బాబు బెంగంతా వారితోనే…?

ప్ర‌స్తుతం ఏపీలో ఎన్నిక‌ల మూడ్ ఆవ‌రించింది. అన్ని పార్టీలూ ఎన్నిక‌ల సంగ్రామానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా అధికార టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని ఎన్నో ఆశ‌లు పెట్టుకుంది. వ‌రుస విజ‌యాలు సాధించ‌డం ద్వారా రాష్ట్రంలో త‌మ‌కు తిరుగులేద‌ని నిరూపించుకునేందుకు ఈ పార్టీ స‌మాయ‌త్త‌మ‌వుతోంది. అయితే, ఇది సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైంది. ఆయ‌న కుమారుడు, మంత్రి లోకేష్ కూడా పార్టీని మ‌ళ్లీ అదికారంలోకి తీసుకురావాల‌ని భావిస్తున్నారు. అదేవిధంగా కొంద‌రు మంత్రులు కూడా ప్ర‌యాస ప‌డుతున్నారు. మ‌రి మిగిలిన వారి సంగ‌తేంటి? వారేం చేస్తున్నారు? పార్టీ మ‌రోసారి గ‌ద్దెనెక్కాల‌ని వారికి లేదా? అంటే.. నూటికి నూరు పాళ్లు అంద‌రూ కూడా పార్టీ అధికారంలోకి రావాల‌నే కోరుకుంటున్నారు.

వైసీపీ నుంచి వచ్చిన వారితో….

అయితే, దీనికి సంబంధించి కృషి చేస్తున్న‌వారు మాత్రం.. వేళ్ల‌పై లెక్కించ‌ద‌గిన‌ట్టుగా ఉండ‌డం ఇప్పుడు పార్టీని, అధినేత‌ను క‌ల‌వ‌ర పెడుతున్న ప్ర‌ధాన విష‌యం. నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. నేత‌లు ఆధిప‌త్య ధోర‌ణితో దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నుంచి వ‌చ్చి టీడీపీలో కీల‌క స్థానాలు కైవ‌సం చేసుకున్న‌వారిపై అయితే, టీడీపీ సీనియ‌ర్లు కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆ జిల్లా ఈ జిల్లా అని లేకుండా అన్ని జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది మ‌రోప‌క్క‌, పార్టీలోనే ఉన్న సీనియ‌ర్ల‌ను.. జూనియ‌ర్లు లెక్క‌చేయ‌డం లేదు. మీది పాత చింత‌కాయ్ క‌బుర్లు అంటూ వారి మాట‌ల‌ను పెడ‌చెవిన పెడుతున్నారు. ఎవ‌రికి వారుగా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో చ‌క్రాలు తిప్పుతున్నారు. ఫ‌లితంగా ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీ ప‌లుచ‌న అయిపోతోంది.

ఇంటలిజెన్స్ నివేదిక….

ఇదే విష‌యాన్ని ఇంటిలిజెన్స్ అధికారులు చంద్ర‌బాబుకు వివ‌రించారు కూడా. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల పార్టీ స‌మ‌న్వ‌య క‌మిటీని రాత్రికి రాత్రి హాజ‌రుప‌రిచిన చంద్ర‌బాబు.. వారికి దిశానిర్దేశం చేశారు. పార్టీని చుల‌క‌న‌గా చూస్తున్న నేత‌ల‌కు గ‌ట్టి వార్నింగే ఇచ్చారు. నేను క‌ష్ట‌ప‌డుతున్నాను.. మీరు కూడా క‌ష్ట‌ప‌డి 25 ఎంపీ స్థానాల్లోనూ గెలుపొందేలా కృషి చేయాల‌ని దిశానిర్దేశం చేశారు. అదేస‌మ‌యంలో 150కి త‌గ్గ‌కుండా ఎమ్మెల్యే స్థానాలూ ద‌క్కించుకోవాలని బాబు కోరారు. అంతా బాగానే జ‌రిగింది. స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశానికి వ‌చ్చిన వారిలో ఓ న‌లుగురు త‌ప్ప మిగిలిన వారు మాత్రం తమ పంథాను వీడ‌లేదు.

క్రమశిక్షణ పూర్తిగా….

“ఆ.. బాబు చెప్పిన మాట‌లు అన్నీ చేస్తే. మేం నియోజ‌క‌వ‌ర్గాల్లో తిర‌గ‌లేం“- అని మీడియా ముందే వారు అనేయ‌డం సంచ‌ల‌నంగా మారిపోయింది. మ‌రి ప‌రిస్థితి ఇలా ఉంటే.. మ‌రో ప‌దిమాసాల‌కు అసంతృప్తుల బెడ‌ద బాబును మ‌రింత‌గా డీలా ప‌డేలా చేస్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పార్టీ మారి టీడీపీలోకి వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇప్ప‌ట‌కీ పాత‌, కొత్త నేత‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లేదు. ఏదేమైనా ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌పడుతోన్న వేళ టీడీపీలో క్ర‌మ‌శిక్ష‌ణ పూర్తిగా బాబు కంట్రోల్ త‌ప్పేస్తోంది. ఎంతో జూనియ‌ర్ అయిన మంత్రి అఖిల‌ప్రియ లాంటి వాళ్లు కూడా బాబును లెక్క చేయ‌ని ప‌రిస్థితి క‌నిపిస్తోంది. మ‌రి బాబు ఎన్నిక‌ల నాటికి పార్టీని లైన్లో పెట్టేందుకు ఎలాంటి వ్యూహం రెడీ చేసుకుంటారో చూద్దాం.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*