ఆ టీడీపీ సీటు కోసం ఎంపీ అల్లుడి ఫైటింగ్‌..!

చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం టికెట్ పోరు ఆస‌క్తిగా మారింది. ఇక్క‌డ నుంచి బ‌రిలోకి దిగేందుకు టీడీపీ నుంచి భారీ సంఖ్య‌లోనే పేర్లు వినిపిస్తున్నాయి. అది కూడా సీనియ‌ర్‌లు త‌మ వార‌సుల‌ను రంగంలోకి దించేందుకు రెడీ అవుతున్నారు. దీంతో ఇక్క‌డ పోటీ భారీగా పెరిగింది. విష‌యంలో కివెళ్తే.. స‌త్య‌వేడు నియోజ‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున త‌లారి ఆదిత్య ,తారా చంద్ర‌కాంత్‌ ఎన్నిక‌య్యారు. వైసీపీ త‌ర‌ఫున కే ఆదిమూలం ఆయ‌న‌కు గ‌ట్టి పోటీ ఇచ్చారు. అయిన‌ప్ప‌టికీ.. టీడీపీకి బ‌ల‌మైన ప‌వ‌నాలు వీయ‌డంతో ఇక్క‌డ ఆదిత్య విజ‌యం సాధించారు.

బాబు సొంత జిల్లా కావడంతో….

చంద్ర‌బాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో వైసీపీ మెజార్టీ స్థానాలు గెలుచుకున్నా ఇక్క‌డ మాత్రం టీడీపీ జెండాయే ఎగిరింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఇక్క‌డ టికెట్ కైవ‌సం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. అయితే, ఆదిత్యకు అటు ప్ర‌జ‌ల్లోను, ఇటు పార్టీలోనూ కూడా అస‌మ్మ‌తి పెరిగిపోయింది. నియోజ‌క‌వ‌ర్గానికి అందుబాటులో ఉండ‌ని నేత‌ల్లో ఈయ‌న ప్ర‌ధ‌మ వ‌రుస‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఎంత‌సేపూ బెంగ‌ళూరులోనే మ‌కాం వేస్తున్నార‌ని, పార్టీ కార్య‌క్ర‌మాల్లోనూ చురుగ్గా పాల్గొన‌డం లేద‌ని పార్టీలోనూ ఈయ‌న‌పై సీనియ‌ర్లు గుర్రుగా ఉన్నారు.

బాబు సర్వేలోనూ…..

ఇటీవ‌ల చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన ఎమ్మెల్యేల పెర‌ఫార్మెన్స్ జాబితాలో ఆదిత్య కేవ‌లం 50 % మార్కుల‌తో వెనుక‌బ‌డి ఉండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా ఈయ‌న వివిధ ప‌నుల‌కు సంబంధించి కాంట్రాక్ట‌ర్ల నుంచి బాగా తిన్నార‌నే పేరు తెచ్చుకున్నారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇచ్చే ప‌రిణామాలు చాలా త‌క్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఒక‌వేళ ఇచ్చినా.. కూడా ఆయ‌న గెల‌వ‌డం అంత ఈజీ కాద‌ని టీడీపీ నాయ‌కులే చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. ఈ ప‌రిణామాల‌ను అనుకూలంగా మ‌ల‌చుకుని.. ఇక్క‌డి నుంచి పోటీ చేసేందుకు టీడీపీలోనే నేత‌లు క్యూక‌ట్టారు. మాజీ ఎమ్మెల్యే హేమలత కుమార్తె, చిత్తూరు ఎంపీ శివ ప్రసాద్‌ అల్లుడు వేణు ఈ స్థానంపై క‌న్నేశారు. వీరిలో వేణు బ‌ల‌మైన అభ్య‌ర్థిగా క‌నిపిస్తున్నారు. ముఖ్యంగా చంద్ర‌బాబు వ‌ద్ద శివ‌ప్ర‌సాద్‌కు ఉన్న ప‌లుకుబ‌డి ఆయ‌న‌కు టికెట్ తెచ్చిపెడుతుంద‌ని, అదేస‌మ‌యంలో అల్లుడి గెలుపు కోసం శివ‌ప్ర‌సాద్ శాయ‌శ‌క్తులా కృషి చేస్తార‌ని అంటున్నారు.

టీడీపీకి కంచుకోట‌…

స‌త్య‌వేడు టీడీపీకి కంచుకోట‌గా ఉంది. గ‌త ఐదు ఎన్నిక‌ల్లో చూస్తే ఒక్క 2004లో మాత్ర‌మే ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసిన కె.నారాయ‌ణ‌స్వామి అప్ప‌టి సిట్టింగ్ ఎమ్మెల్యే ప్ర‌స్తుత చిత్తూరు ఎంపీ శివ‌ప్ర‌సాద్‌పై గెలిచారు. 1999లో ఇక్క‌డ నుంచి శివ‌ప్ర‌సాద్ అసెంబ్లీకి ఎన్నిక‌య్యారు. ఇక ఆయ‌న గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ చిత్తూరు ఎంపీగా గెలుస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ ఆయ‌న‌కు మంచి ప‌ట్టు ఉంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌త్య‌వేడు టికెట్ శివ‌ప్ర‌సాద‌రావు అల్లుడే వేణుకు కేటాయించే చాన్స్ ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, వైసీపీ కూడా ఇదే రేంజ్‌లో టీడీపీకి పోటీ ఇచ్చేందుకు గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామిని ఇక్కడకు మార్చే ఆలోచనలో ఉందని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో పోటీ ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంద‌ని తెలుస్తోంది.