ఆ ఇద్ద‌రిని చంద్ర‌బాబు ప‌క్క‌న‌ పెట్టేశారా..?

తెలంగాణ టీడీపీ నిర్వ‌హించిన మ‌హానాడులో ఇద్ద‌రు నేత‌లు క‌నిపించలేదు. ఒక‌రు ఎమ్మెల్యే కాగా.. మ‌రొక‌రు పార్టీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే. అయితే ఆ ఇద్ద‌రు రాక‌పోవ‌డంపై ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. వారే ప‌క్క‌కు జ‌రిగారా..? లేక‌.. పార్టీ నియ‌మ‌నిబంధ‌న‌కుల విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించార‌న్న కార‌ణంతో చంద్ర‌బాబే వారిని ప‌క్క‌న పెట్టేశారా..? అంటూ ఒక‌టే చ‌ర్చ. చంద్ర‌బాబుకు ఎంత న‌మ్మిన‌బంటుగా ఉన్న సీనియ‌ర్ నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణ‌య్య మ‌హానాడులో క‌నిపించ‌లేదు. దీనికి కార‌ణం ఇటీవ‌ల వారిద్ద‌రూ పార్టీకి వ్య‌తిరేకంగా చేసిన కామెంట్లేన‌ని, అందుకే వారిని ఆహ్వానించ‌లేద‌ని పార్టీ వ‌ర్గాలు అంటున్నాయి.

మోత్కుపల్లి మాత్రం……

అయితే హైద‌రాబాద్‌లో టీటీడీపీ మ‌హానాడుకు త‌న‌ను ఆహ్వానించ‌లేద‌ని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు చెప్పారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న తీవ్ర ఉద్వేగానికి లోన‌య్యారు. 15 ఏళ్లుగా చంద్రబాబు కోసం.. పార్టీ కోసం పనిచేశాన‌నీ.. త‌న‌ను ఇంత‌ చిన్న చూపు చూస్తారా.. అంటూ ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఒక దళిత నేతకు ఇచ్చే గౌరవమిదేనా’ అని ఆయ‌న‌ ప్రశ్నించారు. త‌న‌ను ఇలా అవమానపరచడం బాధగా ఉందని మోత్కుప‌ల్లి అన్నారు. మహానాడుకు వెళ్లే అదృష్టం త‌న‌కు లేద‌ని ఆయ‌న అన్నారు.

చంద్రబాబు కోసమే పనిచేసినా….

బాబు దగ్గర పనిచేసిన మంత్రులంతా పారిపోయినా తాను మాత్రం చంద్ర‌బాబు కోస‌మే ప‌ని చేశాన‌నీ, చివ‌ర‌కు ఆయ‌న‌ కూడా అవమాన పరిస్తే త‌న‌కు దిక్కెవరు? అంటూ మోత్కుప‌ల్లి ఆవేద‌న చెందారు. తెలంగాణ‌లో టీడీపీ మ‌నుగ‌డ క‌ష్ట‌మేన‌నీ, పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేస్తే అంద‌రికీ గౌర‌వ‌ప్ర‌దంగా ఉంటుంద‌నీ, ఆ దిశ‌గా చంద్ర‌బాబు ఆలోచించాల‌ని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన పార్టీ పొలిట్‌బ్యూరో స‌మావేశానికి మోత్కుప‌ల్లిని పిల‌వ‌కుండానే చంద్ర‌బాబు స‌మావేశం నిర్వ‌హించారు. అప్పుడు కూడా చంద్ర‌బాబు తీరుపై మోత్కుప‌ల్లి కొంత అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. త‌న‌ను పిల‌వ‌కుండా స‌మావేశం ఎలా నిర్వ‌హిస్తారంటూ ప్ర‌శ్నించారు. మోత్కుప‌ల్లికి ఆహ్వానం ఎందుకు ఇవ్వ‌లేద‌న్న ప్ర‌శ్న‌కు టీడీపీలో కూడా చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి.

పార్టీ మారతారనేనా?

ఆయ‌న పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసేయాల‌ని చెప్ప‌డంతో పాటు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌లో చేరి ఆ పార్టీ త‌ర‌పున పోటీ చేయాల‌నుకుంటున్న‌ట్టు బాబు వ‌ద్ద‌కు ఇప్ప‌టికే నివేదిక‌లు వెళ్లాయి. మోత్కుప‌ల్లి ఆలేరు సీటు ఇవ్వాల‌ని త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన టీఆర్ఎస్ దూత‌ల‌కు చెపితే కేసీఆర్ వ‌రంగ‌ల్ లోక్‌స‌భ సీటు ఆఫ‌ర్ చేసిన‌ట్టు స‌మాచారం. మోత్కుప‌ల్లి పార్టీ మారేందుకు బ‌లంగా నిర్ణ‌యం తీసుకున్నాడ‌న్న వార్త‌లు బాబు వ‌ద్ద బ‌లంగా ఉండ‌డంతోనే ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టార‌ని తెలుస్తోంది.

పదవి వస్తుందని…..

అయితే ఈ విష‌యంలో మోత్కుప‌ల్లిని కూడా పూర్తిగా త‌ప్పుప‌ట్ట‌లేం అని టీడీపీలోనే కొంద‌రు అంటున్నారు. ఏదో ఒక ప‌ద‌వి వ‌స్తుంద‌ని ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు వెయిట్ చేశార‌ని… ఇప్పుడు ఆ ఆశ‌లు తీర‌డంతోనే ఆయ‌న దారి ఆయన చూసుకుంటున్నార‌ని చెపుతున్నారు. ఇక ఎమ్మెల్యే ఆర్ కృష్ణ‌య్య ఇప్ప‌టికే కొత్త పార్టీ ఏర్పాటు చేసే యోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణ‌లో టీడీపీ మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని చెప్పిన మోత్కుప‌ల్లి.. మాహానాడుకు త‌ర‌లివ‌చ్చిన క్యాడ‌ర్‌ను చూసి కంగుతిన్న‌ట్లు స‌మాచారం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*