త‌మ్ముళ్లకు ఒక రూల్‌.. జ‌గ‌న్‌కు మ‌రో రూల్‌..!

ఏపీ సీఎం చంద్ర‌బాబు వ్య‌వ‌హార శైలి.. త‌మ్ముళ్ల‌కైతే ఒక‌విధంగా.. విప‌క్షం వైసీపీకైతే.. మ‌రో విధంగా మారిపోయింద‌నే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా విప‌క్ష నేత‌ల‌పై గ‌తంలో ఆయ‌న చేసిన కామెంట్లు.. ఇప్పుడు టీడీపీకే బూమ‌రాంగ్ మాదిరిగా త‌గులుతున్నా.. ఆయ‌న లైట్ తీసుకుంటున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ప్ర‌త్యేక హోదా అంశాన్ని 2015 నుంచి వైసీపీ నేత‌లు పెద్ద ఎత్తున చేప‌ట్టారు. ప‌లు రూపాల్లో ఉద్య‌మించారు కూడా. విప‌క్ష అధినేత జ‌గ‌న్ అయితే, పెద్ద ఎత్తున యువ భేరి పేరుతో విద్యార్థుల‌ను ఏకం చేయాల‌ని నిర్ణ‌యించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ప్ర‌తి క‌ళాశాల‌లోనూ పెద్ద ఎత్తున ప్ర‌త్యేక హోదా గురించి ప్ర‌సంగించి విద్యార్థుల్లో అవ‌గాహ‌న పెంచారు. ఇక‌, పార్టీ త‌ర‌ఫున కూడా ఆయ‌న నిర‌స‌న‌లు చేప‌ట్టారు. రాష్ట్ర బంద్‌కు విప‌క్షాలు పిలుపుకూడా ఇచ్చాయి.

గతంలో ఇలా….

అయితే, ఆయా స‌మ‌యాల్లో నిజ‌ంగా ప్రత్యేక హోదాపై శ్రద్ధ ఉండి ఉంటే.. చంద్ర‌బాబు వీరికి మ‌ద్ద‌తిచ్చి ఉండేవారు. కానీ, ఆయ‌న అప్ప‌ట్లో సుద్దులు చెప్పారు. “మీరు పోరాటం చేస్తోంది.. ఏ విష‌యంలో.. ఏపీకి ప్ర‌త్యేక హోదావిష‌యంపై. నిజానికి అది వేస్ట్‌. అస‌లు ప్ర‌త్యేక హోదా అంటే ఏంటో చెప్పండి? దానివ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు ఏంటో వివ‌రించండి? అవేవీ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌లు.. ప్ర‌త్యేక హోదా అంటూ రోడ్లు ఎక్కుతున్నారు.! నిజానికి ప్ర‌త్యేక హోదా పేరు త‌ప్పితే.. ప్యాకేజీలో అన్నీ అలాంటి ఫ‌లాలే.. బుట్ట‌మాత్ర‌మే మారింది పండ్లు మార‌లేదు! అయినా.. మీరు ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేయాల్సి వ‌స్తే.. అది ఇవ్వాల్సింది ఎవ‌రు? నేను కాదుక‌దా? కేంద్రం ఇవ్వాలి. అక్క‌డ పోరాటం చేయండి. ఢిల్లీ వీధుల్లో వేసుకోండి మీ నాట‌కాలు. అలా చేయ‌డం చేత‌కాకే ఇక్క‌డ విర్ర‌వీగుతున్నారు. ప్ర‌జ‌ల‌ను ఇబ్బంది పాలు చేస్తున్నారు“ అని పెద్ద ఎత్తున మీడియా మీటింగ్ పెట్టి మ‌రీ దులిపేశారు.

నెటిజెన్ల సూటి ప్రశ్న…

అయితే, ఇప్పుడు సీన్ క‌ట్ చేస్తే.,. విప‌క్షాల‌కు సుద్దులు చెప్పిన నాయ‌కుడు చంద్ర‌బాబు.. క‌డ‌ప ఉక్కు ఫ్యాక్ట‌రీ విష‌యంపై త‌మ్ముళ్ల‌తో ఆమ‌ర‌ణ దీక్ష చేయిస్తున్నారు. అది కూడా ఎక్క‌డైతే.. ఫ్యాక్ట‌రీ వ‌స్తుందో అక్క‌డే! నిజానికి పైన చంద్ర‌బాబు చెప్పిన సూత్రాన్ని ఇక్క‌డ అన్వ‌యిస్తే.. ఉక్కు ఫ్యాక్ట‌రీ ఇవ్వాల్సింది ఎవ‌రు? చంద్ర‌బాబా? మోడీనా? మ‌రి అలాంటప్పుడు.. ఈ త‌మ్ముళ్లు చేయాల్సిన పోరు ఎక్క‌డ‌? ఢిల్లీలోనా.. క‌డ‌ప‌లోనా?! ఇప్పుడు నెటిజ‌న్లు సంధిస్తున్న ప్ర‌శ్న‌లు ఇవే! విప‌క్షాలు ప్ర‌త్యేక హోదాపై ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేసిన‌ప్పుడు విరుచుకుప‌డ్డ చంద్ర‌బాబు.. అదే నోటితో.. క‌డ‌ప‌లో ఉక్కు సంక‌ల్పం చేస్తామ‌ని ప్ర‌క‌టిస్తున్నారు. అంటే.. విప‌క్షాల‌కైతే.. ఒక‌రూలు.. త‌న వారికైతే.. మ‌రో రూలా? అనేది నెటిజ‌న్ల ప్ర‌శ్న‌. మ‌రి దీనికి స‌మాధానం చెప్పేదెవ‌రు? ఏదేమైనా.. బాబు సిద్ధాంతం త‌న‌కు అనుకూలంగా తిర‌గ‌బ‌డింద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*