారు.రియల్ టైం గవర్నెన్స్‌లో భాగంగా అన్ని ప్రభుత్వ శాఖలను ఒకే గొడుగు కిందకు చేర్చారు. జిఏడి పరిధిలోకి అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించి అయా శాఖలలో జరుగుతున్న పనులను పరిశీలించడం మొదలుపెట్టారు. ఇది సహజంగానే మిగిలిన శాఖలకు ఆగ్రహం కలిగించింది. దీంతో చాలా శాఖలు సహాయ నిరాకరణ మొదలుపెట్టాయి. సంతృప్తికర స్థాయి పౌర సేవలు సాధించాలని లక్ష్యం విధించడంతో తమపై ఆర్టీజి పెత్తనం ఏమిటని చాలా శాఖలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

డ్రోన్లతో నిఘా…

సర్వైలెన్స్‌ మానిటరింగ్., ప్రజా సమస్యలపై తక్షణ స్పందన ఆర్టీజి లక్ష్యాల్లో ఇవి కొన్ని మాత్రమే. అంకెల్లో అద్భుతాలు చేస్తూ అసలు విషయాలు దాచేస్తున్నారనే విమర్శ వినిపిస్తోంది.రోజుకు పదిలక్షల ఫోన్‌ కాల్స్‌ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ., ఫిర్యాదుల పరిష్కారంలో కొత్త రికార్డులు. ప్రారంభించిన ఏడాదిలో 40కోట్ల ఫోన్‌ కాల్స్‌ …. రియల్‌ టైం గవర్నెన్స్ వ్యవస్థకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉంది. వందల మంది ఉద్యోగులు., 24 గంటలు పనిచేసే యంత్రాంగం ఉన్నాయి. కాని అవి పనిచేసే తీరే ముక్కున వేలేసుకునేలా ఉంది. ప్రజా పరిష్కార వేదికలో ఇంటరాక్టివ్‌ వాయిస్ సిస్టం ద్వారా రోజుకు 15 లక్షల కాల్స్ చేసే సామర్ధ్యముంది. ఈ కాల్స్‌లో ఎక్కువ భాగం జనం వినకుండానే కాల్‌ కట్‌ చేసేస్తుంటారు. ఇక 1100 కాల్‌ సెంటర్‌కు గత ఏడాది 16.33 లక్షల ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదుల్ని అయా శాఖలకు పంపి పరిష్కరించే బాధ్యత రియల్ టైం గవర్నెన్స్ ది.

ఆ ధైర్యం ఎవరికుంది…?

వాతావరణ సమాచారం, వర్షపాతం వివరాలు., ప్రకృతి వైపరీత్యాలు ఇవన్ని మాకు ముందే తెలుస్తాయని ఆర్టీజి బాధ్యులు చెప్పుకుంటూ ఉంటారు. నిజానికి భారత వాతావరణ శాఖ ఇచ్చే సమాచారాన్ని కూడా సకాలంలో ఆర్టీజి ఇవ్వలేకపోతోంది. శాటిలైట్ చిత్రాలతో సహా వర్షపాతం వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతుంటాయి. ఎప్పుడైనా వర్షాలు కురిసినపుడు మినహా మిగిలిన సందర్భాల్లో ఆర్టీజి ఏం చేస్తుందో ఎవరికి తెలియదు.ప్రభుత్వాన్ని భమల్లో ఉంచి కొందరు పబ్బం గడుపుకునే వ్యవస్థగా ఏపీ రియల్‌ టైం గవర్నెన్స్ వ్యవస్థ తయారైంది. ఇటీవల కొన్ని నివేదికలలో 82శాతానికి పైగా సంతృప్తి వ్యక్తమైనట్లు ముఖ్యమంత్రికి నివేదికలు ఇచ్చారు. వాటిని సీఎం ప్రముఖంగా ప్రస్తావించారు. ఆర్టీజి నివేదికలపై ఆధారపడితే అంతే సంగతులని మంత్రులే వ్యాఖ్యనిస్తున్నారంటే దాని పనితీరు ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్డం పెట్టుకుని కొందరు ఆడింది ఆటగా సాగుతోంది. ఇదే భ్రమల్లో చంద్రబాబు ఉంటే పుట్టి మునగక తప్పదని తెలుగుదేశం పార్టీనేతలే గుసగుసలాడుకుంటున్నారు. అయితేచంద్రబాబు కు వాస్తవ పరిస్థితిని చెప్పే ధైర్యం మాత్రం ఎవరూ చేయడం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*